కెరీర్ గైడెన్స్...చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)

ఎల్లలు లేని అవకాశాలకు వేదికగా నిలుస్తోన్న కోర్సు చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ). ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహిస్తుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అకౌంటింగ్ సంస్థ ఐసీఏఐ. ఈ సంస్థ అందించే సీఏ సర్టిఫికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పదో తరగతి అర్హతతోనే భవిష్యత్తుకు పునాది వేసే సీఏ కోర్సు స్వరూపంపై సమగ్ర సమాచారం.

మూడు దశల కోర్సు:
ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ పూర్తి చేసిన వారైనా సీఏ చదివేందుకు అర్హులు. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ); ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ (ఐపీసీసీ), ఫైనల్ కోర్స్.

‘పది’తో సీపీటీకి:
సీఏ కోర్సు క్రమంలో తొలి దశ కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్. ఇది పూర్తి స్థాయి కోర్సుకి ఒక అర్హత పరీక్ష వంటిది. సీఏ భవిష్యత్తుగా ఎంచుకోవాలనుకునే ప్రతి విద్యార్థి దీనిలో ఉత్తీర్ణత సాధించాల్సిందే. దీని కోసం పదో తరగతి పూర్తి కాగానే ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఐసీఏఐలో పేరు నమోదు చేసుకోవాలి. ఇలా పేరు నమోదు చేసుకున్న విద్యార్థుల తమ ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక మాత్రమే సీపీటీకి హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. ఇందుకోసం ఇంటర్మీడియెట్ పరీక్షలు రాశాక దరఖాస్తు చేసుకోవాలి. సీపీటీ ప్రతి సంవత్సరం రెండుసార్లు (జూన్ / డిసెంబర్) జరుగుతుంది. వీటికి హాజరుకావాలంటే దరఖాస్తు చేసుకునే సమయానికి, సీపీటీకి మధ్య రెండు నెలల వ్యవధి తప్పనిసరి. అంటే జూన్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే ఏప్రిల్ ఒకటో తేదీలోపు; డిసెంబర్‌లో సీపీటీకి హాజరవ్వాలంటే అక్టోబర్ ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఐపీసీసీ.. సీఏ కోర్సులో కీలకమిదే:
కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఏ కోర్సు క్రమంలో ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్‌కు పేరు నమోదు చేసుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులు.. గ్రూప్-1, గ్రూప్-2గా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా పేరు నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల పాటు ఉండే స్టడీ కోర్సును పూర్తి చేయాలి. దీంతోపాటు 35 గంటల వ్యవధిలో సాగే ఓరియెంటేషన్ కోర్సు, వంద గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. వీటిని పూర్తి చేసిన వారికి మాత్రమే ఐపీసీసీలోని గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది.

సీఏ ఫైనల్.. దానికి ముందే ఆర్టికల్ ట్రెనింగ్:
ఐపీసీసీలోని రెండు గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీఏ ఫైనల్ కోర్సులోకి అనుమతి లభిస్తుంది. అయితే దీనికంటే ముందుగా ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వెంటనే ఆర్టికల్‌షిప్ (ఆర్టికల్డ్ అసిస్టెంట్‌గా) కోసం నమోదు చేసుకోవాలి. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఈ ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. వ్యవధి మూడేళ్లు. ఆర్టికల్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని ఆధారంగా సీఏ ఫైనల్ కోర్సు కోసం పేరు నమోదు చేసుకోవాలి. సీఏ ఫైనల్ కోర్సు చదువుతూ, ఆర్టికల్‌షిప్ చివరి 12 నెలల సమయంలో.. 15 రోజుల జనరల్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల ఆర్టికల్‌షిప్ పూర్తి చేసిన తర్వాత లేదా ఆర్టికల్‌షిప్ చివరి ఆరు నెలల సమయంలో ఉన్నప్పుడు ఫైనల్ కోర్సు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే పూర్తిస్థాయి చార్టర్డ్ అకౌంటెంట్‌గా గుర్తింపు లభించినట్లే.

సిలబస్:
సీపీటీ:
సీపీటీ పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో రెండు సెషన్‌లుగా ఉంటుంది. . సెషన్-1లో సెక్షన్ -ఎ (ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్- 60 మార్కులు ), సెక్షన్-బి (మర్కెంటైల్ లా- 40 మార్కులు); సెషన్‌లో-2లో సెక్షన్-సి (జనరల్ ఎకనామిక్స్- 50 మార్కులు), సెక్షన్-డి (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 50 మార్కులు) ఉంటాయి. ఈ పరీక్షలో విద్యార్థులు కనీసం 50 శాతం అంటే 100 మార్కులను సాధిస్తేనే ఐపీసీసీకి అర్హులవుతారు. పరీక్ష వ్యవధి: ఒక్కో సెషన్ రెండు గంటలు.

