Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం ...ఉచిత బస్సు ప్రయాణం.. 

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం ...ఉచిత బస్సు ప్రయాణం.. 
Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం ...ఉచిత బస్సు ప్రయాణం.. 

అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ 9:30 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిపోయారు. ఇక, ఈ నెల 30 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి.  పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28తో ముగుస్తాయి.కాగా, మరో రెండు రోజులు అంటే మార్చి 30 వరకు ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలుంటాయి. అందుకు అవసరమైన అ­న్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. 2023–24లో మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

వీరిలో 3,17,939 మంది బాలురు కాగా 3,05,153 మంది బాలికలు. కాగా, గతేడాది ఉత్తీర్ణులు కాకపోవడంతో తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా పరీక్షలు రాయనున్నారు. అలాగే ఓరియంటల్‌ విద్యార్థులు 1,562 మంది ఉన్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరో 30 నిమిషాల వరకు అవకాశం కల్పించారు.

పరీక్షల పర్యవేక్షణకు 3,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 3,473 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 35,119 మంది ఇని్వజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 682 సిట్టింగ్‌ స్వాడ్స్‌ను నియమించారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో అదనంగా సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.  

పేపర్‌ లీకులకు ‘క్యూఆర్‌’ కోడ్‌తో చెక్‌  
మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఈ ఏడాది పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఇని్వజిలేటర్లు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, నాన్‌–టీచింగ్‌ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, చీఫ్‌ ఇని్వజిలేటర్లు ఇలా ఎవరైనా సరే సెల్‌ఫోన్లతో పరీక్ష కేంద్రాల్లోకి రావడాన్ని నిషేధించామన్నారు. ఎలాంటి ఎల్రక్టానిక్‌ పరికరాలను తేవద్దన్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా పదో తగరతి పరీక్ష పేపర్లపైనా, ప్రతి ప్రశ్నకు ‘క్యూఆర్‌’ కోడ్‌ను ముద్రించారు. మాల్‌ ప్రా­క్టీస్‌కు పాల్పడ్డా, పేపర్‌ లీక్‌ చేసినా.. ఏ సెంటర్‌లో ఏ విద్యార్థి పేపర్‌ లీక్‌ అయిందో ప్రత్యేక టెక్నాలజీ ద్వారా తెలుసుకోనున్నారు. పరీక్షలు పూర్తయ్యాక ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ చేపట్టనున్నారు. ఆ తర్వాత వెంటనే ఫలితా­లను వెల్లడించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.  

హాల్‌టికెట్‌ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం.. 
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. పదో తరగతి హాల్‌టికెట్‌ను చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లొ­చ్చు. అల్ట్రా పల్లె వెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా వెళ్లి రావొచ్చని విద్యాశాఖ ప్రకటించింది.

 

#Tags