Degree Admissions: ఈ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీకి నో డిమాండ్‌!

కేయూ క్యాంపస్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు విద్యార్థులు ఇష్టపడడం లేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధి కళాశాలల్లో 1,01,610 సీట్లకుగాను రెండు దశల్లో 18,251 భర్తీ అయ్యాయి.

ఈ సంఖ్య చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. పేరెన్నికగన్న కళాశాలలు మినహాయిస్తే మిగతా వాటిలో అంతంతమాత్రంగానే సీట్లు భర్తీకావడంతో అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, అటానమస్‌ డిగ్రీ కళాశాలలు 262 ఉన్నాయి.

వీటిలో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ తదితర కోర్సుల్లో కంప్యూటర్‌ సైన్స్‌ కాంబినేషన్‌లతోపాటు లైఫ్‌ సైన్సెస్‌ కోర్సులు కూడా కొనసాగుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం 2024–2025లో వివిధ కోర్సుల్లో ఇప్పటివరకు రెండు దశల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (దోస్త్‌) ద్వారా సీట్ల కేటాయింపులు జరిగాయి.

చదవండి: Degree Admissions2024 : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

1,01,610 సీట్లకు..

మొత్తం డిగ్రీ కళాశాలల్లో 1,01,610 సీట్లు ఉన్నా యి. మొదటి దశలో 16, 524 సీట్లు కేటాయించగా 11,544మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. రెండోదశలో 8,498 సీట్లకుగాను 6,707మంది ప్రవేశాలు పొందారు. 18,251 సీట్లు భర్తీ అయ్యాయి.

కొనసాగుతున్న మూడో దశ

మూడో దశలో దోస్త్‌ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గురువారంతో ముగిసింది. జూలై 5తో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కూడా ముగియనుంది. అనంతరం సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈమేరకు సీట్ల్లు భర్తీ అవుతాయా అనేది వేచి చూడాలి. ఆ తర్వాత స్పెషల్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుంది. ఈవిద్యాసంవత్సరంలో సగం సీట్లు కూడా భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

చదవండి: Two Sessions Admissions : డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌లో రెండు సెషన్లుగా ప్రవేశాలు.. ఈ ఏడాది నుంచే అమలుకు యూజీసీ లేఖలు!

ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులపైనే..

డిగ్రీలో ఇప్పుడున్న కోర్సులతోపాటు కొత్తవి ప్రవేశపెట్టినప్పటికీ చేరేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. ఈ రెండు దశల్లో జరిగిన అడ్మిషన్లలో కూడా ఎక్కువగా బీకాం, బీకాం కంప్యూటర్స్‌, బీఎస్సీ, బీజెడ్‌సీ, బీఎస్సీ ఎంపీసీ కంప్యూటర్స్‌ కోర్సులపైనే ఆసక్తి చూపించారు.

ఇంటర్‌ ఉత్తీర్ణత కాగానే ఎక్కువశాతం మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులకు వెళ్తుండడంతో ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేయూ పరిధిలో గురుకుల డిగ్రీ కళాశాలలు 30వరకు ఉన్నాయి. అవి సొంతంగానే అడ్మిషన్లు చేసుకుంటున్నాయి.

గురుకులాల ప్రభావం కొంత ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలపై పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనైతే తక్కువగా అడ్మిషన్లు అవుతున్నాయి. ఇది అధ్యాపకుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈసారి ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గడం, గత నెలలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చాయి. అందులో ఉత్తీర్ణులైనవారిలో ఎంతమంది డిగ్రీకోర్సుల్లో చేరుతారనేది వేచి చూడాల్సిందే.

ఇంజనీరింగ్‌లో అడ్మిషన్ల ప్రక్రియ తర్వాతే..

ఇంటర్‌ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఎక్కువ మంది ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు చూస్తున్నారు. ఇంకా ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. జూలై 4వ తేదీనుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరగనుందని భావిస్తున్నారు.

అందులో సీటు లభిస్తుందనుకునే వారు డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేయడం లేదని సమాచారం. మరోవైపు ఇంటర్‌ బైపీసీ చేసిన విద్యార్థుల్లో కొందరు మెడిసిన్‌లో ప్రవేశాల కోసం చూస్తున్నారు. ఆయా ప్రవేశాలు ఎప్పడు అవుతాయో వేచి చూడాల్సిందే. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు పూర్తయితే అందులో సీట్లు రానివారు డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నెల 15నుంచి డిగ్రీ ప్రథమ విద్యార్థులకు తరగతులు

డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం తరగతులు జూలై 15నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. మూడో దశ సీట్ల భర్తీ ప్రక్రియ తరువాత తరగతులు నిర్వహించనున్నారు.

#Tags