Indian Elections: సార్వత్రిక ఎన్నికలపై చైనా గురి.. ఫలితాలను ప్రభావితం చేసే ఎత్తుగడ!!

భారత్‌దేశంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్‌ గ్రూప్‌లు గురిపెట్టాయని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్‌’ ఒక నివేదికలో వెల్లడించింది.

సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే లక్ష్యంగా తప్పుడు సమాచారంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చైనా ప్రభుత్వం ఇలాంటి గ్రూప్‌లకు అండగా నిలుస్తోందని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో ఎన్నికల విషయంలో చైనా అనుసరిస్తున్న ఎత్తుగడలపై మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌’ అధ్యయనం నిర్వహించింది. 

తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృత్రిమ మేధ(ఏఐ)తో యాంకర్లను, మీమ్స్, ఆడియోలు, వీడియోలను సృష్టించి, సోషల్‌ మీడియాలో పోస్టు చేసే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ తెలియజేసింది. కొన్ని నెలల క్రితం జరిగిన తైవాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో చైనా సైబర్‌ గ్రూప్‌లు క్రియాశీలకంగా పని చేశాయని వెల్లడించింది. వీటికి చైనా మిత్రదేశమైన ఉత్తర కొరియా కూడా మద్దతిస్తోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేధ సాయంతో సృష్టించిన సమాచారంతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు స్వల్పమేనని తేల్చిచెప్పింది.  

Lok Sabha Elections 2024: ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ఎంత డ‌బ్బు కావాలో తెలుసా..?

► చైనాకు చెందిన ఫ్లాక్స్‌ టైఫన్‌ అనే సైబర్‌ కంపెనీ ఇండియా ఎన్నికలపై దృష్టి పెట్టిందని మైక్రోసాఫ్ట్‌ నివేదిక స్పష్టం చేసింది. ఈ కంపెనీ ప్రధానంగా టెలికమ్యూనికేషన్ల వ్యవస్థపై దాడులు చేస్తూ ఉంటుంది.  
► భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు కేంద్ర హోంశాఖ కార్యాల యం, రిలయన్స్, ఎయిర్‌ ఇండియా వంటి కార్పొరేట్‌ సంస్థల ఆఫీసులను టార్గెట్‌ చేశామని చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న ఓ హ్యాకింగ్‌ గ్రూప్‌ ఫిబ్రవరిలో బహిరంగంగా ప్రకటించింది.  
► భారత ప్రభుత్వానికి చెందిన 95.2 గిగాబైట్ల ఇమ్మిగ్రేషన్‌ డేటాలోకి హ్యాకర్లు చొరబడినట్లు ‘వాషింగ్టన్‌ పోస్టు’ పత్రిక అధ్యయనంలో వెల్లడయ్యింది. లీక్‌ చేసిన ఫైళ్లను హ్యాకర్లు గిట్‌హబ్‌ అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు.  


► మయన్మార్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న అశాంతికి, సంక్షోభానికి భారత్, అమెరికా బాధ్యత వహించాలంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతున్న స్టార్మ్‌–1376 అనే సైబర్‌ కంపెనీ మాండరిన్, ఇంగ్లిష్‌ భాషల్లో ఏఐతో ఇటీవల వీడియోలు సృష్టించింది.    
► మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధతో తలెత్తుతున్న ముప్పు, ఏఐతో సృష్టిస్తున్న డీప్‌ఫేక్‌ కంటెంట్‌పై చర్చించారు.  
► కేవలం ఇండియా మాత్రమే కాదు, త్వరలో జరుగనున్న అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికలపైనా చైనా సైబర్‌ సంస్థలు దృష్టి పెట్టాయని మైక్రోసాఫ్ట్‌ గుర్తించింది.

Jamili Elections: 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'.. హంగ్ వస్తే?

#Tags