రెండు గ్రూపుల ఐపీసీసీ:
రెండు గ్రూపులుగా ఉండే ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్స్‌లో గ్రూప్-1లో నాలుగు పేపర్లు, గ్రూప్-2లో మూడు పేపర్లు ఉంటాయి. అవి..

గ్రూప్-1
  • పేపర్-1: అకౌంటింగ్
  • పేపర్-2: లా, ఎథిక్స్, కమ్యూనికేషన్ (పార్ట్-1 లా, పార్ట్-2 బిజినెస్ ఎథిక్స్, పార్ట్-3 బిజినెస్ కమ్యూనికేషన్)
  • పేపర్-3: కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్.
  • పేపర్-4: ట్యాక్సేషన్ (పార్ట్-1 ఇన్‌కం ట్యాక్స్, పార్ట్-2 సర్వీస్ టాక్స్, వ్యాట్)
గ్రూప్-2
  • పేపర్-5: అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్
  • పేపర్-6: ఆడిటింగ్ అష్యూరెన్స్
  • పేపర్-7: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ (సెక్షన్-ఎ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెక్షన్-బి స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్).
ప్రతి పేపర్‌కు గరిష్ట మార్కులు 100.

సీఏ ఫైనల్:
పూర్తి స్థాయి చార్టర్డ్ అకౌంటెంట్‌గా తీర్చిదిద్దే ఫైనల్ కోర్సు కూడా రెండు గ్రూపులుగా ఉంటుంది. ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి. అవి..

గ్రూప్-1
  • పేపర్-1: ఫైనాన్షియల్ రిపోర్టింగ్
  • పేపర్-2: స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్
  • పేపర్-3: అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్
  • పేపర్-4: కార్పొరేట్ అండ్ అల్లయిడ్ లాస్ (సెక్షన్ ఎ కంపెనీ లా; సెక్షన్ బి: అల్లయిడ్ లాస్)
గ్రూప్-2
  • పేపర్-5: అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్
  • పేపర్-6: ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్
  • పేపర్-7: డెరైక్ట్ ట్యాక్స్ లాస్
  • పేపర్-8: ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్ (సెక్షన్ ఎ: సెంట్రల్ ఎక్సెజ్; సెక్షన్ బి: సర్వీస్ ట్యాక్స్ అండ్ వ్యాట్; సెక్షన్ సి: కస్టమ్స్)
ఉన్నత విద్య:
కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో పూర్తి చేసే సీఏ కోర్సుకి.. ప్రభుత్వం ఇతర బ్యాచిలర్ డిగ్రీలకు తత్సమాన గుర్తింపు ఇచ్చింది. ఈ క్రమంలో సీఏ ఫైనల్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఎంకాం, ఎంబీఏ వంటి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2 మొదలైన అన్ని ఉద్యోగ పరీక్షలకు హాజరుకావచ్చు.

విధులు:
ఏ సంస్థలోనైనా ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వాటి గురించి వివరించేదే చార్టెర్డ్ అకౌంటెంట్. కంపెనీలు, వ్యక్తుల టాక్స్ ప్లానింగ్ విషయంలో సీఏ అవసరం తప్పనిసరి. అంతే కాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివద్ధి, కొత్త ప్రాజెక్టు రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జాయింట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు, బీపీఓ మొదలైన వాటిలో సీఏ కీలక పాత్ర పోషిస్తాడు.

