Swachh Survekshan Awards 2023: స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇందులో ఏపీకి నాలుగు అవార్డులు..

ఢిల్లీలోని భారత్‌ మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను జ‌న‌వ‌రి 11వ తేదీ ప్రదానం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌–2023 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగు జాతీయ, ఒక రాష్ట్రస్థాయి అవార్డులు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో ఫైవ్‌స్టార్‌ రేటింగ్స్‌తో నాలుగు కార్పొరేషన్‌లు ‘క్లీన్‌సిటీ’ అవార్డులను సొంతం చేసుకుని దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో అత్యుత్తమ నగరాలుగా గ్రేటర్‌ విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర పాలక సంస్థలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హార్థీప్‌సింగ్‌ పూరీ చేతుల మీదుగా మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌లు, అధికారులతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ అవార్డులు అందుకున్నారు. పారిశుధ్యం విభాగంలో సర్వే, టెస్ట్‌ ప్రాక్టీస్, సిటీజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జారీచేస్తుంది.

ముఖ్యంగా గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఆలిండియా 4వ ర్యాంకు, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 6వ ర్యాంకు, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 8వ ర్యాంకు లభించగా.. హైదరాబాద్‌ తొమ్మిది, ఇండోర్‌ మొదటి స్థానంలో నిలిచాయి. అలాగే, ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీ విభాగంలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 2వ ర్యాంకు లభించింది. సీఎం వైఎస్‌ జగన్‌ నియోజకవర్గమైన పులివెందులకు ‘క్లీన్‌ సిటీ ఆఫ్‌ ఏపీ’ అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా నాలుగు వేల పట్టణ స్థానిక సంస్థలు పోటీపడగా ఏపీ టాప్‌–10లో నిలవడం విశేషం. 

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ రూపొందించిన సర్వీస్‌ లెవల్‌ ప్రోగ్రెస్, సర్టిఫికేషన్, సిటిజన్‌ వాయిస్‌కి సంబంధించి 9,500 మార్కులకు గాను గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) 8,879.25 మార్కులు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే చెత్తరహిత నగరాల్లో ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ను విశాఖ సాధించింది. మరోవైపు.. 

♦ 2021, 2022, 2023 సంవత్సరాలలో గ్రేటర్‌ విశాఖ బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్, క్లీన్‌ బిగ్‌ సిటీ.. విజయవాడ కార్పొరేషన్‌ ఇండియా క్లీనెస్ట్‌ సిటీ, క్లీన్‌ స్టేట్‌ క్యాపిటల్‌ జాతీయ అవార్డులను వరుసగా సాధించి హ్యాట్రిక్‌ సొంతం చేసుకున్నాయి.  

♦ ఇక తిరుపతి నగరం బెస్ట్‌ స్మాల్‌ సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ (2021), సఫాయిమిత్ర సురక్షిత్‌ ప్రెసిడెంట్‌ అవార్డు (2022), జాతీయ అవార్డు (2023) దక్కించుకుంది.  

♦ పుంగనూరు పురపాలక సంఘం 2021, 2022లో బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ అవార్డును, పులివెందుల 2022లో ఇన్నోవేషన్, బెస్ట్‌ ప్రాక్టీస్‌ అవా­ర్డు, 2023లో స్టేట్‌ అవార్డును దక్కించుకున్నాయి.  

వరసగా ఏడోసారి తొలిస్థానం..
ఈ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందౌర్‌ నగరం వరసగా ఏడోసారి మొద‌టి స్థానంలో నిలిచింది. ఇందౌర్‌తో పాటు గుజరాత్‌లోని సూరత్‌ కూడా తొలి ర్యాంక్‌ దక్కించుకుంది. ఈ జాబితాలో నవీ ముంబయి మూడో స్థానంలో, దిల్లీ ఏడో స్థానంలో, హైదరాబాద్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 4,447 పట్టణాలు సర్వేలో పాల్గొన్నాయి.

పెరిగిన స్టార్‌ రేటింగ్‌ నగరాలు.. 
ఇదిలా ఉంటే.. గతేడాది కంటే ఈసారి ఎక్కువ నగరాలు స్టార్‌ రేటింగ్‌ ర్యాంకింగ్‌లో నిలిచాయి. గార్బేజ్‌ ఫ్రీ సిటీ రేటింగ్‌లో గతేడాది జీవీఎంసీ, తిరుపతికి మాత్రమే ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ వచ్చాయి. ఈసారి విజయవాడ, గుంటూరు, జీవీఎంసీ, తిరుపతి నగరాలూ ఈ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. వీటితోపాటు కర్నూలు, వైఎస్సార్‌ కడప 3 స్టార్‌ రేటింగ్‌లోను, బొబ్బిలి, పులివెందుల, రాజమండ్రి 1 స్టార్‌ రేటింగ్‌లోను నిలిచాయి.  

స్వచ్ఛతలో విశాఖ మెరిసిందిలా..
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖ దేశంలోనే టాప్‌–5లో నిలవడం గర్వంగా ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ చేతులమీదుగా అవార్డు అందుకున్నాం. ఈ అవార్డును నగర ప్రజలకు అంకితం చేస్తున్నాం. విశాఖ నగర ప్రజల సహకారంతోనే ఈ ర్యాంక్‌ సాధ్యమైంది. ఇందులో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, పాలకమండలి, అధికారులు, సిబ్బంది, ఆర్‌డబ్ల్యూఎస్‌, నేవల్‌, పోలీస్‌, విద్యాసంస్థలు, ఎన్జీవోల కృషి ఉంది. 2024లో టాప్‌–1లో నిలిచేందుకు నిరంతరం శ్రమిస్తాం. కేవలం ర్యాంకు కోసమే కాకుండా.. ప్రజలకు సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు నిరంతరం పాటుపడతాం. – సాయికాంత్‌వర్మ, జీవీఎంసీ కమిషనర్‌

 

#Tags