Maternity Leave: మహిళా ఉద్యోగులకు స్పీడ్‌ బ్రేకర్లుగా మారుతున్న ప్రసూతి సెలవులు!!

ఎంచుకున్న వృత్తి, ఉద్యోగంలో పురుషులతో సమానంగా రాణిస్తూ.. కంపెనీలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు స్పీడ్‌ బ్రేకర్లుగా మారుతున్నాయి.

కెరీర్‌ను ఒడిదుడుకులకు గురిచేస్తున్నాయి. వేతనాల విషయంలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని కంపెనీలు ఏకంగా ప్రసూతి సెలవులు పెడతారనే ఉద్దేశంతోనే కీలక పోస్టుల్లో మహిళలను నియమించేందుకు సైతం వెనుకాడుతున్నాయి. 
 
వీటితోపాటు ప్రసూతి సెలవులు అనంతరం వృత్తిపరంగా మహిళలు మరికొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్లోబల్‌ ప్రొఫెషనల్‌ సర్విసెస్‌ సంస్థ అయాన్‌ చేపట్టిన ‘వాయిస్‌ ఆఫ్‌ ఉమెన్‌ స్టడీ 2024’ సర్వేలో వెల్లడైంది. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల అనుభవాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోవడం కోసం ఈ సర్వే నిర్వహించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 560కు పైగా కార్పొరేట్‌ కంపెనీల్లో పని చేస్తున్న 24,000 మంది మహిళా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. 

వివక్షతో మహిళా భాగస్వామ్యంపై ప్రభావం 
➣ పని ప్రదేశాలు, ఉద్యోగ నియామకాల్లో లింగ వివక్ష కారణంగా దేశంలో శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువగా ఉంటోందని గతంలో ఇండియా డిస్క్రిమినేషన్‌ రిపోర్ట్‌ 2022 వెల్లడించింది. 
➣ ప్రతి మహిళకు ఆమె ఎదుర్కొంటున్న అసమానతల్లో 98 శాతం లింగ వివక్ష, రెండు శాతం విద్యా, పని అనుభవం రూపంలో ఉంటోందని ఆ నివేదికలో తెలిపారు. 
➣ మెటెర్నిటీ బెన్ఫిట్స్‌ యాక్ట్‌–2017 ప్రకారం గర్భం దాల్చిన మహిళా ఉద్యోగులకు 26 వారాల పాటు ప్రసూతి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కారణాలతో నేటికీ కొందరు యాజమానులు మహిళలను ఉద్యోగాల్లో నియమించుకోవడానికి, కీలక స్థానాల్లో ప్రోత్సహించడానికి వెనుకాడుతున్నారు.  

Mpox Virus: బీ అలర్ట్.. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న మంకీపాక్స్.. ఈ వ్యాధి లక్షణాలు ఇవే..

➣ వీరికి కీలక పదవులు అప్పగించినట్లయితే ప్రసూతి సెలవులు వంటి అంతరాయాలతో పనిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని యాజమాన్యాలు ఆలోచనలు చేస్తున్నట్లు మహిళా ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.  
➣ ఈ కారణాలతో తమను తక్కువ వేతనం, పార్ట్‌ టైమ్‌ పాత్రల్లోకి నెట్టివేస్తున్నాయని మహిళా ఉద్యోగులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. 

సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు ఇవే..
➣ 75 శాతం ప్రసూతి సెలవులు ముగించుకుని తిరిగి విధుల్లో చేరాక కేరీర్‌లో ఒకటి, రెండేళ్లు ఒడిదుడుకులు ఉంటున్నాయని వెల్లడించిన పని చేసే తల్లులు. 
➣ 40 శాతం ప్రసూతి సెలవుపై వెళ్లడం వల్ల తమ వేతనం, అంతకుముందు కంపెనీలో పోషించిన పాత్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వెల్లడించినవారు.   
➣ 42 శాతం పనిలో  పక్షపాతం ఎదుర్కొంటున్నామని అభిప్రాయపడినవారు.
➣ 53 శాతం నాయకత్వ స్థానాల్లో మహిళలు ఉంటే ఆ సంస్థలోని మహిళా ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపుతుందని, తమ కెరీర్‌ వృద్ధిపై నమ్మకం పెరుగుతుందని తెలియజేసినవారు.
➣ 90 శాతం కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించడం కోసం చాలెంజింగ్‌ ప్రాజెక్ట్‌లు చేయడానికి అదనపు సమయాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినవారు. 

Climate Change: మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వాతావ'రణం'.. నిరాశ్రయులవనున్న 4.50 కోట్ల మంది!!

#Tags