Skip to main content

Mpox Virus: బీ అలర్ట్.. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న మంకీపాక్స్.. ఈ వ్యాధి లక్షణాలు ఇవే..

ప్రాణాంతక మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.
Mpox Diseased Cases Rise In DR Congo As Country Awaits Vaccines   symtoms of  MPOX

మధ్య ఆఫ్రికా దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎంపాక్స్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రి శామ్యూల్-రోజర్ కంబా స్వయంగా ధృవీకరించారు. కాంగోలో ఎంపాక్స్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో అమెరికా, జపాన్ నుంచి వచ్చే వ్యాక్సిన్ల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇటీవ‌ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను ఎదుర్కోవడానికి టీకా కార్యక్రమాలను వేగవంతం చేయాలని ప్రభావిత దేశాలకు పిలుపునిచ్చింది.
 
స్వల్ప వ్యవధిలో పెరుగుతున్న కేసులుపై కాంగో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు.. కేసులు పెరుగుతున్న కాంగోకు 50 వేల టీకాలు పంపిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. మరోదేశం జపాన్‌ కూడా 35 లక్షల టీకా డోసును కాంగో పంపిస్తామని పేర్కొంది.   

ఎంపాక్స్‌పై అప్రమత్తమైన భారత్‌..
ఎంపాక్స్‌పై భారత్‌ అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయడం, విమానాశ్రయాల్లో తనిఖీలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా ఢిల్లీలోని మూడు నోడల్ ఆసుపత్రులు సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఎంపిక చేసింది. అనుమానిత రోగులపై ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్‌ చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసింది.

Mpox Virus: ఈ దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్‌ వైరస్‌!!

ఎంపాక్స్‌ లక్షణాలు..
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాపుతో పాటు చీము నిండిన పొక్కులు ఎంపాక్స్ వైరస్ సోకిన వ్యక్తుల్లో సాధారణ లక్షణాలుగా కనిపిస్తాయి. ఈ పొక్కులు ముఖంపై మొదలై క్రమంగా శరీరమంతా విస్తరిస్తున్నాయి. సాధారణంగా ఈ పరిస్థితి రెండు నుంచి నాలుగు వారాలు ఉంటుంది. ఏ చికిత్స తీసుకోకున్నా అది తగ్గిపోతుంది కానీ.. ఆ తర్వాత దాని వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.  

కొన్ని సందర్భాల్లో అది ఏకంగా మరణానికీ దారితీస్తుండటం ఆందోళన కలిగించే అంశం. మరీ ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువ ఉండేవాళ్లు, అప్పటికే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైరస్ బారిన పడితే కోలుకోవడం కష్టంగా మారుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.

ఎంపాక్స్‌ కేసులు వెలుగులోకి..
మంకీపాక్స్‌ను ఎంపాక్స్ అని కూడా అంటారు. 1958లో కోతులలో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దీనిని తొలిసారిగా గుర్తించారు. ఇటీవలి మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో ఎంపాక్స్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. 2022 నుంచి ఇప్పటివరకు 116 దేశాల్లో ఎంపాక్స్‌ వైరస్‌ విస్తరించింది. మొత్తం 99,176 కేసులు నమోదు కాగా.. 208 మంది మ‌ర‌ణించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 15,600 కేసులు నమోదు కాగా 537 ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో 2022 నుంచి ఇప్పటివరకు 30 ఎంపాక్స్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మార్చిలో చివరి కేసును గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

Air Pollution: నిత్యం 2 వేల మంది చిన్నారుల మృతి.. కార‌ణం ఇదే..!

Published date : 20 Aug 2024 02:06PM

Photo Stories