IIT & IIM Fees: ఐఐటీలు, ఐఐఎంల్లో ఫీజులు ఇలా!
బీటెక్‌కు ఏటా రూ.రెండు లక్షలు
ఐఐటీల్లో బీటెక్ ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.2 లక్షల వరకు ఉంటోంది. ఈ మొత్తాన్ని సెమిస్టర్ వారీగా చెల్లించాలి. ఒక్కో సెమిస్టర్‌కు సగటున రూ.లక్ష చొప్పున మొత్తం నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు ఎనిమిది సెమిస్టర్లకు కలిపి రూ.8 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
వీటికి అదనంగా లైబ్రరీ ఫీజు, హాస్టల్ ఫీజు, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి వాటికోసం రూ.25 వేల వరకు చెల్లించాలి. అంటే కోర్సు పూర్తి చేసుకునే సమయానికి దాదాపు రూ.పది లక్షల వరకు వ్యయం అవుతుంది.
చదవండి: IIT MBA Placements: ఐఐటీల్లో ఎంబీఏ.. ప్లేస్‌మెంట్స్‌లో జోరు.. ఎంబీఏ ఏడు ఐఐటీల్లో ఇవే..!
ఐఐఎంలలో రూ.20 లక్షల వరకు
మేనేజ్‌మెంట్ విద్యకు పేరుగాంచిన ఐఐఎంల్లో ఎంబీఏ లేదా ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌కు దాదాపు రూ.20 లక్షల వరకు ఫీజు ఉంటోంది. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులకైతే రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు చెల్లించాలి.
ఫస్ట్ జనరేషన్ ఐఐఎంలుగా పేర్కొనే అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కత వంటి క్యాంపస్‌లలో కోర్సు పూర్తి చేసుకోవాలంటే గరిష్టంగా రూ.22 లక్షలు ట్యూషన్ ఫీజుకే చెల్లించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా ఇతర ఖర్చులు(నివాస వ్యయం, వ్యక్తిగత ఖర్చులు) కలుపుకుంటే.. కనీసం రూ.25 లక్షలు వెచ్చిస్తే కానీ ఎంబీఏ/పీజీపీఎం పూర్తి కాదు.
అధిక ఫీజులు..కారణాలు
ప్రస్తుతం ఐఐటీల్లో ఒక్కో విద్యార్థిపై ప్రతి ఏటా రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వ్యయం అవుతున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఐఐఎంలలో నిపుణులైన ఫ్యాకల్టీని నియమించుకునేందుకు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తున్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు అధిక మొత్తాలు వెచ్చిస్తున్నారు. వీటితోపాటు ఇండస్ట్రియల్ టూర్స్, ఇతర స్టడీ బేస్డ్ ప్రాజెక్ట్‌ల కోసం వ్యయం చేస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించే క్రమంలో మౌలిక వసతులు, ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ తదితరాల కోసం అధిక మొత్తంలో చేస్తున్న నేపథ్యంలో.. ఐఐటీలు, ఐఐఎంల్లో ఫీజులు కొంత ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.
ఆయా వర్గాలకు రాయితీలు
ఐఐటీల్లో బీటెక్ విద్యార్థులకు ఫీజుల విషయంలో పలు రాయితీలు లభిస్తున్నాయి. ఎస్‌సీ, ఎస్టీ వర్గా లు, దివ్యాంగ వర్గాల విద్యార్థులకు ట్యూషన్ ఫీజు నుంచి పూర్తి రాయితీ ఉంటుంది. కుటుంబ వార్షికాదా యం రూ.లక్షలోపు ఉన్న విద్యా ర్థులకు వారి సామా జిక వర్గంతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రాయితీ సౌకర్యం కల్పిస్తారు.
కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉంటే ఫీజులో మూడింట రెండొంతుల మొత్తం మేరకు (66 శాతం) మినహాయింపు లభిస్తుంది. ఇలా పలు విధానాలను పరిశీలిస్తే దాదాపు 70 శాతం మందికి ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లేదో రాయితీ అందే అవకాశం ఉంది.
ఐఐఎంలలో ఆర్థిక తోడ్పాటు
ప్రస్తుతం పలు ఐఐఎంలలో విద్యార్థులకు నీడ్ బేస్డ్, మెరిట్ బేస్డ్ అసిస్టెన్స్ లభిస్తోంది. కుటుంబ వార్షికాదాయం నిర్దేశిత మొత్తంలో ఉన్న వారికి ఆయా క్యాంపస్‌లు ట్యూషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వడం లేదా నెలవారీ స్టయిఫండ్ పథకాలు అందించడం చేస్తున్నాయి.
