Medical College: ద్వితీయ సంవత్సరానికి అనుమతి

జనగామ: జనగామ మెడికల్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు జారీ చేసింది.

ప్రస్తుతం మొదటి సంవత్సరం తరగతులు కొనసాగుతుండగా... వచ్చే ఆగస్టు మాసంలో పరీక్షలు జరుగనున్నాయి. ఇటీవల జరిగిన నీట్‌ ఎంట్రెట్స్‌ ఫలితాలు వచ్చిన వెంటనే మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఫస్ట్‌ ఇయర్‌లో 100 సీట్లు ఉండగా... రెండో సంవత్సరంలో కూడా అంతే మొత్తంలో పర్మిషన్‌ వచ్చింది. ఇందులో 15 శాతం నాన్‌ లోకల్‌, 85 శాతం లోకల్‌కు ప్రియార్టీ ఇస్తారు. ఈ సారి పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి కోటా ఉండే అవకాశం ఉంది.

మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించి ఏడాది కావస్తున్నా... మెడికల్‌ కళాశాలకు సంబంధించిన వందశాతం వసతులు కల్పించ లేదు. చంపక్‌హిల్స్‌లోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌) పక్కన తాత్కాలికంగా నిర్మాణం చేసి రేకుల షెడ్డులో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ధర్మకంచ ఇంటిగ్రేడెడ్‌ భవన సముదాయంలో విద్యార్థినులు, చంపక్‌హిల్స్‌లోని పాత డీఆర్డీఓ కంప్యూటర్‌ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం కల్పించారు.

భవన నిర్మాణ పనులు నిలిపివేత

మెడికల్‌ కళాశాల కోసం జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డు గీతానగర్‌ ఏరియాలో 18 ఎకరాల స్థలం కేటాయించి, సుమారు రూ.190 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. కళాశాలకు కేటాయించిన స్థలం మధ్యలో నుంచి దేవాదుల కాల్వ వెళ్లడం, పలువురు వ్యక్తులకు సంబంధించి కోర్టులో కేసులు కొనసాగుతుండడంతో భవన నిర్మాణ పనులు మొదలు కాలేదు.

ఇటీవల కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించే సమయంలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఆబ్జక్షన్‌ చెప్పడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కాగా విద్యార్థుల కోసం వేర్వేరుగా నిర్మించే రెండు హాస్టల్‌ భవనాలు పూర్తి కావస్తున్నాయి. ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్‌ తరగతులు మొదలైతే... హాస్టల్‌ భవనం ఉన్నప్పటికీ తరగతులు ఎక్కడ నిర్వహించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

రూ.కోటి జరిమానా... రూ.2 లక్షలకు తగ్గింపు

మెడికల్‌ కళాశాల ప్రారంభమై.. ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయి ఫెసిలిటీస్‌ కల్పించడంలో అలసత్వం వహించారని ఎన్‌ఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌ఎంసీ ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాలలో 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిత్యం ఇక్కడ జరుగుతున్న విద్యాబోధన, తదితర వాటిపై పర్యవేక్షణ చేశారు.

కళాశాల భవన నిర్మాణంతో పాటు విద్యార్థులకు హాస్టల్‌ బిల్డింగ్‌, ఫోరెనిక్స్‌ ల్యాబ్‌, ఎస్‌పీఎంలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకంలో జాప్యం, ఇతర మౌలిక వసతులను కల్పించడంలో విఫలమయ్యారని రూ.కోటి జరిమానా విధించారు. మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గోపాల్‌రావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో జరిమానాను రూ.2లక్షలకు తగ్గించగలిగారు.

నూతన భవన నిర్మాణంలో నెలకొన్న అడ్డంకులను తొలగించి. ద్వితీయ సంవత్సర ఎంబీబీఎస్‌ తరగతుల ప్రారంభం నాటికి సమస్యలను పరిష్కరించే విధంగా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపించాల్సి ఉంటుంది.

పనులు నిలిపేశారు..

జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డులో నూతనంగా నిర్మాణం చేస్తున్న మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులను ఇరిగేషన్‌ శాఖ అధికారులు నిలిపేశారు. స్థలం మధ్యలో నుంచి దేవాదుల కాల్వ ప్రతిపాదనలు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థినీ, విద్యార్థులకు సంబంధించి వేర్వేగా హాస్టల్‌ భవనాలు పూర్తి కావస్తున్నాయి.

మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ తరగతులు, ఇతర ఫెసిలిటీలు పూర్తి స్థాయిలో లేవని ఎన్‌ఎంసీ అధికారులు రూ.కోటి జరిమానా విధిస్తే, రూ.2లక్షలకు తగ్గించుకోగలిగాం. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్‌ తరగతులకు అనుమతులు రాగా, నీట్‌ ఫలితాలు వచ్చిన వెంటనే.. మొదటి సంవత్సరం కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది.

– డాక్టర్‌ గోపాల్‌రావు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

#Tags