Nirmal Degree College: నిర్మల్ డిగ్రీ కళాశాల అరుదైన ఘనత
ప్రతిష్టాత్మక ‘హైమ్ అంతర్జాతీయ సంస్థ’ ఆడిట్ ప్రతినిధులు కళాశాలను సందర్శించి వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కళాశాలలో మౌలిక వసతులు, క్రీడామైదానం, ప్రహరీ, తరగతి గదులు, పరిపాలన విభాగం, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, వర్చువల్ ప్రయోగశాల, ఇంగ్లిష్ భాష ప్రయోగశాల, తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జి ల్యాబ్, భౌతిక, రసాయన, జంతు, వృక్షశాస్త్ర ప్రయోగశాలలతోపాటు జంతుశాస్త్ర మ్యూజియం, సెమినార్ హాల్, డిజిటల్ క్లాస్‌రూమ్, పార్కింగ్ స్థలం, బొటానికల్ గార్డెన్, క్రీడా సామగ్రి, నీటి వసతులు పర్యావరణ నిర్వహణ వంటి వాటిని సమగ్రంగా పరిశీలించారు.
వీటితోపాటు పరిపాలన విభాగం నిర్వహణ, అకడమిక్ రికార్డ్స్ విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా విభాగాలకు సంబంధించిన ధ్రువపత్రాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జే.భీమారావుకు మంగళవారం అందజేశారు.
అంతర్జాతీయ సంస్థ గుర్తింపు రావడంపై ప్రిన్సిపాల్‌తోపాటు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు విదేశాలలో చదవాలనుకునే వారికి మంచి గుర్తింపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు హైమ్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు ఉత్తమ విద్యా ప్రమాణాలు–నిర్వహణ, ఉత్తమ వనరుల నిర్వహణ, ఉత్తమ పర్యావరణ నిర్వహణ అనే మూడు విభాగాలలో ధ్రువీకరణ పత్రాలను మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో హైమ్ సంస్థ ప్రతినిధి శివ, కళాశాల అధ్యాపకులు అతీక్ బేగం, రఘు, అరుణ్‌కుమార్, అజయ్, పీజీ.రెడ్డి, రవికుమార్, రమాకాంత్‌గౌడ్, సరితారాణి, నరసయ్య, నాగేశ్వర్, శంకర్, శ్రీహరి, ఏవో నాగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: New Course: ‘మహీంద్ర’లో కొత్త కోర్సు