Sakshi Malik Success Story : భారత గొప్ప మల్ల యోధురాలు 'సాక్షి మాలిక్' స‌క్సెస్ స్టోరీ.. చివ‌రికి కన్నీటితో..

సాక్షి మాలిక్‌.. భారత గొప్ప‌ మల్ల యోధురాలు. ఈమె హర్యానాకు చెందిన వారు. రియో ఒలింపిక్‌ 2016 పోటీల్లో రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మన భారత దేశానికి ఇదే మొదటి పతకం అయ్యింది. ఈ క్రీడాకారిణి సాధించిన మరిన్ని ఘన విజయాలు.. వివాదాలపై ప్ర‌త్యేక స్టోరీ మీకోసం..

సాక్షి బాల్యం..
హర్యానాలోని రోహతక్‌లో మోఖ్రా గ్రామానికి చెందిన సుదేష్‌, సుఖ్‌బీర్‌కి 3 సెప్టెంబర్‌ 1992 లో సాక్షి మాలిక్‌ జన్మించింది. సాక్షి తన చిన్న వయస్సులోనే తన తాతయ్య క్రీడా మల్ల యోధుడైన సుబీర్‌ మాలిక్‌ను చూసి ఆదర్శంగా తీసుకుంది. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆస​క్తి ఉన్నా, తన తాతయ్యను చూశాక‌ మరింత మెరుగైంది. తను కూడా తన తాతయ్యలా ఎదగాలనుకుంది. ఈ విధంగా తాను క్రీడల్లో రాణించాలని ఆశించింది. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్‌ తన పన్నెండేళ్ల (12) వయస్సులోనే రెజ్లింగ్‌లో చేరింది. ముందునుంచే క్రీడల్లో ఆసక్తిగా ఉండే సాక్షికి తన తాతయ్య ఆదర్శంగా నిలిచారు.

శిక్షణకు ఎన్నో విమర్శలు.. అయినా కూడా..

కుస్తీ పట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నా, తను శిక్షణ పొందాలన్నా, అభ్యాసం ఉండాలన్నా తను వారి ఊరి అబ్బాయిలతో మాత్రమే కుస్తీ పట్టాలని అక్కడి ప్రజలు, వారి బంధువులు, స్థానికులు చెప్పారు. అయినా సరే, సాక్షి వెనుకడుగు వేయలేదు. ఎవ్వరూ తనకు సహకరంగా నిలవకపోయినా, తన కోచ్‌ ఈశ్వర్‌ తనకు అండగా నిలిచారు. క్రీడల్లో రాణించాలంటే ఉండాల్సిన లక్షణాలను గురించి శిక్షణ ఇచ్చారు. అందులోనూ ఒక మ‌హిళ‌ క్రీడల్లో ముందుండాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. దీని ప్రకారంగా తన కోచ్‌ తనకు శిక్షణను ఇవ్వడం ప్రారంభించారు. 

క్రీడా జీవితం..

శిక్షణ ప్రారంభం అయిన‌ ఐదు ఏళ్ళ తరువాత అంటే.. 2009లో ఆసియా జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 59 కిలోల ఫ్రీస్టైల్‌లో రజత పతకాన్ని సాధించింది. దీనిని ఆమె తన మొదటి విజయంగా తన గెలుపు ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ పోటీల్లోకి వెళ్ళడం ప్రారంభించింది. అక్కడే తనకు మొదటి గెలుపు దక్కింది. ఆ తరువాత నెమ్మదిగా 2010లో జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తన సత్తా చాటింది. ఈ ప్రయత్నంలోనే కాంస్యం సొంతం చేసుకుంది. అలా వరుసగా, 2014లో  డేవ్‌ షుల్జ్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచింది. అనంతరం, కామన్వెల్త్‌ ఆటల్లో రజతం గెలిచింది. 

ఒలంపిక్స్‌ లక్ష్యంగా..
ఇలా వరుసగా ఎన్ని పతకాలను గెలిచినా, ఒలంపిక్స్‌ క్రీడలనే లక్ష్యంగా పెట్టుకుంది సాక్షి మాలిక్‌. ఈ విషయంపైనే కృషి చేస్తూ సాధన చేసేది. 2014లో జరిగిన పోటీల తరువాత, 2015లో ఆసియా రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని ఆమె కాంస్యం రెండోసారి సాధించింది. అదే ఏడాది నిర్వ‌హించిన స‌మ్మ‌ర్ ఒలింపిక్స్ క్వాలిఫ‌య‌ర్స్‌కి సిద్ధ‌మై సాధ‌న చేసింది. అందులో మ‌ళ్ళీ కాంస్యం గెలిచి రియోలో పోటీల‌కి అర్హ‌త సాధించింది. 

