Natural Disasters: ఈ ఏడాది భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు ఇవే..

ఈ సంవ‌త్స‌రం(2024)లో భార‌త‌దేశం ఫెంగల్ తుఫాను, వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం లాంటి అనేక భీకర విపత్తులను ఎదుర్కొంది.

వీటి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు చోట్ల జనజీవనం స్తంభించింది. 2024లో భారతదేశంలో సంభవించిన అత్యంత భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల గురించి ఇక్క‌డ‌ తెలుసుకుందాం.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి..
2024, జూలై 30న కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 420 మందికి పైగా జనం మృతి చెందారు. 397 మంది గాయపడ్దారు. 47 మంది గల్లంతయ్యారు. 1,500కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు.

రెమాల్ తుఫాను తాకిడికి..
2024లో సంభవించిన రెమాల్‌ తుఫాను ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించింది. ఇది 2024, మే 26న పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్‌లోని సుందర్‌బన్ డెల్టాను తాకింది. ఈ తుఫాను కారణంగా సంభవించిన పలు ప్రమాదాలలో 33 మంది మృతి చెందారు. పలు చోట్ల భారీ విధ్వంసం సంభవించింది. ఈ తుఫాను బెంగాల్, మిజోరం, అస్సాం, మేఘాలయలో భారీ నష్టం వాటిల్లింది.

ఫెంగల్ తుఫాను 
2024, నవంబర్ 30న ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలోని తీరాన్ని తాకింది. ఈ తుఫాను కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 19 మంది మృతిచెందారు. వేలమందిని ఈ తుఫాను ప్రభావితం చేసింది. భారీ వర్షాలతో ఈ తుఫాను బీభత్సం సృష్టించింది. నాడు పుదుచ్చేరిలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు, పొలాలు జలమయమయ్యాయి. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఫెంగల్‌ తుఫాను కారణంగా భారీ నష్టం వాటిల్లింది.

విజయవాడ వరదల్లో..
2024, ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలతో పాటు నదులు ఉప్పొంగిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 2.7 లక్షల మందికి పైగా జనం ప్రభావితమయ్యారు. బుడమేరు వాగు, కృష్ణా నది నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

Godavari Basin: గత మూడేళ్లుగా అతిభారీ వర్షాలు, వరదలు

హిమాచల్‌లో వరదలు
2024 జూన్ నుండి ఆగస్టు వరకు హిమాచల్ ప్రదేశ్‌లో  వరదలు సంభవించాయి. ఈ సందర్భంగా సంభవించిన పలు దుర్ఘటనల్లో 31 మంది మృతిచెందారు. 33 మంది గల్లంతయ్యారు. లాహౌల్, స్పితి జిల్లాలో అత్యధిక నష్టం సంభవించింది. 121 ఇళ్లు ధ్వంసమవగా, 35 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా హిమాచల్‌ రాష్ట్రానికి రూ.1,140 కోట్ల నష్టం వాటిల్లింది.

అస్సాం వరదలు
2024లో అస్సాంలో సంభవించిన వరదల కారణంగా చోటుచేసుకున్న వివిధ ప్రమాదాల్లో 117 మంది మృతిచెందారు. 2019 నుంచి ఇప్పటి వరకు అస్సాంలో వరదల కారణంగా మొత్తం 880 మంది మృత్యువాత పడ్డారు. వరదల కారణంగా జనజీవనం పూర్తిగా అతలాకుతలమైంది.

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి వెయ్యి రోజులు

#Tags