AP Medical College news: మెడికల్‌ కాలేజీ ఇంకెప్పుడు

Medical College

మార్కాపురంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో పేదలకు వైద్యవిద్యను అందుబాటులోకి తీసుకు రావడంతోపాటు, పశ్చిమ ప్రకాశం వాసులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలందించే దిశగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ కళాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించే దిశగా గత ప్రభుత్వం అడుగులు వేస్తే..చంద్రబాబు నిర్ణయం ఫలితంగా ఈ ఏడాది 150 సీట్లు కోల్పోయాం. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని పాడేరుకు అనుమతి ఇచ్చి ఎక్కువ గిరిజన ప్రాంతాలు ఉండే ఈ మెడికల్‌ కళాశాలకు అనుమతి ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ కళాశాల ప్రారంభమే ప్రశ్నార్థకంగా మారింది.

మార్కాపురం మెడికల్‌ కళాశాలపై నీలినీడలు పాడేరుకు అనుమతిచ్చి మార్కాపురాన్ని విస్మరించిన ప్రభుత్వం పశ్చిమంలో 75కు పైగా గిరిజన గూడేలు కొత్తగా డాక్టర్ల నియామకం బంద్‌ మొక్కుబడిగా సాగుతున్న పనులు వైఎస్సార్‌ సీపీ హయాంలో 75 శాతం పనులు పూర్తి పీపీపీ విధానంపై ఆగ్రహం

Guest Faculty Posts: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: Click Here
 

మార్కాపురాన్ని జిల్లా చేస్తాం.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. జిల్లాను చేయడం మాట అటుంచితే ఈ ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలతో పాటు వైద్య విద్య దూరం అయ్యేలా ఉన్నాయి కూటమి ప్రభుత్వ చర్యలు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది నుంచే ప్రారంభం కావాల్సిన ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు వాయిదా పడ్డాయి. మార్కాపురంలో మెడికల్‌ కళాశాల కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.475 కోట్లు మంజూరు చేశారు.

రాయవరం గ్రామం వద్ద 41.97 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు చేపట్టారు. రెండేళ్లుగా పనులు వేగంగా జరిగాయి. దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందులో సిబ్బంది క్వార్టర్సు, నర్సింగ్‌ కళాశాల, జంట్స్‌, లేడీస్‌ హాస్టల్స్‌, క్లాసు రూములు, సెంట్రల్‌ క్యాంటీన్‌ పూర్తయ్యాయి. కళాశాలలో విద్యుత్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌ పనులు, రంగులతోపాటు కొన్ని భవనాల నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంది. అలాగే 82 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, డాక్టర్లను గత ప్రభుత్వం నియమించింది.

పట్టణంలోని జిల్లా ఆస్పత్రిని సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది. జీజీహెచ్‌లో 450 బెడ్లను సిద్ధం చేసింది. జనరల్‌ మెడిసిన్‌ కోసం 100, ఆప్తమాలజీ 20, డెర్మటాలజీ 10, సైకియాట్రీ విభాగం 10, జనరల్‌ సర్జరీల కోసం 100, ఆర్థోపెడిక్‌ విభాగానికి 40, ఈఎన్‌టీకి 20, ఐసీయూ బెడ్లు 20, పీడియాట్రిక్స్‌ 50, ఓబీజి (ప్రసూతి గైన కాలజీకి ) 50 బెడ్లను కేటాయించింది. ఈ ఏడాది ఎలాగైనా ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభించాలని వైఎస్సార్‌సీపీ సర్కార్‌ అన్ని రకాల చర్యలు తీసుకుంది.

అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి తారుమారైంది. మెడికల్‌ కళాశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పనులు మందగించాయి. ప్రైవేటుపై మోజుతో ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గుజరాత్‌ పీపీపీ మోడల్‌ పేరిట ప్రభుత్వ వైద్యకళాశాలు ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చర్యలు చేపట్టింది.

జూన్‌లో ఎన్‌ఎంసీ బృందం పరిశీలన:

ఈ ఏడాది జూన్‌ 24వ తేదీన నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బృందం మెడికల్‌ కాలేజీని, జీజీహెచ్‌ను పరిశీలించింది. ఈ బృందంలో ఢిల్లీ నుంచి ఎన్‌ఎంసీ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ బీవా బోరువా (అస్సాం), డాక్టర్‌ సంజీర్‌కుమార్‌ భట్‌ (లక్నో), డాక్టర్‌ సతీష్‌ చవాన్‌ (హుబ్లీ)లతో పాటు స్థానిక ప్రిన్సిపల్‌, అదనపు డీఎంఈ డాక్టర్‌ ఎస్‌వీవీ నాగరాజమన్నార్‌, జీజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పీ సావిత్రితో కలిసి పరిశీలించారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఇటీవల ఎన్‌ఎంసీ అధికారులు నూతన ప్రతిపాదనలు పంపాలని చెప్పడంతో జీజీహెచ్‌ అధికారులు హడావుడిగా కేంద్రానికి నివేదిక పంపారు. వర్చువల్‌ విధానంలో జీజీహెచ్‌ను పరిశీలించారు. 450 బెడ్లు ఉన్నాయనీ, 82 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డాక్టర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న బెడ్లు సరిపోతాయని, 132 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా 82 మందే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి అదనంగా 50 మంది డాక్టర్లను ఇక్కడకు పంపి ఉంటే కొత్త విద్యా సంత్సరంలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభమయ్యేవి. ప్రస్తుతం నీట్‌ కౌన్సెలింగ్‌ కూడా ప్రారంభమైపోయింది. అందులో మార్కాపురం కళాశాల పేరులేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఉసూరుమన్నారు.

నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీ

మెడికల్‌ కాలేజీ త్వరగా పూర్తిచేయాలి

మార్కాపురం మండలం రాయవరం దగ్గర నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీని త్వరగా పూర్తిచేయాలి. ఈ ఏడాదే అడ్మిషన్లు ప్రారంభించాలి. దీనివలన 100 మెడికల్‌ సీట్లు మంజూరైతే ఈ ప్రాంత విద్యార్థులకు ఎంబీబీఎస్‌ విద్య అందుబాటులోనికి వస్తుంది. దీంతోపాటు జీజీహెచ్‌లో కూడా రోగులకు మెరుగైన సేవలు లభిస్తాయి. ప్రభుత్వమే మెడికల్‌ కాలేజీని నిర్వహించాలి. జీజీహెచ్‌లో ఎమర్జెన్సీ సర్వీసెస్‌ న్యూరాలజీ, కార్డియాలజీ సేవలు కూడా అందుబాటులోనికి తేవాలి.

– పత్తి రవిచంద్ర, ౖవెఎస్సార్‌ సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి

మందకొడిగా పనులు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కాపురం మెడికల్‌ కళాశాల పనులు దాదాపుగా ఆగిపోయాయనే చెప్పాలి. రెండేళ్లుగా చురుగ్గా సాగిన పనులు ఒక్కసారిగా మందగించాయి. చిన్నాచితకా పనులు మాత్రమే జరుగుతున్నాయి. మెడికల్‌ కళశాల వద్ద సెక్యూరిటీ తప్ప పనులు జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదు. వచ్చే విద్యా సంవత్సరానికై నా పనులు పూర్తవుతాయా అన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పీపీపీ విధానంలో పనులు చేపడితే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమైనట్టేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#Tags