పక్కాగా అకడమిక్‌ క్యాలెండర్‌ రూపకల్పన

ఎచ్చెర్ల క్యాంపస్‌: అధికారులు, విభాగాధిపతులు పక్కాగా అకడమిక్‌ క్యాలెండర్‌ సిద్ధం చేసి తరగతులు నిర్వహించాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు ఆదేశించారు.
పక్కాగా అకడమిక్‌ క్యాలెండర్‌ రూపకల్పన

విశ్వవిద్యాలయంలో గురువారం అధికారులు, విభాగాధిపతులు, కోర్సు కోఆర్డినేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెమిస్టర్‌ వారీగా క్లాస్‌వర్కు జరగాలన్నారు. మిడ్‌ సెమిస్టర్‌, సెమిస్టర్‌ పరీక్షలు సక్రమంగా జరగాలని చెప్పారు. డిగ్రీ కళాశాలల వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 29తో ముగియనుందని తెలిపారు. కళాశాలలపై కాలేజ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. నిబంధనలు పాటించని 11 డిగ్రీ కళాశాలల్లో ఉన్నత విద్యా మండలి ప్రవేశాలు నిలిపివేసిందన్నారు. పీజీ ప్రవేశాలు మొదలయ్యేలోగా డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని సూచించారు. పీజీ, బీఎడ్‌, బీపీఈడీ నాలుగో సెమిస్టర్‌, ఇంజినీరింగ్‌ ఎనిమిదో సెమిస్టర్‌ జవాబు పత్రాలు మూల్యాంకణ త్వరితగతిన ప్రారంభించాలన్నారు. డిగ్రీ ఆరో సెమిస్టర్‌ జవాబు పత్రాలు మూల్యాంకణం త్వరితగతిన, పారదర్శకంగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కువ మార్కులు, తక్కువ మార్కులు వచ్చిన జవాబుపత్రాలను మరోసారి పరిశీలించాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్‌, ప్రిన్సిపాళ్లు బిడ్డిక అడ్డయ్య, ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌, చింతాడ రాజశేఖర్‌రావు, సీడీసీ డీన్‌ పీలా సుజాత, వర్సిటీ ఇంజినీర్‌ అజిత్‌కుమార్‌, ప్లేస్‌మెంట్‌ అధికారి కె.విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags