జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర విద్యార్థుల సత్తా
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. మూడో సెషన్కు సంబంధించిన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 17 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు.
వారిలో నలుగురు ఏపీ, నలుగురు తెలంగాణకు చెందిన వారున్నట్లు జాతీయ టెస్టింగ్ (ఎన్‌టీఏ) ఏజెన్సీ పేర్కొంది. జేఈఈ మెయిన్ సెషన్–3 ఫలితాలను ఆగస్టు 6న ప్రకటించింది. ఏపీకి చెందిన కరణం లోకేశ్, దుగ్గినేని వెంకట పనీష, పసల వీరశివ, కంచన్‌పల్లి రాహుల్ నాయుడు ఉన్నారు. తెలంగాణకు చెందిన పోలు లక్ష్మిసాయి లోకేశ్‌రెడ్డి, మాదుర్ ఆదర్శ్ రెడ్డి, వెలవాలి వెంకట కార్తికేయ సాయి వైదిక్, జోస్యుల వెంకట ఆదిత్య ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన టాపర్స్ లిస్టులోనూ వీరే ఉన్నారు. జనరల్ కేటగిరీ టాపర్స్‌లో ఏపీకి చెందిన దుగ్గినేని వెంకట పనీష ఉన్నారు. తెలంగాణకు చెందిన పై నలుగురూ జనరల్ కేటగిరీలో ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ టాపర్స్‌లో ఏపీకి చెందిన దుగ్గినేని వెంకట పనీష మినహా మిగిలిన ముగ్గురూ ఉన్నారు. ఎస్సీ కేటగిరీ టాపర్స్‌లో ఏపీకి చెందిన నందిగామ నిఖిల్, కూచిపూడి రాహుల్ దీపక్ ఉన్నారు. ఎస్టీ కేటగిరీలోని టాప్ ఐదుగురిలో ముగ్గురు తెలంగాణకు, ఒకరు ఏపీకి చెందిన వారున్నారు. ఇందులో తెలంగాణకు చెందిన బిజిలి ప్రచోతన్ వర్మ, నీనావత్ ప్రీతమ్, ఇస్లావత్ నితిన్, ఏపీకి చెందిన ఇరాట మహర్షి ఉన్నారు. పీడబ్ల్యూడీ కేటగిరీలో టాప్ 5లో ఏపీకి చెందిన ఇప్పిలి తస్విన్, తల్లాడ వీరభద్ర నాగసాయి కృష్ణ, తెలంగాణకు చెందిన భానురంజన్‌రెడ్డి ఉన్నారు. మహిళల టాప్ 10లోనూ ఐదుగురు తెలుగు విద్యార్థులే ఉన్నారు. వారిలో కొమ్మ శరణ్య, పల్లె భావన, జి.శ్రీలక్ష్మి, అంచ ప్రణవి (తెలంగాణ), చిచిలి మనస్వితరెడ్డి (ఏపీ) ఉన్నారు. పురుషుల టాప్–16లో 8 మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు.
#Tags