రియోలో మాత్రం..

సాక్షికి అక్క‌డ పోటీ గ‌ట్టిగానే జ‌రిగింది. నిర్వ‌హించిన పోటీలో భాగంగా 58 కిలోల ఫ్రీస్టైల్‌లో తాను త‌న తొలి రౌండ్‌లో స్వీడ‌న్‌కు చెందిన‌ జొహాన్న మాట్స‌న్ తో త‌ల‌ప‌డింది. ఇందులో సాక్షి 0-4తో వెనుక‌బ‌డ‌గా ఆఖ‌రిగా మిగిలిన పది సెక‌న్ల‌లో త‌న ప్ర‌త్య‌ర్థిని రింగ్‌లోంచి బ‌య‌ట‌కు నెట్టి కింద ప‌డేసింది. ఈ పోటీల్లో మొత్తంగా 5-4 పాయింట్లు సాధించి విజ‌యం సాధించింది. ప్రీక్వాట‌ర్స్‌లో జ‌రిగిన పోటీల్లో కూడా త‌ను మ‌రియానా చెర్దివ‌రాతో గ‌ట్టి పోటీ ఇచ్చింది. అక్క‌డ 5-5 పాయింట్ల‌ను త‌న ఖాతాలో వేసుకోగా ప్ర‌త్య‌ర్థిపై ఆధిప‌త్యం చ‌లాయించింది సాక్షి మాలిక్‌. 

ప‌త‌కాల ప‌ట్టిక‌లో దేశాన్ని.. 

ఇన్ని వ‌రుస విజ‌యాల‌ను ద‌క్కించుకున్న సాక్షి ర‌ష్యా అభ్య‌ర్థితో జ‌రిగిన క్వార్ట‌ర్స్‌లో ప్ర‌త్య‌ర్థి అయిన కోబ్లోవా చేతిలో ఓడిపోయింది. దీని కార‌ణంగా రెపిచేజ్ రౌండ్‌ల‌లో త‌ల‌ప‌డే అవ‌కాశం ద‌క్కింది. ఇందులో పోరుకు సిద్ధ‌మై అధిక పాయింట్లు సాధించి చెకావోను ఒడించింది. భార‌త్‌కి కాంస్యం ద‌క్కించి, ప‌త‌కాల ప‌ట్టిక‌లో దేశాన్ని చేర్చింది.

కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో.. రిటైర్మెంట్‌ 

సాక్షి మలిక్‌... మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్‌ రెజ్లర్‌. కామన్వెల్త్‌ క్రీడల్లో మూడు పతకాలు... ఆసియా చాంపియన్ షిప్‌లో నాలుగు పతకాలు... రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... ఇవి చాలు సాక్షి ఏస్థాయి రెజ్లరో చెప్పడానికి! దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె... ఇటీవ‌లే జరిగిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బౌట్‌లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్‌ ప్రకటించింది.

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్‌భూషణ్‌ ప్రధాన అనుచరుడు సంజయ్‌ సింగ్‌ భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బ్రిజ్‌భూషణ్‌ పై ఢిల్లీ రోడ్లెక్కి సాక్షి సహా స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగాట్, సంగీత ఫొగాట్‌ తదితరులు నిరసన తెలిపారు. పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దింపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు టాటా చెప్పేసింది. స్టార్‌ రెజ్లర్లు బజరంగ్, వినేశ్‌ కూడా సంజయ్‌ ఎన్నికపై తప్పుబట్టారు. 

అవును... అందుకే గుడ్‌బై చెప్పా..
బ్రిజ్‌భూషణ్‌ మహిళా రెజ్లర్ల పట్ల ప్రవర్తించిన తీరుపై గళమెత్తాం. కదంతొక్కాం. కేసు నమోదు చేయించాం. కానీ డబ్ల్యూఎఫ్‌ఐ తాజా ఎన్నికల్లో చివరకు ఆయన వర్గమే గెలిచింది. పదవులన్నీ చేజిక్కించుకుంది. అందుకే కెరీర్‌కు గుడ్‌బై చెప్పా. మేం మహిళా అధ్యక్షురాలైతే బాగుంటుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు అని సాక్షి వాపోయింది. 

#Tags