Union Budget: కేంద్ర బడ్జెట్‌ 2024-25.. పూర్తి వివ‌రాలు ఇవే..

2024–25 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23వ తేదీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

ఎన్డీఏ ప్రభుత్వంపై వరుసగా మూడోసారి నమ్మకముంచిన దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌ రూపుదిద్దుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ నానా సవాళ్లతో సతమతం అవుతున్నా భారత్‌ మాత్రం తిరుగులేని వృద్ధిరేటుతో దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. 

‘‘ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నట్టు మన దేశంలో ఉన్నది ‘నాలుగే కులాలు’. అవి.. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలు. వారి అభ్యున్నతి కోసం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, మధ్యతరగతిపై బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించాం’’ అని వివరించారు. 4.1 కోట్ల పై చిలుకు యువతీయువకులకు వచ్చే ఐదేళ్లలో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన నిమిత్తం 5 పథకాలతో కూడిన ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ని ప్రకటించారు. 

2047 నాటికి వికసిత భారత్‌ సాకారమే లక్ష్యంగా ‘వ్యవసాయ రంగంలో మరింత ఉత్పాదకత, ఉపాధి–నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి–సామాజిక న్యాయం, నిర్మాణ–సేవా రంగాలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్‌–రీసెర్చ్, సంస్కరణ’ల పేరిట ఎన్డీఏ ప్రభుత్వ ‘తొమ్మిది ప్రాథమ్యాల’కు తెరతీశారు. దీన్ని రానున్న బడ్జెట్లలో మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. 

రైతు నుంచి యువత దాకా.. 
వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్లో పలు చర్యలు చేపట్టినట్టు నిర్మల వెల్లడించారు. ‘‘సాగులో ఉత్పాదకతను పెంచేలా పరిశోధనలకు పెద్దపీట వేయనున్నాం. 32 పంట రకాల్లో అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 100కు పైగా వంగడాలను అభవృద్ధి చేస్తాం. కోటిమందికి పైగా రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లిస్తాం. అందుకు అన్నివిధాలా దన్నుగా నిలుస్తాం. తృణధాన్యాలు, నూనెగింజల అభివృద్ధిలో వీలైనంత త్వరగా స్వయంసమృద్ధి సాధిస్తాం’’ అని వివరించారు. ‘‘సంఘటిత రంగంలో ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టే వారికి తొలి నెల వేతనం కేంద్రమే అందిస్తుంది. 

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు కల్పిస్తాం. కోటి మందికి టాప్‌–500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తాం. ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల దాకా రుణాలకు వీలు కల్పిస్తాం. అన్ని రంగాల్లోనూ మహిళలు మరింతగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలు కల్పిస్తాం’’ అని చెప్పారు. ఉద్యోగికీ, యజమానికీ ఇద్దరికీ లాభించేలా పీఎఫ్‌ ప్రోత్సాహకాల వంటి పలు చర్యలను ప్రకటించారు. అధికారికంగానే 6.7 శాతం దాటిన పట్టణ నిరుద్యోగాన్ని ఎంతో కొంత నేలకు దించే ప్రయత్నం బడ్జెట్‌ కేటాయింపుల్లో కనిపించింది. 

భాగస్వాములకు ఇలా.. 
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కోణంలో చూస్తే నితీశ్‌కుమార్‌ పాలనలోని బిహార్‌పై నిర్మలమ్మ ఏకంగా రూ.60,000 కోట్ల మేరకు వరాల జల్లు కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌ వేలు, భారీ విద్యుత్కేంద్రం, రెండు హెరిటేజ్‌ కారిడార్లు, ఎయిర్‌పోర్టుల వంటివెన్నో వీటిలో ఉన్నాయి. ఇవేగాక అవసరమైన మేరకు ఆ రాష్ట్రానికి మరిన్ని అదనపు కేటాయింపులూ ఉంటాయని మంత్రి ప్రకటించారు! అక్కడ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న విషయం తెలిసిందే. రాజధాని అవసరాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక రుణం అందేలా చూస్తామన్నారు. పోలవరం త్వరిత నిర్మాణం, రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలకు గ్రాంటు తదితరాలను ప్రస్తావించారు. 

రాష్ట్రాలతో కలిసి ముందుకు..
నగరాల సమగ్రాభివృద్ధికి రాష్ట్రాల సమన్వయంతో కృషి చేస్తామని నిర్మల పేర్కొన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధి ద్వారా వాటిని గ్రోత్‌ హబ్‌లుగా తీర్చిదిద్దుతామన్నారు. పీఎం ఆవాస్‌ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లు కట్టించనున్నారు. మహిళలు, బాలికల ప్రగతి, సంక్షేమానికి ఈసారి ఏకంగా రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాన్ని ప్రతిపాదించారు. 