ఐఐఎం అహ్మదాబాద్‌లో.. కుటుంబ వార్షికాదాయ ఆధారిత ట్యూషన్ ఫీజు మినహాయింపు పథకం అమలవుతోంది. కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షలలోపు ఉన్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తోంది.
స్కాలర్‌షిప్ పథకాలు
- ఐఐఎంల్లో పలు స్కాలర్‌షిప్ పథకాలు అందుబాటులో ఉంటున్నాయి. ఐఐఎం–బెంగళూ రులో ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్, ఉదయ్‌నాయక్ స్కాలర్‌షిప్, టి.థామస్ స్కాలర్‌షిప్, ఓపీ జెమ్స్ స్కాలర్‌షిప్, రాజేశ్ కౌశిక్ మెమోరియల్ స్కాలర్‌షిప్, ఆక్వెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ స్కాలరషిప్స్, కాగ్నిజెంట్ సంస్థ అందించే స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉన్నాయి.
- ఐఐఎం–లక్నో.. కుటుంబ వార్షికాదాయం రూ.15 లక్షలలోపు ఉన్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇస్తోంది. ఈ మినహాయింపును అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 15 శాతం మందికి అందిస్తోంది. అదే విధంగా హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్, సిటి బ్యాంక్, రతన్ టాటా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు కూడా స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. ఈ స్కాలర్‌షిప్ మొత్తాలు రూ.ఆరు వేల నుంచి రూ. పది లక్షల వరకు ఉంటున్నాయి. అదేవిధంగా అన్ని ఐఐఎం క్యాంపస్‌లలో అలూమ్నీ ఫౌండేషన్స్ సహకారంతో మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నారు.
రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్‌షిప్
ఐఐటీల్లో బీటెక్ కోర్సులు చదివే విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో అవకాశం.. రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్, టీచింగ్ అసిస్టెన్స్‌షిప్ పథకాలు. ఈ రెండింటి ద్వారా విద్యార్థులు అప్పటికే సదరు ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ చేస్తున్న వారికి సహాయకులుగా వ్యవహరిస్తూ అటు అకడమిక్ నైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్‌షిప్ పొందొచ్చు.
ఇండస్ట్రీ స్పాన్సర్డ్ స్కాలర్‌షిప్స్
ఐఐఎంలో సీటు పొందిన విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ఆర్థిక ప్రోత్సాహకం.. ఇండస్ట్రీ స్పాన్సర్డ్ అసిస్టెన్స్. ముఖ్యంగా పని అనుభవం ఆధారంగా నిర్వహించే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఇవి లభిస్తున్నాయి. సదరు అభ్యర్థులు అప్పటికే పని చేస్తున్న సంస్థ ఆర్థిక సహకారం అందిస్తుంది. కోర్సు పూర్తి చేసుకున్నాక తమ సంస్థలోనే పని చేసే విధంగా ముందుగానే ఒప్పందం చేసుకుంటుంది. ఇప్పుడు పలు కార్పొరేట్ సంస్థలు, ఎంఎన్‌సీలలో ఈ విధానం అమలవుతోంది.
అలూమ్నీ సహకారం
ఐఐటీలు, ఐఐఎంల క్యాంపస్‌లలో ప్రస్తుత విద్యార్థులకు.. పూర్వ విద్యార్థుల నుంచి కూడా ఆర్థిక సహకారం లభిస్తోంది. పలు క్యాంపస్‌లలో అలూమ్నీ స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం విద్యార్థులు ఆయా క్యాంపస్‌లలో అడుగు పెట్టాక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఉన్నత విద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
విద్యాలక్ష్మి పథకం
ఫీజుల భారం నేరుగా భరించాల్సి ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఐఐటీల్లో ప్రవేశం ఖరారై ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన వారు వడ్డీ రహిత రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది. అదే విధంగా తక్కువ వడ్డీకి రుణాలు అందుకునే వీలుంది.
నిర్దిష్ట జీపీఏ తప్పనిసరి
స్కాలర్‌షిప్స్, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలను పొందేందుకు విద్యార్థులు ప్రతి సెమిస్టర్‌లో నిర్దిష్ట జీపీఏ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 6.5, గరిష్టంగా 8.5 జీపీఏను పొందాల్సి ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. ఐఐటీలు, ఐఐఎంల్లో ఫీజులు భారీగానే ఉన్నా.. అకడమిక్ ప్రతిభ, సామాజిక వర్గాల నేపథ్యం ఆధారంగా మినహాయింపులు, రాయితీలు, స్కాలర్‌షిప్‌లు, రుణాలు పొందే అవకాశం ఉంది.