ఎన్‌ఎంఎంఎస్,ఎన్‌టీఎస్‌ఈ పరీక్షలకు ప్రిపరేషన్ గెడైన్స్...

ఆర్థిక సమస్యల కారణంగా ప్రతిభావంతులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయి స్కాలర్‌షిప్స్‌ను అందిస్తోంది. అందుకోసం 8వ తరగతి విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం ఎగ్జామినేషన్(ఎన్‌ఎంఎంఎస్).. అలాగే 10వ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) ను నిర్వహిస్తోంది. 2019-20 విద్యాసంవత్సరానికి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంఎంఎస్, ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్స్ వివరాలు.. దరఖాస్తు.. పరీక్ష తీరు.. ప్రిపరేషన్ గెడైన్స్...
ఎన్‌టీఎస్‌ఈ :
దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్‌టీఎస్‌ఈ రాత పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు పదో తరగతి తర్వాత నుంచి ఇంటర్మీడియట్ ఫైనల్ వరకు నెలకు రూ.1250 చెల్లిస్తారు. డిగ్రీ, పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) చేస్తే నెలకు రూ.2000. అలాగే ఈ విద్యార్థులు పీహెచ్‌డీ చేసినట్లయితే యూజీసీ నిర్ణయం ప్రకారం స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు.

ఎన్‌ఎంఎంఎస్ :
ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు (9,10,11, 12) వరకు ఏటా రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.

అర్హతలు :
  • ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతుండాలి.
  • ఎన్‌టీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి, ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నవారై ఉండాలి.
  • తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.1,50,000 మించకుండా ఉండాలి. అలాగే తల్లిదండ్రులు ప్రభుత్వం లేదా ప్రైవేటు రంగాల్లో పనిచేసే వారైతే మండల రెవెన్యూ ఆఫీసర్ జారీచేసిన ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి.

ఎంపిక విధానం :
ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌కు రాత పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్-1(ప్రిలిమినరీ), స్టేజ్-2(మెయిన్స్) పరీక్షల్లో అర్హత సాధించిన వారినే స్కాలర్‌షిప్‌కు అర్హులుగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. విద్యార్థి ఆసక్తిని బట్టి తెలుగు/ఇంగ్లిష్/ఉర్దూ లేదా హిందీలలో ఏదైనా ఒక మీడియంను ఎంచుకోవచ్చు.

రెండు దశలు..
  • స్టేజ్-1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్), స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(శాట్ ) అనే రెండు విభాగాలు ఉంటాయి.
  • స్టేజ్-2లో కూడా మెంటల్ ఎబిలిటీ టెస్ట్(మ్యాట్), స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(శాట్ ) అనే రెండు విభాగాలు ఉంటాయి.
  • స్టేజ్-1లో వచ్చిన మార్కులు, రిజర్వేషన్లకు అనుగుణంగా రెండో దశ స్టేజ్-2కు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకే స్కాలర్‌షిప్ లభిస్తుంది.

మ్యాట్ :
  • ఎన్‌టీఎస్‌ఈకు సంబంధించిన మ్యాట్‌లో మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
  • ఎన్‌ఎంఎంఎస్‌కు సంబంధించిన మ్యాట్‌లో మొత్తం 90 ప్రశ్నలు 90 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.
  • ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్ రెండింటికి నిర్వహించే మ్యాట్‌లోనూ విద్యార్థి ఆలోచనా శక్తిని, నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నపత్రం ఉంటుంది. ముఖ్యంగా ఈ విభాగంలో విద్యార్థి మానసిక సామర్థ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. మ్యాట్ ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. సాధారణ విభాగం-కోడింగ్, డీకోడింగ్, మిస్సింగ్ లెటర్స్, నంబర్, పదాల భిన్న పరీక్ష, నంబర్ సిరిస్, ఆల్ఫాబెట్ శ్రేణి, అంకెల సామర్థ్యం, సంఖ్యల భిన్న పరీక్ష, పజిల్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, నంబర్, ఆల్ఫాబెట్ అనాలజీ. రెండోది బొమ్మల విభాగంలో.. బొమ్మలను గుర్తించడం, లెక్కించడం, అద్దంలోని బొమ్మలను గుర్తించడం, పేపర్ ఫోల్డింగ్,పేపర్ కటింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నల వస్తాయి.

శాట్ :
  • ఎన్‌టీఎస్‌ఈ శాట్‌లో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం విద్యార్థికి పదోతరగతి సబ్జెక్ట్‌లపై ఉన్న పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం. ఇందులో రాణించేందుకు విద్యార్థులు గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్ట్టీస్ చేయాలి.
  • ఎన్‌ఎంఎంఎస్ శాట్‌లో మొత్తం 90 ప్రశ్నలకు 90 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇది విద్యార్థికి 8వ తరగతి సబ్జెక్ట్‌లపై ఉన్న పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించిన పరీక్ష.

ఎగ్జామ్ టిప్స్ :
  • మ్యాట్, శాట్‌లలో విద్యార్థి మానసిక సామర్థ్యాలను, అన్వయ నైపుణ్యాలను ప్రధానంగా పరీక్షించడం జరుగుతుంది. ఈ పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
  • ఎన్‌ఎంఎంఎస్ విద్యార్థులకు ఎక్కువగా 7వ,8వ తరగతి.. ఎన్‌టీఎస్‌ఈ రాసే విద్యార్థులకు ఎక్కువగా 9, 10వ తరగతుల నుంచి ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది.
  • ఎన్‌టీఎస్‌ఈ విద్యార్థులు ముందుగా పదోతరగతి సిలబస్ పూర్తిచేసి.. ఆ తర్వాత 9వ తరగతిలోని అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
  • ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాసే వారు 7, 8వ తరగతి సబ్జెక్టులను ఎక్కువగా చదవాలి.
  • వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయాలి. పరీక్ష సమయాన్ని దృష్టిలో ఉంచుకొని బిట్స్ ప్రాక్టీస్-వేగంగా చేయడం నేర్చుకోవాలి.
  • రిఫరెన్స్ బుక్స్ - స్టేట్‌బోర్డ్, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడం మేలు చేస్తుంది.

దరఖాస్తు విధానం :
  • ఏపీలో ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు సెప్టెంబర్ 5, 2019 వరకు అన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలో దరఖాస్తులకు చివరితేదీ ఆగస్టు 29, 2019
    వెబ్‌సైట్: http://main.bseap.org, https://www.bse.telangana.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పరీక్ష ఫీజు (ఎన్‌టీఎస్‌ఈ), దరఖాస్తు ఫీజును రూ.200 సీఎఫ్‌ఎమ్‌ఎస్ ద్వారా చలానా రూపంలో: ఎన్‌ఎంఎంఎస్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మాత్రం రూ.100 (ఓసీ), రూ.50 (ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు) ఫీజును ఎన్‌బీఐ అన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 07, 2019లోపు చెల్లించాలి.

పరీక్ష తేదీలు :
మొదటి దశ రాత పరీక్ష తేదీ:
నవంబర్ 3, 2019.
రెండో దశ రాత పరీక్ష: మే 5, 2020.
  • ఎన్‌ఎంఎంఎస్ రెండు విభాగాలను (మ్యాట్, శాట్) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.
  • ఎన్‌టీఎస్‌ఈ మ్యాట్ పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకూ.. అదే రోజు శాట్ పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు.






















#Tags