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింతగా ప్రోత్సహించేందుకు ముద్రా రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. ‘‘పీఎం సూర్య ఘర్‌ పథకం కింద రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్ల ద్వారా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు అందించే పథకానికి అద్భుతమైన స్పందన వచ్చింది. 14 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని మంత్రి చెప్పారు. ఈ పథకాన్ని మరింతగా ముందుకుతీసుకెళ్తామన్నారు. 

మహిళలకు మంచి కబురు..
సామాన్యునిపై పన్నుల భారాన్ని వీలైంతగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నిర్మల ప్రకటించారు. మహిళలకు చల్లని కబురు వినిపించారు. బంగారం, వెండి, ప్లాటినంతో పాటు మొబైల్స్‌పైనా దిగుమతి సుంకం తగ్గించారు. తద్వారా వాటి ధరలు దిగి రానున్నాయి. పీఎం విశ్వకర్మ, స్వానిధి, స్టాండప్‌ ఇండియా తదితరాలతో చేతి వృత్తుల వారు, స్వయంసహాయక బృందాలు మొదలుకుని ఎస్సీ, ఎస్టీల దాకా అన్ని వర్గాల సంక్షేమానికి భరోసా లభిస్తుందని మంత్రి అన్నారు. ‘పూర్వోదయ’ పథకం తూర్పు భారతదేశ ప్రగతిని పరుగులు పెట్టిస్తుందని చెప్పారు. 

ఈశాన్య రాష్ట్రాలకూ పలు కేటాయింపులు చేశారు. పర్యాటకాభివృద్ధికి పలు చర్యలను ప్రతిపాదించారు. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు ద్వారా స్టార్టప్‌లకు మరింత ఊపునిచ్చేందుకు విత్త మంత్రి ప్రయత్నించారు. విదేశీ కంపెనీలపై ఆదాయ పన్ను భారాన్ని 40 నుంచి 35 శాతానికి తగ్గించారు. అన్ని రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిశోధనల కోసం అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫండ్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పట్టణ భూ రికార్డులను పూర్తిగా డిజిటైజ్‌ చేయనున్నట్టు తెలిపారు. ఆదాయపన్ను చట్టం–1961ని సమూలంగా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. 

బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాథమ్యాలు
1. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత 
➤ వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్ల కేటాయింపులు 
➤ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 109 రకాల కొత్త వంగడాలు  రైతులకు అందుబాటులోకి 
➤ రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ సాగు బాట పట్టేలా చర్యలు. 
➤ అందుకు దన్నుగా నిలిచేలా 10 వేల బయో ఇన్‌పుట్‌ వనరుల కేంద్రాలు 
➤ రైతులు, వారి భూముల కవరేజీ తదితరాల కోసం మూడేళ్లలో  డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా (డీపీఐ) అభివృద్ధి 

2.ఉపాధి–నైపుణ్యాభివృద్ధి 
➤ ఏ పథకాల్లోనూ లబ్ధిదారులు కాని యువతకు ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల దాకా రుణాలు 
➤ ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ 
➤ ఉద్యోగికి, యజమానికి లాభించేలా పీఎఫ్‌ ప్రోత్సాహకాలు తదితరాలు 
➤ ప్రత్యేకించి మహిళల కోసం పలు చర్యలు 
➤ ఐదు పథకాలతో కూడిన సమగ్ర ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ 

3. మానవ వనరుల అభివృద్ధి–సామాజిక న్యాయం 
➤ పలు రాష్ట్రాల్లో పారిశ్రామిక, హెరిటేజ్‌ కారిడార్ల అభివృద్ధి 
➤ 63 వేల గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకం 
➤ మహిళలు, బాలికల అభ్యున్నతి పథకాలకు రూ.3 లక్షల కోట్లు 
➤ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 

4. నిర్మాణ–సేవా రంగాలు
➤ తయారీ రంగంలో ఎంఎస్‌ఎంఈల కోసం రుణ హామీ పథకాలు 
➤ థర్డ్‌ పార్టీ గ్యారంటీ లేకుండా రూ.100 కోట్ల దాకా రుణాలు 
➤ ముద్రా రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు 
➤ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కామర్స్‌ ఎగుమతి హబ్‌లు 

