Mega job mela: 28న మెగా జాబ్ మేళా
రాజమహేంద్రవరం జోన్ –2 పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 28వ తేదీన రాజమహేంద్రవరంలోని వీఎల్‌పురం మార్గాని ఎస్టేట్ గ్రౌండ్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్‌డీఏ వైఎస్సార్ క్రాంతి పథం ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్‌వీఎస్ మూర్తి తెలిపారు.
స్థానిక కలెక్టరేట్‌లోని నాక్ కార్యాలయంలో బుధవారం తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నోడల్ అధికారులతో సమావేశమై, జాబ్ మేళాపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ సుమారు వంద కంపెనీల ప్రతినిధులు హాజరై దాదాపు ఆరువేల ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.
ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి పేర్లను రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్ధిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ జాబ్‌మేళాపై నిరుద్యోగ యువతకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో జిల్లా పరిషత్ సహాయ సీఈవో జీఎస్ రామ్ గోపాల్, జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె.హరిశ్చంద్ర ప్రసాద్, జిల్లా పరిశ్రమల అధికారి బి.వెంకటేశ్వరరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు, డివిజనల్ పీఆర్‌వో ఎంఎల్ ఆచార్యులు పాల్గొన్నారు.