తెలంగాణ పాఠశాల 2020-21 అకడమిక్ క్యాలెండర్ విడుదల: టెన్త్ పరీక్షలు ఎప్పట్నుంచంటే..

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాఠశాల విద్యార్థుల అకడమిక్ క్యాలెండర్ ఖరారైంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీంతో బోధన, అభ్యసన కార్యక్రమాలు, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, వేసవి సెలవులు తదితర అంశాలపై స్పష్టతనిచ్చింది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం ఇదివరకే ఆమోదించినా.. కరోనా, లాక్‌డౌన్ అనంతర పరిణామాలతో ప్రణాళిక గాడితప్పింది. ఈ క్రమంలో ఆన్‌లైన్ పద్ధతిలో బోధనా కార్యక్రమాలు సాగించినా.. పరీక్షల నిర్వహణ, ఫలితాలు, విద్యా సంవత్సరం పూర్తి, వేసవి సెలవులు తదితర అంశాలపై స్పష్టత లోపించింది.

తెలంగాణ పదో తరగతి 2021 పరీక్షల సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్ బ్యాంక్స్, సబ్జెక్ట్ వైజ్ వర్క్ షీట్స్, మోడల్ పేపర్స్, కెరీర్ గెడైన్స్.. మరెన్నో అప్‌డేట్స్ కోసం ఫాలో చేయండి.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాక్షికంగా విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరంలో పాఠశాల 204 పనిదినాలతో ముగియనుంది. ఫిబ్రవరి 1న తరగతులు ప్రారంభం కానున్నాయి. జనవరి 31 నాటికి ఆన్‌లైన్/డిజిటల్ తరగతులతో 115 దినాలు పూర్తి కానుండగా.. 9, 10 తరగతులకు 89 రోజుల పాటు మాన్యువల్ తరగతులు కొనసాగుతాయి. మే 26 నాటితో పాఠశాలలకు చివరి పని దినం పూర్తవుతుంది. మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులుగా విద్యా శాఖ ఖరారు చేసింది. ప్రస్తుతం 9, 10 తరగతులకు మాన్యువల్ తరగతులు ప్రారంభం కానుండగా.. దశల వారీగా మిగతా తరగతుల విద్యార్థులను ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తారు.

2020-21 విద్యా సంవత్సరంలో మొత్తం 204 పని దినాలు ఉంటాయి. సెప్టెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఆన్‌లైన్/డిజిటల్ పద్ధతుల్లో 115 రోజులు పూర్తవుతాయి. ఫిబ్రవరి 1 నుంచి మే 26 వరకు 89 రోజుల పని దినాలుంటాయి. ఫిబ్రవరి నెలలో 24 పని దినాలుండగా, డిజిటల్/ ఆన్‌లైన్ విధానంలో బోధించిన పాఠాల రివిజన్ ఉంటుంది. మార్చిలో 25 రోజుల పని దినాలు ఉంటాయి. మార్చి 15 నాటికి ఎఫ్‌ఏ-1 పరీక్షలు నిర్వహించి మార్చి 16న విద్యార్థులు పెర్ఫామెన్స్‌ను రిజిస్టర్లు, కుమ్యులేటివ్ రికార్డుల్లో నమోదు చేయాలి. ఏప్రిల్‌లో 21 రోజుల పని దినాలుంటాయి. ఏప్రిల్ 15 నాటికి ఎఫ్‌ఏ-2 పరీక్షలు నిర్వహించి, ఏప్రిల్ 16 నాటికి విద్యార్థుల పెర్ఫామెన్స్‌ను రికార్డు చేయాలి. మే నెలలో 19 రోజుల పని దినాలు ఉంటాయి. ఈ నెలలో 9, 10 విద్యార్థులకు రివిజన్, ప్రత్యామ్నాయ బోధన నిర్వహించాలి. 7వ తేదీ నుంచి 9వ తరగతికి ఎస్‌ఏ పరీక్షలు నిర్వహించి 19న ఫలితాలు రికార్డు చేయాలి. 26న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి ఫలితాలు ప్రకటించాలి. మిగతా తరగతుల విద్యార్థులకు సంబంధించిన వివరాలు త్వరలో అప్‌డేట్ చేస్తారు. పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. టీశాట్, దూరదర్శన్‌లో ప్రసారమయ్యే పాఠాలు పదో తరగతికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటాయి. 9వ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు (రెండు పీరియడ్లు) ఉంటాయి.
  • పరీక్షలకు కనీస హాజరు అవసరం లేదు. పిల్లలను స్కూల్‌కు పంపే విషయంలో తల్లిదండ్రులదే తుది నిర్ణయం. ఇంటి నుంచే చదువుకోవాలనుకుంటే తల్లిదండ్రుల లిఖితపూర్వక అంగీకారంతో అనుమతించాలి. వారిని కూడా పరీక్షలకు అనుమతించాల్సిందే.
  • 70 శాతం సిలబస్‌నే టీచర్లు ప్రత్యక్ష బోధనతో పాటు, ఆన్‌లైన్/డిజిటల్ విధానంలో బోధిస్తారు. మిగతా 30 శాతం వరకు సిలబస్ ప్రాజెక్టు వర్క్, అసైన్‌మెంట్లకే ఉంటాయి. వాటిని ఇంటర్నల్ అసెస్‌మెంట్స్, సమ్మేటివ్ అసెస్‌మెంట్/బోర్డు పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోరు.

విద్యార్థుల ఆరోగ్య ప్రణాళిక..
విద్యార్థులకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. స్థానిక ఆరోగ్య కేంద్రం, ఇతర వైద్య సదుపాయాలకు సంబంధించిన ఫోన్ నంబర్లను హెడ్‌మాస్టర్లు తమ వద్ద అందుబాటులో ఉంచుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులకు, సిబ్బందికి ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి. తగిన జాగ్రత్తలతో వారిని ఇళ్లకు పంపాలి. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి ముందే స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీతో సమావేశం నిర్వహించాలి. కోవిడ్ జాగ్రత్తలు, ఇమ్యూనిటీ డెవలప్‌మెంట్, మెంటల్ హెల్త్, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. టైం టేబుల్‌లో సహ పాఠ్య కార్యక్రమాలను పొందుపరుచాలి. విద్యార్థులు అలసిపోకుండా ఉండే ఆటలు, పాటలు, యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేయించాలి.

క్యాలెండర్‌లోని అంశాలు ఇలా..
  • ప్రత్యక్ష తరగతులు ప్రారంభం: ఫిబ్రవరి-1
  • పాఠశాలలకు చివరి పనిదినం: మే -26
  • వేసవి సెలవులు: మే-27 నుంచి జూన్-13 వరకు

పరీక్షల నిర్వహణ తేదీలు..
  • ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 (ఎఫ్‌ఏ) పరీక్షలకు గడువు: మార్చి-15
  • ఫార్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలకు గడువు: ఏప్రిల్-15
  • సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ): మే-7 నుంచి మే-13 వరకు
  • పదో తరగతి వార్షిక పరీక్షలు:మే-17 నుంచి మే-26 వరకు
  • సైన్స్‌ సెమినార్లు, ఎగ్జిబిషన్లను మార్చి/ఏప్రిల్ నెలల్లో వర్చువల్ పద్ధతుల్లో నిర్వహించుకోవాలి






#Tags