EAPCET 2024 web counseling : నేటి నుంచి ఈఏపీ సెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

EAPCET 2024 web counseling : నేటి నుంచి ఈఏపీ సెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

కాకినాడ సిటీ : విద్యార్థులు తమ తలరాతలను నిర్దేశించుకునే సమయం ఆసన్నమైంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరికలకు వేళయ్యింది. దీనికి సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ ఇప్పటికే విడుదల చేసింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో హడావుడి మొదలైంది. గత ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సుల అడ్మిషన్‌ షెడ్యూల్‌ జూలై 20న ప్రారంభమైంది. ఈసారి విద్యా సంవత్సరం క్రమపద్ధతిలో కొనసాగేందుకు వీలుగా గత ప్రభుత్వ నిర్ణయం మేరకు 20 రోజులు ముందుగానే షెడ్యూల్‌ ప్రకటించారు. దీనికి తగినట్టుగానే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల సంఖ్య, కోర్సులు తదితర వివరాలు సిద్ధం చేసింది. కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి నిర్వహిస్తారు. అన్ని ప్రక్రియలూ పూర్తి చేసి, ఈ నెల 19వ తేదీన తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. కౌన్సెలింగ్‌, అడ్మిషన్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలి, ఏ కళాశాలలో చేరాలనే అంశాలపై విద్యార్థులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. తద్వారా ఇన్నాళ్లుగా తాము కంటున్న కలలు పండించుకోవాలని, బంగారు భవిష్యత్తును అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇటువంటి కీలక తరుణంలో విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్‌ ఆప్షన్లపై పూర్తి స్థాయిలో ఆలోచించుకుని తుది నిర్ణయం తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: AP EAMCET College Predictor

అందుబాటులోకి కొత్త కోర్సులు

అంతర్జాతీయంగా ఇంజినీరింగ్‌ రంగం నానాటికీ కొత్త పుంతలు తొక్కుతోంది. అనేక నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. సరికొత్త ఆలోచనలకు మేధావులు ఊపిరి పోస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇంజినీరింగ్‌ విద్యలో కూడా అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈసీఈ, మెకానికల్‌, ఈఈఈ, సీఎస్‌ఈ, సివిల్‌ వంటి సంప్రదాయ కోర్సులు ఇప్పటికే ఉన్నాయి. కొత్తగా సీఎస్‌ఈలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, వెరీ లార్జ్‌స్కేల్‌ ఇంటిగ్రేషన్‌ (వీఎల్‌ఎస్‌ఐ) డిజైన్‌, అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, ఏరోస్పేస్‌, అగ్రికల్చరల్‌, మైరెన్‌, మైనింగ్‌, స్కిల్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ వంటి కొత్త బ్రాంచిలు వచ్చాయి. సంప్రదాయ కోర్సుల మాదిరిగానే నైపుణ్యంతో కూడిన ఈ కొత్త కోర్సులు చదివిన వారికి కూడా జీవితంలో ఉన్నతంగా స్థిరపడటానికి అపార అవకాశాలు లభిస్తాయి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఇలా..

● cets.apsche.ap.gov.in-24 వెబ్‌సైట్‌లోకి వెళ్లి, అడ్మిషన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో వచ్చిన ఫామ్‌లో హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేస్తే రిజిస్ట్రేషన్‌ ఫామ్‌ వస్తుంది. అందులో అడిగిన సమాచారం క్షుణ్ణంగా నింపి సబ్‌మిట్‌ చేయాలి.

● పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ మార్కుల జాబితాలు, 6 నుంచి ఇంటర్‌ వరకూ స్టడీ, టీసీ, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ర్యాంక్‌ కార్డు, హాల్‌ టికెట్‌, రేషన్‌ కార్డు అప్‌లోడ్‌ చేయాలి.

● ఈడబ్ల్యూఎస్‌ కుల ధ్రువీకరణ పత్రం ఉన్న వారికి 2022 నుంచి 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారు.

ఇదీ షెడ్యూల్‌

● జూలై 1 నుంచి 7: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు.

● జూలై 4 నుంచి 10: ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల పరిశీలన.

● జూలై 8 నుంచి 12: వెబ్‌ ఆప్షన్లు.

● జూలై 13: వెబ్‌ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం.

● జూలై 16: సీట్ల కేటాయింపు.

● జూలై 17 – 22: కళాశాలలో ప్రవేశాలు.

● జూలై 19: తరగతులు ప్రారంభం.

జిల్లాలో హెల్ప్‌లైన్‌ కేంద్రాలు

● జేఎన్‌టీయూ – కాకినాడ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బ్లాక్‌

● ఆంధ్రా పాలిటెక్నిక్‌ కళాశాల, జగన్నాథపురం, కాకినాడ

కౌన్సెలింగ్‌లో అప్రమత్తత అవసరం

రిజిస్ట్రేషన్‌ నుంచి ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, కళాశాల, కోర్సు ఎంపిక వంటి అంశాల్లో అన్నీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులే స్వయంగా చూసుకోవాలి. అలా కాదని స్నేహితులు లేదా ఇతరుల ద్వారా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేయించుకుంటే ఏవైనా పొరపాట్లు జరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కోసారి కోరుకున్న చదువు దూరమయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. విద్యార్థి అభీష్టం మేరకు కళాశాల, కోర్సు ఆప్షన్లను కొన్ని ప్రైవేటు కళాశాలల సిబ్బందే స్వయంగా ఎంపిక చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థి అన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. కౌన్సెలింగ్‌ దశ చాలా కీలకం కాబట్టి విద్యార్థులు తమ ర్యాంకును బట్టి మంచి కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్‌ పొందాలి. వెబ్‌ కౌన్సెలింగ్‌ అనేది విద్యార్థుల స్వీయ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఏం జరిగినా వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

                                                      – సీహెచ్‌ సాయిబాబు, డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌ ఆడిట్‌, జేఎన్‌టీయూ, కాకినాడ

ఆసక్తి ఉన్న బ్రాంచినే ఎంచుకోవాలి

విద్యార్థులు కళాశాలలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆసక్తి ఉన్న బ్రాంచినే ఎంచుకుని, అందులో ప్రతిభ చూపాలి. ముఖ్యంగా ఒకే కోర్సుకు డిమాండ్‌ ఉందనే భావన నుంచి బయటపడాలి. అందుబాటులో ఉన్న కోర్సులకు బయటి పరిశ్రమల్లో ఉన్న ఉపాధి అవకాశాలు, భవిష్యత్తులో వాటికి ఉన్న డిమాండ్‌ తదితర అంశాలపై విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఆమేరకు బ్రాంచి ఎంచుకోవాలి. ఒకే కోర్సులో అందరూ చేరడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదు. ఇటీవల సాఫ్ట్‌వేర్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. తద్వారా సీఎస్‌ఈ కోర్సు ఒక్కటే ముఖ్యమైనది కాదన్నది గుర్తించాలి. అభివృద్ధి అనేది కేవలం ఒక్క రంగంతోనే సాధ్యపడదు. ముఖ్యంగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు కావలసిన అన్ని పత్రాలూ సరి చూసుకోవాలి. ఈడబ్ల్యూఎస్‌కు గత ప్రభుత్వం 10 శాతం కోటా ప్రారంభించింది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థీ దీనిని వినియోగించుకోవాలి.

                                                  – డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, ఉప కులపతి, జేఎన్‌టీయూ–కాకినాడ

#Tags