Centre of Excellence College: సీఓఈలో ప్రవేశాలకు చాన్స్‌

ఖమ్మంమయూరిసెంటర్‌ : పేద విద్యార్థులు ఇంటర్‌ చదువుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకులాలకు మంచి ఆదరణ లభిస్తోంది. గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రంలోని కొన్ని కళాశాలలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీవోఈ)లుగా మార్చి ఇంటర్‌ విద్యాబోధన చేస్తుండడంతో వాటిలో ప్రవేశాలకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. సీఓఈ కళాశాలల్లో విద్యనభ్యసించిన వారు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ ప్రతిభ చాటుతున్నారు. సీఓఈ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వారికి ఇంటర్మీడియట్‌ బోధనతో పాటుగా ఐఐటీ, నీట్‌, సీఎంఏ, సీఎల్‌ఏటీ లాంటి ప్రవేశ పరీక్షలకు ఉచితంగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆంగ్లంలో మాత్రమే బోధన ఉండే ఈ కళాశాలల్లో సెకండ్‌ లాంగ్వేజ్‌ మాత్రం తెలుగు ఉంటుంది. బాల, బాలికలకు సాంఘిక గురుకుల విద్యాలయాల సంస్థ వేర్వేరుగా కళాశాలలను ఏర్పాటు చేసింది.

ఉమ్మడి జిల్లాలో మూడు కళాశాలలు..
రాష్ట్ర వ్యాప్తంగా 38 సీఓఈలను ఏర్పాటు చేయగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు కళాశాలలు ఎంపికయ్యాయి. ఖమ్మంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కళాశాల(బాలికలు), దానవాయిగూడెం జూనియర్‌ కళాశాల(బాలికలు), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ జూనియర్‌ కళాశాల (బాలురు) సీఓఈలుగా గుర్తింపు పొందాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక ఖమ్మంలోని అంబేద్కర్‌ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో 60, బైపీసీ గ్రూపులో 60 సీట్లు ఉండగా, పాల్వంచ, దానవాయిగూడెం కళాశాలల్లో ఎంపీసీలో 40, బైపీసీలో 40 చొప్పున సీట్లు ఉన్నాయి. వీటిలో సీట్లు పొందేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద విద్యార్థులు పోటీ పడుతున్నారు.

ప్రవేశ పరీక్ష తప్పనిసరి..
సీఓఈ కళాశాలలో సీట్లు పొందేందుకు విద్యార్థులు తప్పనిసరిగా ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండు స్థాయిలో ఈ పరీక్ష నిర్వహించి మెరిట్‌ మార్కులు సాధించిన వారికి ఆయా కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు. మొదటి లెవెల్‌, రెండో లెవెల్‌ పేరుతో గురుకుల విద్యాలయాల సంస్థ కామన్‌ టెస్ట్‌ నిర్వహిస్తుంది. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో టెస్ట్‌ సమయం మూడు గంటల పాటు ఉండనుండగా.. 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు నిర్దేశించిన పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు.

ఈనెల 20 వరకు గడువు..
కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వ తేదీ వరకు గురుకుల విద్యాలయాల సంస్థ గడువు విధించింది. విద్యార్థులు రూ.200 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా tswreis.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. హాల్‌టికెట్లు ఫిబ్రవరి 3వ తేదీ లోపు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొదటి లెవెల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ఫిబ్రవరి 4న, రెండో లెవెల్‌ పరీక్ష ఫిబ్రవరి 25న ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో మాత్రమే ప్రవేశాలు ఉంటాయి.

అర్హతలు ఇవే..
సీఓఈ కళాశాలల్లో చేరాలంటే విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు(2024 మార్చి) సన్నద్ధం అవుతూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణులై, ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, కన్వర్టెడ్‌ క్రిస్టియన్లకు రెండేళ్లు మినహాయింపు ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకుండా ఉండాలి.
 

#Tags