Gurukulam: అస్తవ్యస్తంగా కొత్త పాఠశాలలు

కేజీ టు పీజీ వరకు నిర్బంధ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
అస్తవ్యస్తంగా కొత్త గురుకుల పాఠశాలలు

గత నాలుగేళ్లుగా విరివిగా విద్యా సంస్థలను నెలకొల్పుతూ దీనిని అమలు చేస్తోంది. ఈ విధంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటికి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణంలో, మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. దీంతో గురుకుల సొసైటీలు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ అద్దె భవనం దొరికితే అక్కడ అన్నట్టుగా వాటిని ప్రారంభిస్తున్నారు.

కొత్తవన్నీ అద్దె భవనాల్లోనే...

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో 201 గురుకుల విద్యా సంస్థలున్నాయి. 2014 తర్వాత మరిన్ని గురుకుల విద్యా సంస్థల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విడతల వారీగా కొత్త పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 724 కొత్త గురుకుల విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయి వరకే కొనసాగిన ఈ విద్యా సంస్థలు క్రమంగా జూనియర్ కాలేజీ స్థాయికి అప్గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ఏర్పాటైన వాటిలో 30 శాతం పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా మారినట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం శాశ్వత భవనాల దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో కొత్తగా మంజూరైన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే ప్రారంభించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంలో అద్దె భవనాలు లభించకపోవడంతో భవనాలు అందుబాటులో ఉన్న చోట వీటిని ప్రారంభించారు. ఈ కారణంగానే ఒకచోట ఉండాల్సిన గురుకుల పాఠశాల ఆ పేరుతో మరో ప్రాంతంలో ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా వీటికి శాశ్వత భవనాలను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం... మరోవైపు భవనాల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని ఎప్పుటికప్పుడు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోంది.

శాశ్వత భవనాలు లేక.. అద్దెకు దొరక్క

గురుకుల పాఠశాల నిర్వహణకు సగటున 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, విశాలమైన మైదానం ఉన్న భవనం అవసరం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాలు దొరకడం కష్టమే. ఈ క్రమంలో దాదాపు అన్ని సొసైటీలు మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల భవనాలను గుర్తించి యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడ్డ చోట ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు భవనం, మైదానం సంతృప్తికరంగా ఉండడంతో ఆ ఒక్కచోటే మూడు, నాలుగు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా తాగునీరు, వాడుక నీరు సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బోధన సిబ్బంది కొరత కూడా ఉంది. భద్రత విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒకరు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలంటే వ్యయ ప్రయాసలకోర్చి పదుల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి రావాల్సి వస్తోంది. తనకు నెలకు సగటున వెయ్యి రూపాయలు ఖర్చవుతోందని యాచారంలో ఉన్న శంషాబాద్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి నాగయ్య ‘సాక్షి’తో వాపోయారు.

అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు

శాశ్వత భవనాలు మంజూరయ్యే వరకు అద్దె భవనాల్లో నిర్వహిస్తామని, అంతవరకు అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

ఇక్కడి గురుకులం మరెక్కడో

  • రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంజూరైన ఎస్సీ గురుకుల పాఠశాలను తొలుత 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. అక్కడ బిల్డింగ్‌ సమస్య తలెత్తడంతో అక్కడ్నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాచారానికి తరలించారు.
  • హైదరాబాద్‌ జిల్లాలో మంజూరైన మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చాలావరకు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నాయి.
  • రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తోల్‌కట్ట వద్ద ఒకేచోట వికారాబాద్‌ డిగ్రీ కాలేజీ, బంట్వారం, మోమి¯ŒSపేట, చేవెళ్ల పాఠశాలలు కొనసాగిస్తున్నారు.
  • నల్లగొండ జిల్లా చండూరు, అనుముల, తిప్పర్తి, నిడమనూరు పాఠశాలల్ని ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాల కొరతతో నల్లగొండ టౌన్ లోనే నిర్వహిస్తున్నారు.

#Tags