Skip to main content

Goodbye to India: ఐదేళ్లలో భారత్‌తో బంధానికి బైబై చెప్పిన 8.34 లక్షల మంది!!

గత ఐదేళ్లలో 8.34 లక్షల మంది భారతదేశ‌ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
8.34 lakh people renounced Indian citizenship in last five years

విదేశాల్లో మెరుగైన విద్య, ఉద్యోగావకాశాలు, అత్యుత్తమ వైద్య సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పన్ను ప్రయోజనాలు వంటి కారణాలతో భారత పౌరసత్వం వదులుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలోనే ఏకంగా 8.34 లక్షల మంది భారతీయలు దేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశీ పౌరులుగా మారారు. 

పౌరసత్వం వదులుకుంటున్నవారి సంఖ్య కోవిడ్‌కు ముందు (2011–2019) సగటున 1.32 లక్షలుగా ఉంటే.. ఆ తర్వాత 2020–2023 మధ్య 20 శాతం పెరగడం గమనార్హం. ఉన్నత విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. మెరుగైన ఆర్థిక అవకాశాలు, ప్రశాంత జీవితం, నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం అక్కడే స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు. 

పైగా భారత పాస్‌పోర్టుతో చాలా దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే అమెరికా, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్, ఆ్రస్టేలియా, సింగపూర్‌ వంటి దేశాల పాస్‌పోర్టులతో ప్రపంచంలో చాలా దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయొచ్చనే భావన కూడా భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి పురిగొల్పుతోంది.  

➤ 2018 నుంచి 2023 వరకు 114 దేశాల్లో భారతీయులు పౌరసత్వాన్ని స్వీకరించారు.  
➤ వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీల్లో స్థిరపడ్డారు.  
➤ గత ఆరేళ్లలో 70 మంది పాకిస్థాన్, 130 మంది నేపాల్, 1,500 మంది కెన్యా పౌరసత్వాన్ని కూడా స్వీకరించారు.  
➤ విదేశాల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయ విద్యార్థులే అత్యధికం.
➤ 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.

8.34 lakh people renounced Indian citizenship in last five years

ఓసీఐతో వీసా లేకుండానే భారత్‌కు వచ్చే వీలు.. 
ఇతర దేశాల్లో పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. విదేశాల్లో మాదిరిగా ద్వంద్వ పౌరసత్వం అనేది మన రాజ్యాంగంలో లేదు. భారత పౌరసత్వం వదులుకున్న వ్యక్తులు ఇక్కడికి తిరిగి రావాలంటే కచ్చితంగా వీసా ఉండాల్సిందే. బంధువులు, కుటుంబం కోసం తరచూ భారత్‌కు వచ్చివెళ్లే వారి కోసం 2003లో పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌ (పీఐవో) కార్డును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి0ది. ఇది పాస్‌పోర్టులా పదేళ్లపాటు పనిచేస్తుంది. అయితే దీన్ని 2015 నుంచి నిలిపేశారు. 

2006 నుంచి ఓవర్‌సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డును జీవితకాల పరిమితితో జారీ చేస్తున్నారు. ఇది ఉంటే వీసా లేకుండానే భారత్‌కు వచ్చే వీలు ఉంటుంది. భారత్‌లో ఉంటూనే ప్రైవేటు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ద్వంద్వ పౌరసత్వాన్ని అమల్లోకి తెస్తే భారత పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య తగ్గుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Climate Change: మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వాతావ'రణం'.. నిరాశ్రయులవనున్న 4.50 కోట్ల మంది!!
Published date : 21 Aug 2024 01:06PM

Photo Stories