Govt Junior Colleges: కళాశాలల్లో ప్రభుత్వం కేటాయించిన సదుపాయాలు.. పరీక్షల్లో ఫలించిన విద్యార్థుల కృషి..!
అమరావతి: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలను మించిన ఫలితాలను సాధించి ఔరా అనిపించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించిన ప్రభుత్వం, ప్రభుత్వ కళాశాలలను కూడా అభివృద్ధి చేసింది. వాటిలో చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని అందించింది. ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ హైస్కూళ్లను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసి వాటిలో ఇంటర్మీడియెట్ కోర్సులను ప్రవేశ పెట్టింది. దీంతో గతంలో మండల కేంద్రాల్లో కళాశాలలు లేక చదువుమానేసే విద్యార్థులకు తమ నివాసాలకు సమీప ప్రాంతాల్లోనే కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, ఇంటర్మీడియెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక తరగతులు సైతం నిర్వహించింది. ఈ చర్యలన్నీ ఫలించి కార్పొరేట్ కళాశాలలు బిత్తరపోయేలా ప్రభుత్వ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో రికార్డులు సృష్టించారు.
టాపర్‌గా తహురా
అన్నమయ్య జిల్లా మదనపల్లె రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్ రియాజ్ అలీ, షేక్ నూర్‌భాను కుమార్తె షేక్ తహురా స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివింది. తాజా ఫలితాల్లో 979 మార్కులతో టాపర్‌గా నిలిచింది.
♦ కృష్ణా జిల్లా మొవ్వలో క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల జనరల్ కోర్సుల్లో 91.26 శాతం, వృత్తి విద్యా విభాగంలో 92.9 శాతం ఉత్తీర్ణతను సాధించింది. కళాశాల విద్యార్థులు ఎన్.హర్షిత (ఎంఈటీ)968, శ్రీవిద్య(ఎంపీసీ) 963, పి.శ్రావ్య (బైపీసీ) 953 మార్కులతో సత్తా చాటారు. అలాగే అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి ని ఎం.శ్వేత ఎంపీసీలో 951 మార్కులతో టాపర్‌గా నిలిచింది. చల్లపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 92 శాతం, ఫస్టియర్ విద్యార్థి నులు 87.5 శాతం ఉత్తీర్ణత సాధించారు.
♦ పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలసకు చెందిన బర్ల లలిత ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కు 435 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె తల్లిదండ్రులు సుశీల, సంగమేష్ భవన నిర్మాణ కూలీలు. లలిత విజయనగరంలోని నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ ఈ ఫలితాలను సాధించింది.
AP Inter Results: ఇంటర్ ఫలితాలు.. జిల్లాలవారీగా ఉత్తీర్ణత శాతం ఇలా..
♦ ఏలూరు జిల్లా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి హెచ్.అజయ్ రాజు సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 985 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచాడు. అలాగే పెదపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ని జి.కళ్యాణి ఎంపీసీలో 975 మార్కులతో ఏలూరు జిల్లాలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది. బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎస్. కళ్యాణి ఎంఎల్‌టీలో 961 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది. నూజివీడు, కలిదిండి, ఆగిరిపల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా మంచి ఫలితాలను సాధించాయి.
♦ చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న దీక్షిత 975 మార్కులతో సత్తా చాటింది. చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం సీఈసీలో నందిని 966, ఎంపీసీలో నందిని 945 మార్కులతో దుమ్ములేపారు. అలాగే పలమనేరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ గురుకుల కళాశాల, రామకుప్పం కళాశాల, చిత్తూరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్, కుప్పం ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలల విద్యార్థులు కూడా అత్యుత్తమ మార్కులు సాధించారు.
AP Intermediate Toppers: ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్స్.. వీళ్ల లక్ష్యమిదేనట
ఏపీ మోడల్ స్కూల్స్ అదుర్స్..
ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో ఏపీ మోడల్ స్కూళ్ల విద్యార్థులు సంచలనాలు సృష్టించారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు అధిక మార్కులు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 162 ఏపీ మోడల్ స్కూల్స్ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం 10,121 మంది పరీక్షలకు హాజరవగా 6,244 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
అలాగే ఇంటర్ సెకండియర్ 9,896 మంది పరీక్షలకు హాజరవగా 7,017 మంది (71 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. నంద్యాల జిల్లా మిడ్తూరు, అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా నందవరం, శ్రీకాకుళం జిల్లా రాజపురం మోడల్ స్కూళ్లు సంచలన ఫలితాలను సాధించాయి.
Intermediate State Topper 2024 S. Nirmala : 2024 ఇంటర్మీడియట్ స్టేట్ టాపర్ S.నిర్మల
కేజీబీవీలు కేక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సైతం ఈసారి ఇంటర్ ఫలితాల్లో దుమ్ములేపాయి. కర్నూలు జిల్లా గూడూరు కేజీబీవీలో ఫస్టియర్ విద్యార్థిని జి.విజయలక్ష్మి (ఎంపీసీ) 462/470 మార్కులతో సత్తా చాటింది. సీఈసీలో వి.నాగేశ్వరి 459, అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్‌లో యు.మానస 495, కంప్యూటర్ సైన్స్‌లో ఎం.యమున 494, ఎస్.హజీరాభాను 490 మార్కులు సాధించారు.
సెకండియర్ ఫలితాల్లో మార్కాపురం కేజీబీవీ విద్యార్థి జి.లక్ష్మి అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్‌లో 980, విజయనగరం జిల్లా వేపాడ విద్యార్థి ని కంప్యూటర్ సైన్స్ డిప్లొమాలో 978, పల్నాడు జిల్లా నకరికల్లు విద్యార్థి ని జె.లక్ష్మీప్రసన్న (ఎంపీసీ) 978, శ్రీకాకుళం కేజీబీవీ విద్యార్థి ని బి.హేమలత (ఎంపీసీ) 973, నర్సీపట్నం కేజీబీవీ విద్యార్థిని వి.నాగలక్ష్మి (బైపీసీ) 973 మార్కులతో రికార్డు సృష్టించారు. శాంతిపురం కేజీబీవీలో సీఈసీ ప్రథమ సంవత్సరం మాధవి 500కు 480, కేజీబీవీ కుప్పంలో జయంతి 500కు 473 మార్కులు సాధించారు.
Inter Fees: అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలు.. ఫీజుల తీరు ఇలా..
హైస్కూల్ ప్లస్‌ల్లో పెరిగిన ఉత్తీర్ణత
రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఉండాలన్న ప్రభుత్వ ప్రణాళికతో గతేడాది రాష్ట్రంలో 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మార్చారు. అయితే, వాటిలో 249 స్కూల్స్‌లో మాత్రమే గతేడాది ప్రవేశాలు కల్పించారు. వాటిలో ఈ ఏడాది 4,542 మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 1,262 మంది ఉత్తీర్ణులయ్యారు.
బాల్య వివాహం నుంచి బయటపడి టాపర్‌గా..
కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కి 421 మార్కులు సాధించిన ఎస్.నిర్మల సమాజంతో పోరాడి గెలిచింది. ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది.
ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.
Intermediate Rankers: విద్యార్థుల ప్రతిభకు ప్రిన్సిపాల్ అభినందనలు..