కెరీర్ ఆప్షన్స్:
సీఏ కోర్సు పూర్తి చేసిన వారిని రిక్రూట్ చేసుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పలు కార్పొరేట్ సంస్థలు ఐసీఏఐ బ్రాంచ్‌లలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. గతంలో ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్‌లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్లో ఐసీసీఐ బ్యాంకు గరిష్టంగా రూ. 9 లక్షల వార్షిక వేతనం అందించిందంటే సీఏ కోర్సు ఉత్తీర్ణులకు ఉన్న డిమాండ్ అర్థమవుతుంది. వీరికి సేవా రంగం, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, వివిధ పరిశ్రమలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. అంతేకాకుండా టైర్-3 పట్టణాల్లోని రిటైల్ షాపులు, జ్యువెలరీ, వస్త్ర, తదితర వాణిజ్య, వ్యాపార సంస్థల ఆదాయవ్యయాలు, ఉత్పత్తి ఖర్చులు, స్టేషనరీ, మానవ వనరులకు చెల్లించే వేతనాలు, ఇతర వ్యయాలు, అమ్మకాలు, కొనుగోళ్లు, కంపెనీ లాభనష్టాలు.. ఇలా ప్రతి దశలోనూ సీఏల అవసరం అనివార్యం. అంతేకాకుండా కంపెనీల చట్టం 1956 ప్రకారం ప్రతి కంపెనీ తమ ఆర్థిక నివేదికలను సీఏతో సర్టిఫై చేయించాలి. 40 లక్షల టర్నోవర్ కలిగిన ప్రతి సంస్థ తమ లెక్కలను తప్పనిసరిగా సీఏల తో ఆడిట్ చేయించాలి. ఈ నేపథ్యంలో నిపుణులైన సీఏల అవసరం భారీ స్థాయిలో ఉంటోంది. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతగా ఆడిటర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు.

కెరీర్:
ప్రారంభంలో అకౌంట్స్ లేదా ఫైనాన్స్ ఆఫీసర్‌గా అడుగుపెట్టిన వారు అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఫైనాన్స్ డెరైక్టర్, సీఈఓ స్థాయికి చేరుకోవచ్చు. ఈ క్రమంలో ఉండే జాబ్ ప్రొఫైల్స్..
  • మేనేజింగ్ డెరైక్టర్
  • ఫైనాన్స్ కంట్రోలర్
  • చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్
  • మార్కెటింగ్ మేనేజర్
  • ప్లాంట్ అకౌంటెంట్స్
  • సిస్టమ్ ఇంప్లిమెంటార్స్
  • టెక్నో ఫంక్షనిస్టులు
  • అడ్మినిస్ట్రేటర్
  • వాల్యూయర్
  • మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్
  • ట్యాక్స్ కన్సల్టెంట్
వేతనాలు:
సీఏ ఉత్తీర్ణులకు జాబ్ గ్యారంటీతోపాటు ఆకర్షణీయమైన వేతనాలు కూడా లభిస్తాయి. ప్రారంభంలో నెలకు రూ. 35,000ల నుంచి రూ. 50,000 వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా లక్షల్లో వార్షిక వేతనం లభిస్తుంది.

కావల్సిన నైపుణ్యాలు:
ఇంతటి అవకాశాలు కల్పించే సీఏ కోర్సులో చేరేవారికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఆవశ్యకత ఎంతో ఉంది. వాటిలో ముఖ్యమైంది సహనం. విస్తతంగా ఉండే సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించి ఆకళింపు చేసుకోవాలంటే సహనం ఎంతో అవసరం. అదేవిధంగా బుక్స్ ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అన్వయించే నైపుణ్యం, తార్కిక ఆలోచన నైపుణ్యం కూడా ఈ కోర్సు ఔత్సాహికులకు అవసరమైనవే. దీన్ని దష్టిలో పెట్టుకునే ఐసీఏఐ మూడేళ్ల ఆర్టికల్‌షిప్ ట్రెనింగ్‌ను తప్పనిసరి చేసింది. దీని ద్వారా విద్యార్థులు తాము బుక్స్‌లో నేర్చుకున్న అంశాలను ఎప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా అన్వయించే సామర్థ్యం సొంతమవుతుంది. అదేవిధంగా స్వీయ ఉపాధి క్రమంలో సొంత ఆడిట్ సంస్థలను ఏర్పాటు చేసుకున్న అభ్యర్థులకు వాక్చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ నెట్‌వర్కింగ్ స్కిల్స్ అవసరం కూడా ఎంతో. తమ క్లయింట్ల సంఖ్యను పెంచుకుని సంస్థను అభివద్ధి చేసుకునే క్రమంలో ఇవి ఎంతో లాభిస్తాయి.

