చిరుద్యోగుల వేతనాల్లో రికవరీకి ఆదేశం

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ బాధ్యతలు చూస్తున్న పంచాయతీరాజ్‌ శాఖలో గౌరవ వేతనంపై పనిచేసే కొందరి చిరుద్యోగుల జీతాల్లో రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు చేసింది.

ఈ–పంచాయత్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేసే వారు రూ.15 వేలకు మించి గౌరవ వేతనం తీసుకుంటే ఆ మొత్తాలను వెంటనే వారి నుంచి రికవరీ చేయాలంటూ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం రెండు రోజుల క్రితం డీపీవోలకు ఆదేశాలిచ్చింది.

రాష్ట్రంలో 10 వేలకు పైబడి జనాభా ఉండే గ్రామ పంచాయతీలో ఒకరు చొప్పున ఈ–పంచాయత్‌ ఆపరేటర్‌ పని చేస్తున్నారు. 10 వేలలోపు జనాభా ఉండే గ్రామ పంచాయతీల్లో 10 వేల జనాభాకు పరిమితమై వివిధ గ్రామ పంచాయతీలను క్లస్టర్‌గా పేర్కొంటూ.. ఒక్కో క్లస్టర్‌కు ఒకరు చొప్పున ఈ– పంచాయత్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లు పనిచేస్తున్నారు.

చదవండి: Indian Navy Recruitment: ఇంటర్‌ పాసయ్యారా? నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీతో పాటు నేవీలో ఉద్యోగం

వీరంతా పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం ఆడ్మినిస్ట్రేటివ్‌ నిధుల నుంచి, లేదా పంచాయతీ సాధారణ నిధుల నుంచి వేతనాలు పొందుతుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నచోట ఎక్కడైనా స్థానికంగా ఆయా పంచాయతీ తీర్మానాలకు అనుగుణంగా ప్రతినెలా రూ.15 వేలకు మించి వేతనాలు తీసుకుని ఉంటే వారి నుంచి అధికంగా తీసుకున్న వేతనాలను వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.

కాగా.. ఈ–పంచాయత్‌ కంప్యూటర్‌ ఆపరేటర్ల గౌరవ వేతనం ఇక నుంచి ప్రతి నెలా రూ.18,500 చొప్పున చెల్లించాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.
 

#Tags