S Abdul Nazeer: విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం

అనంతపురం: విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఉజ్వల భవిష్యత్‌ను సృష్టించేందుకు, ప్రపంచాన్ని మార్చడానికి దోహదం చేస్తుందని తాను దృఢంగా విశ్వసిస్తానని ఏపీ గవర్నర్, యూనివర్సిటీల చాన్సలర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.
విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ (ఎస్‌కేడీ) విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవాన్ని జూలై 17న నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్‌ను కర్ణాటకకు చెందిన మాజీ అంధ క్రికెటర్, సమర్థనం ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు మహంతేష్‌ జీకేకు గవర్నర్‌ ప్రదానం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ నజీర్‌ మాట్లాడుతూ.. ‘మీకు ఎలాంటి సమస్యా రాకపోతే మీరు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నారని కచ్చితంగా అనుకోవచ్చు.

విజయం సాధించడం సులువు కాదు. సవాళ్లు లేని జీవితం వ్యర్థం. సవాళ్లను ఎదుర్కోకపోతే ఏమీ నేర్చుకోలేరు. జీవితంలో ఎదగలేరు. ఏదైనా సాధించడానికి తొలి అడుగు ఏదీ సులభంగా రాదని అంగీకరించడమే. సానుకూల దృక్పథమే అత్యం­త ముఖ్యమైనది. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి సానుకూల మనస్తత్వమే ప్రధానమన్న స్వామి వివేకానంద మాటలు మనకెప్పుడూ గుర్తుండాలి’ అని విద్యార్థులకు హితబోధ చేశారు.

చదవండి: Department of Education: నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ

వినూత్న పరిష్కారాలు వెతకండి

వాతావరణ మార్పులు, సాంకేతిక పురోగతి నుంచి సామాజిక అసమానత వంటి అనేక గణనీయమైన సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని జస్టిస్‌ నజీర్‌ పేర్కొన్నారు. వీటిని కరుణ, సానుభూతి, ప్రపంచ పౌరసత్వ భావనతో పరిష్కరించడం రేపటి బాధ్యతాయుతమైన నాయకులుగా యువకుల బాధ్యత అన్నారు. వీటి కోసం వినూ త్న పరిష్కారాలు వెతకాలని, స్థిరమైన భవిష్యత్‌కు కృషి చేయాలని కోరారు.

చదవండి: Andhra Pradesh: బడిలో ‘బైలింగ్యువల్’ భళా!

రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్కరణల అమలులో క్రియాశీలకంగా ఉందని, నూతన జాతీయ విద్యా విధానం–2020ను రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు అమలు చేస్తుండటం సంతోషదాయకమన్నారు. పీజీలతో సరితూగే రీతి లో డిగ్రీ కోర్సుల్లో సమూల మార్పులు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. వైస్‌ చాన్సలర్‌ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి  తదితరులు హాజరయ్యారు.

#Tags