Political Crisis:‘మహారాష్ట్ర’ సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్‌

మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చీలికలు ఏర్పడిన అనంతరం తలెత్తిన రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు తన తీర్పుని రిజర్వ్‌ చేసింది.

2016లో నబమ్‌ రెబియా కేసులో తీర్పుని పునఃపరిశీలించాలంటూ విస్తృత ధర్మాసనానికి అప్పగించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులున్న ధర్మాసనం శివసేనలో చీలిక, కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకి సంబంధించిన పిటిషన్‌ను ఫిబ్ర‌వ‌రి 16న విచారించింది. ‘ ఠాక్రే, షిండే చీలికవర్గం తరఫు లాయర్ల వాదనలన్నింటినీ విన్నాం. నబమ్‌ రెబియా తీర్పుని పునఃపరిశీలించాలి. దానిని ఏడుగురు సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తున్నాం’ అని తెలిపింది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (22-28 జనవరి 2023)

ఏమిటీ నబమ్‌ రెబియా తీర్పు 
ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌కున్న అధికారాలపై అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నబమ్‌ రెబియా కేసులో 2016లో సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం శాసనసభ స్పీకర్‌ను తొలగించిన నిర్ణయం సభలో పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతికి ఉండదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో అప్పట్లో అధికార కాంగ్రెస్‌కు చెందిన సీఎం నబమ్‌ టుకీయేని గద్దె దించడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో అసమ్మతి నాయకుడు కలిఖో ఫుల్‌ తిరుగుబాటు చేశారు. దీంతో టుకీ సోదరుడైన అసెంబ్లీ స్పీకర్‌ నబమ్‌ రెబియా 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు స్పీకర్‌ రెబియాను తొలగిస్తూ తీర్మానం చేశారు. 
దీనిపై కాంగ్రెస్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, స్పీకర్‌ను తొలగించిన నిర్ణయం పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం ఉండదని సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పుని అనుసరించి సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి ఊరట లభిస్తుంది. మహారాష్ట అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, థాక్రే విధేయుడు నరహరి సీతారామ్‌ జిర్వాల్‌ను తొలగిస్తూ షిండే వర్గం ఇచ్చిన నోటీసు సభలో పెండింగ్‌లోనే ఉంది.   

Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణం

#Tags