స్కాలర్‌షిప్స్:
సీఏ కోర్సులో చేరి ప్రతిభ చూపిన విద్యార్థులకు ఐసీఏఐ పలు స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తోంది. ఐపీసీసీలో టాప్ టెన్‌లో ఉన్న వారికి 18 నెలల పాటు నెలకు ’ 1500; ఫైనల్‌లో టాప్‌లెన్‌లో నిలిచిన వారికి 30 నెలలు లేదా ఆర్టికల్‌షిప్ ట్రెనింగ్ సమయంలో మిగిలున్న సమయం మొత్తానికి (ఏది తక్కువైతే ఆ వ్యవధికి) నెలకు ’ రెండు వేలు చొప్పున మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తుంది. అదేవిధంగా మెరిట్ కం నీడ్ బేస్డ్ పేరిట ఐపీసీసీలో 18 నెలలపాటు; ఫైనల్ కోర్సులో 30 నెలలపాటు మొత్తం 60 మంది విద్యార్థులకు నెలకు ’ 1500 స్కాలర్‌షిప్ అందిస్తోంది. అంతేకాకుండా నీడ్ బేస్డ్, వీకర్ సెక్షన్స్‌కు చెంది ఐపీసీసీ, ఫైనల్ కోర్సు చదివే విద్యార్థులు మొత్తం 200 మందికి 18 నెలలు (ఐపీసీసీ); 30 నెలలు (ఫైనల్) పాటు నెలకు ’ 12, 50 స్కాలర్‌షిప్ లభిస్తుంది.

డిగ్రీతో నేరుగా:
గతంలో సీఏలో చేరాలంటే.. ప్రతి ఒక్కరూ కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సీపీటీ) తప్పనిసరిగా రాయాల్సిందే. ఇది పూర్తయితేనే రెండో దశ ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు (ఐపీసీసీ)లో ప్రవేశించడానికి వీలయ్యేది. కానీ తాజా మార్పుల ప్రకారం- డిగ్రీ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు సాధించిన కామర్స్ గ్రాడ్యుయేట్లు లేదా డిగ్రీ/పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులు ఉన్న నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్లు లేదా ఐసీడబ్ల్యూఏ లేదా సీఎస్‌లో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు సీపీటీకు హాజరు కావల్సిన అవసరం లేదు. వీరు నేరుగా రెండో దశ ఐపీసీసీలో చేరొచ్చు.

ఐసీడబ్ల్యూఏ, సీఎస్ చేసినవాళ్లు సీపీటీ లేకపోయినా.. ఐపీసీసీలో ఫస్ట్‌గ్రూప్ లేదా రెండు గ్రూపుల్లో ఉత్తీర్ణతతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు, ఓరింయేటేషన్ కోర్సు పూర్తిచేస్తేనే మూడేళ్ల ఆర్టికల్‌షిప్ చేయడానికి అర్హులు. ఈ నాలుగు విభాగాల విద్యార్థులకు తప్ప మిగతా వాళ్లందరికీ యధావిధిగా సీపీటీ పరీక్ష ఉంటుంది. అదేవిధంగా ఐపీసీసీలో ఫస్ట్ గ్రూప్ లేదా రెండు గ్రూపులు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు గతంలో సీఏలో ఆర్టికల్‌షిప్‌నకు అర్హత సాధించే వారు. కానీ తాజా మార్పుల నేపథ్యంలో ఆర్టికల్‌షిప్‌ను తొలి రోజు నుంచే మొదలు పెట్టవచ్చు. ఐపీసీసీ పరీక్ష రాయడానికి మాత్రం 9 నెలల ఆర్టికల్‌షిప్, 8 నెలల స్టడీ పిరియడ్ తప్పనిసరి చేశారు.

అకౌంటింగ్ టెక్నీషియన్ కోర్సు:
సీఏ గట్టెక్కలేనివారి కోసం ఐసీఏఐ ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్ టెక్నీషియన్. సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తిచేయలేను అని అనుకుంటే ఐపీసీసీలోని గ్రూప్-1 పూర్తి చేసి, ఒక ఏడాదిపాటు సీఏ దగ్గర ఆర్టికల్ షిప్ చేస్తే అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికెట్ లభిస్తుంది. పరిశ్రమలో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు, అంతర్జాతీయ డిమాండ్ ఉంది. ఈ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ/ప్రభుత్వేతర సంస్థలలో అకౌంటెంట్‌గా చేరి నెలకు రూ. 25,000 వేతనం పొందొచ్చు. ఉద్యోగం చేస్తూనే ఐపీసీసీ రెండో గ్రూప్‌లో కూడా ఉత్తీర్ణత పొంది తర్వాత ఫైనల్ రాసి ఛార్టర్డ్ అకౌంటెంట్ హోదాను పొందొచ్చు.
వెబ్‌సైట్: www.icai.org



































#Tags