Jagananna Vidya Kanuka: నేడు జగనన్న విద్యా కానుక పంపిణీ

  • అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం 
  • డిప్యూటీ సీఎం, మంత్రి, ఎంపీ హాజరు
  •  ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్‌, ఏఎస్పీ రాణా



నాతవరం :
మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు, జగనన్న విద్యా కానుక కిట్ల పంపీణీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ బీవీ సత్యవతి రానుండటంతో సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌, నర్సీపట్నం ఏఎస్‌పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదివారం వేర్వేరుగా పరిశీలించారు. పీహెచ్‌సీలో రూ.కోటీ 65 లక్షలతో నిర్మించిన అదనపు భవనాన్ని పరిశీలించి, వైద్యాధికారులకు, ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. రెండు సచివాలయ భవనాలు, ఆర్బీకే, పశు వైద్యశాల నూతన భవనాలను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. నాతవరం గ్రామ సమీపంలో తాండవ కాలువ గట్టుపై రూ.10 లక్షలతో నిర్మించిన శ్రీనల్లకొండమ్మ తల్లి ఆలయాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపీణీ కార్యక్రమాన్ని జిల్లాలోని నాతవరం హైస్కూల్లో ఏర్పాటు చేశారు. అక్కడి స్టాల్స్‌ ఏర్పాటును పరిశీలించి, ఇన్‌చార్జి ఎంపీడీవో పోలుపర్తి పార్థసారథి, ఎంఈవో తాడి ఆమృత్‌కుమార్‌కు సూచనలిచ్చారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమై తొలిసారిగా మండలానికి ఇద్దరు మంత్రులు, ఎంపీ రావడంతో పాటు, జగనన్న విద్యా కానుక కిట్ల పంపీణీ కార్యక్రమాన్ని ఇక్కడే ఏర్పాటు చేయడంతో, సభలు, సమావేశాలను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తలో భాగంగా ఏఎస్‌పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా మంత్రులు పర్యటించే ప్రాంతాలను క్షుణంగా పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై నర్సీపట్నం రూరల్‌ సీఐ రమణయ్య, ఎస్‌ఐ డి.లక్ష్మినారాయణలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్‌ ఎంపీపీ పైల సునీల్‌, పార్టీ మండల అధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు, కార్పొరేషన్ల రాష్ట్ర డైరెక్టర్లు శిరుసుపల్లి నర్సింగరావు, పైల పోతురాజు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ శెట్టి నూకరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.

#Tags