Cognizant New Campus: కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌లో ఆగ‌స్టు 14న‌ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తోంది.

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ‌స్టు 14న‌ ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం కోకాపేటలో జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో కాగ్నిజెంట్‌ సీఈఓ రవికుమార్‌తో కలిసి పాల్గొంటారు. హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌ ద్వారా మరో 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, డిజిటల్‌ ఇంజనీరింగ్, క్లౌడ్‌ సొల్యూషన్స్‌ సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్‌ దృష్టి సారిస్తుంది.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆగ‌స్టు 5న కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ భేటీ అయ్యారు. కాగ్నిజెంట్‌ విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని రవికుమార్‌ ఈ భేటీ అనంతరం ప్రకటించారు.

చదవండి: Layoffs In IT Sector: ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం..భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ

న్యూజెర్సీలో ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కేవలం పది రోజుల వ్యవధిలోనే కొత్త క్యాంపస్‌ పనులకు కాగ్నిజెంట్‌ శ్రీకారం చుడుతోంది. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్‌ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరిస్తోంది.

రాష్ట్రంలో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థకు హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో 57 వేల మంది ఉద్యోగులున్నారు. తెలంగాణ ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్‌కు పేరుంది.

గత రెండేళ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7,500 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ తెలంగాణ నుంచి రూ.7,725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది. గడిచిన ఐదేళ్లలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద రూ.22.5 కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది.  
 

#Tags