5. పట్టణాభివృద్ధి
➤ 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 నగరాల సమగ్రాభివృద్ధికి రవాణా ఆధారిత ప్రణాళికలు, వ్యూహాలు 
➤ ప్రధాని పట్టణ ఆవాస్‌ యోజన 2.0 కింద కోటి మంది పట్టణ  పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్లు 
➤ ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే ఐదేళ్లలో ఏటా 100 చొప్పున వీధి మార్కెట్లు 

6. ఇంధన భద్రత
➤ ఉపాధి, వృద్ధి తదితరాలతో పాటు పర్యావరణ హితాన్నీ దృష్టిలో పెట్టుకుంటూ సంప్రదాయేతర ఇంధన వనరులకు మరింత ప్రోత్సాహం 
➤ కరెంటు నిల్వ కోసం పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం 
➤ ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యంలో చిన్న, మాడ్యులార్‌  అణు రియాక్టర్ల అభివృద్ధి 

7. మౌలిక సదుపాయాలు 
➤ దీర్ఘకాలిక లక్ష్యంతో రూ.11.11 లక్షల కోట్ల కేటాయింపులు రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలకు రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు 
➤ పీఎంజీఎస్‌వై–4తో 25 వేల గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ 
➤ వరద ప్రభావిత రాష్ట్రాల్లో సమస్య శాశ్వత నివారణే లక్ష్యంగా పలు ప్రాజెక్టులు 
➤ పలు రాష్ట్రాల్లో పర్యాటక తదితర కారిడార్ల అభివృద్ధి 

8. ఇన్నొవేషన్‌ – రీసెర్చ్‌ 
➤ పరిశోధన, నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫండ్‌ 
➤ ప్రైవేట్‌ రంగ సమన్వయంతో పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సా హమిచ్చేందుకు రూ.లక్ష కోట్ల ఫైనాన్సింగ్‌ పూల్‌ 
➤ అంతరిక్ష ఆర్థికాన్ని వచ్చే పదేళ్లలో కనీసం ఐదు రెట్లు విస్తరణ.అందుకు ఈ బడ్జెట్లో రూ.1,000 కోట్లు. 

9. భావి తరం సంస్కరణలు
➤ భూములన్నింటికీ ప్రత్యేక ల్యాండ్‌ పార్సిల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్, లేదా భూ ఆధార్‌ 
➤ భూ రిజిస్ట్రీ ఏర్పాటు, రైతుల రిజిస్ట్రీతో లింకేజీ 
➤ జీఎస్‌ఐ మ్యాపింగ్‌తో పట్టణ ప్రాంత భూ రికార్డుల డిజిటైజేషన్‌ 
➤ అన్నిరకాల కార్మిక సేవలూ ఒక్కతాటిపైకి. సంబంధిత  పోర్టళ్లతో ఇ–శ్రామ్‌ పోర్టల్‌ అనుసంధానం

భూటాన్‌కు అత్యధికం.. మాల్దీవులకు కోత
భారత పొరుగుదేశమైన భూటాన్‌కు ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌’ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా రూ.2068 కోట్లను అభివృద్ధి ఎయిడ్‌ కింద కేటాయించింది. అయితే, మాల్దీవులకు మాత్రం గత ఏడాదితో పోలిస్తే నిధుల్లో కోత విధించింది. మాల్దీవులకు గత ఏడాది రూ.770 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించింది. 

గత ఏడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడిగా చైనా అనుకూలురైన మొహమ్మద్‌ మొయిజ్జు వచ్చాక భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. విదేశాంగ శాఖకు గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.29,121 కోట్లు కేటాయించగా 2024–25 బడ్జెట్‌లో రూ.22,154 కోట్లు కేటాయించారు. భూటాన్‌ తర్వాత నేపాల్‌కు అధికంగా నిధులు (రూ.700 కోట్లు) కేటాయించారు. 

శ్రీలంకకు గత ఏడాది రూ.60 కోట్లు కేటాయించగా, ఈసారి మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. కేంద్ర బడ్జెట్‌లో సాయం కింద అఫ్గానిస్తాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, మయన్మార్‌కు రూ.250 కోట్లు, మారిషస్‌కు రూ.370 కోట్లు, ఆఫ్రికా దేశాలకు రూ.200 కోట్లు కేటాయించారు. లాటిన్‌ అమెరికా, యురేసియా దేశాలకు అభివృద్ధి సాయం కింద రూ.4883 కోట్లు కేటాయించారు.

#Tags