Central University of AP:సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో నూతన కోర్సులు

అనంతపురం: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో నూతన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి సరికొత్త కోర్సులు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ కోర్సులకు సంబంధించి మల్టీ ఎంట్రీ, మల్టీ ఎగ్జిట్‌ విధానం పాటిస్తున్నారు. దీంతో మేజర్‌, మైనర్‌ రెండు డిగ్రీలను ఏకకాలంలో తీసుకునే అవకాశం ఉంది. నూతన జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు దక్కేలా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. పీజీ విద్యార్థులకు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్న ఉద్ధేశ్యంతో మానవ విలువలు, పర్యావరణం, భారత రాజ్యాంగం, సైబర్‌ సెక్యూరిటీ వంటి సబ్జెక్టులను నిర్భంధం చేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో 20 రాష్ట్రాలకు చెందిన 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో యూజీ, పీజీ కోర్సుల్లోని 358 సీట్లకు గాను ఏకంగా 2.20 లక్షల దరఖాస్తులు అందాయి. 2018లో ఏర్పాటైన సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ ఒక్కో అడుగు వేస్తూ శాశ్వత క్యాంపస్‌ వైపు పరుగులు తీస్తోంది. ఆగస్టు నుంచి జంతలూరులో శాశ్వత క్యాంపస్‌లో తరగతులు నిర్వహించనున్నారు.

Also Read:  JOSSA 2024 : జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ నిర్వ హించిన కౌన్సెలింగ్‌లో సీఎస్‌ఈ కే ప్రాధాన్యం

పీజీ కోర్సులు ఇవే:

ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లిష్‌, ఎంఏ పొలిటికల్‌ సైన్సెస్‌, ఎమ్మెస్సీ (అప్‌లైడ్‌ సైకాలజీ), ఎమ్మెస్సీ (ఎకనామిక్స్‌), ఎమ్మెస్సీ (మేథమేటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌), ఎమ్మెస్సీ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ , డేటా సైన్సెస్‌), ఎమ్మెస్సీ (మాలుక్యులర్‌ బయాలజీ), ఎంబీఏ, ఎంకాం, ఎంఏ (గవర్నర్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ), ఎంఏ (హిందీ), ఎమ్మెస్సీ (క్లినికల్‌ సైకాలజీ), ఎమ్మెస్సీ (కంప్యూటెషనల్‌ సోషల్‌ సైన్సెస్‌), ఎమ్మెస్సీ (ఎకానమిక్స్‌ అండ్‌ డేటా అనాలసిస్‌), ఎమ్మెస్సీ (జాగ్రఫీ అండ్‌ జియా ఇన్ఫర్మేటిక్స్‌), ఎమ్మెస్సీ ( స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ). ఇందులో 10 కోర్సులు కొత్తగా అందుబాటులోకి తెచ్చారు.

యూజీ కోర్సులు ఇవే

బీఏ (ఆనర్స్‌) పొలిటికల్‌ సైన్సెస్‌, బీఎస్సీ (ఆనర్స్‌) ఎకనామిక్స్‌, బీ.ఒకేషనల్‌ టీటీఎంను బీబీఎంగా కోర్సు పేరు మార్పు చేశారు. బీ.ఒకేషనల్‌ ఆర్‌ఎంఐటీను బీఎస్సీ ఆర్‌ఎంఐటీగా పేరు మార్పు చేశారు. బీకాం (ఆనర్స్‌), బీఏ (ఆనర్స్‌) ఇంగ్లిష్‌, బీఎస్సీ (ఆనర్స్‌)సైకాలజీ, బీఎస్సీ(ఆనర్స్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2024–25 విద్యా సంవత్సరం నుంచి బీకాం (ఆనర్స్‌), బీఏ (ఆనర్స్‌) ఇంగ్లిష్‌, బీఎస్సీ (ఆనర్స్‌) కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బీఎస్సీ(ఆనర్స్‌) సైకాలజీ కొత్త కోర్సులు చేర్చారు.

కొత్తగా పీహెచ్‌డీ కోర్సులు

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో 2024–25 విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డీలో ఆరు ప్రోగ్రామ్‌లు ప్రవేశపెట్టారు. పొలిటికల్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, అప్‌లైడ్‌ సైకాలజీ, తెలుగు, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు చేపట్టనున్నారు.

20 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు

ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సుల్లో 12 కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆరు సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాం. ప్రస్తుతం 20 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వర్సిటీలో చదువుతున్నారు. జంతలూరు వద్ద శాశ్వత క్యాంపస్‌ను త్వరలో ప్రారంభించబోతున్నాం. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.

                                                – డాక్టర్‌ ఎస్‌.ఏ. కోరి, వీసీ, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ

#Tags