Staff Nurse Jobs Counseling: స్టాఫ్‌ నర్సు పోస్టులకు కౌన్సెలింగ్‌

మహారాణిపేట: స్టాఫ్‌ నర్సు పోస్టులకు ఎంపికై న వారికి గురువారం రెండో విడత కౌన్సిలింగ్‌ నిర్వహించారు. మొత్తం 86 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. తొలి విడత నవంబర్‌ 7న కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌ ఇచ్చారు. విజయనగరం మెడికల్‌ కాలేజీలో 80 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో ఆరు పోస్టులకు ఎంపిక చేశారు. 52 పోస్టులు భర్తీ చేశారు. రెండో విడతలో 34 పోస్టుల కోసం అభ్యర్థులను పిలిచారు. రెండు పోస్టులకు అర్హత గల అభ్యర్థులు లేరు. రెండు పోస్టులకు అభ్యర్థులు హాజరు కాలేదు. ఐదుగురు అభ్యర్థులు పోస్టుల భర్తీలో ఆన్‌విల్లింగ్‌ చూపించారని వైద్య ఆరోగ్యశాఖ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.సుజాత తెలిపారు. ఇందులో రెండు పోస్టులు మన్యం జిల్లా పీహెచ్‌సీల్లో భర్తీ చేశామన్నారు. 21 మందిని విజయనగరంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ కోసం భర్తీ చేశామన్నారు. మిగిలిన పోస్టులు త్వరలో భర్తీ చేస్తామన్నారు. దీనిపై క్లారిఫికేషన్‌ కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తున్నామని ఆర్‌డీ సుజాత తెలిపారు.

చ‌ద‌వండి: Job Mela: ప్రతి నెలా అన్ని నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు

ఓపెన్‌ స్కూల్‌ పరీక్ష ఫీజు గడువు ఈనెల 31
దొండపర్తి: ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఒకసారి ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజును ఎటువంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబర్‌ 31వ తేదీలోగా చెల్లించాలని డీఈవో చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి వారు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.100, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.150, ప్రాక్టికల్‌ ఒక్కో దానికి రూ.100 చొప్పున చెల్లించాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులుకాని విద్యార్థులు ఉత్తీర్ణత పొందిన థియరీ సబ్జెక్ట్‌ ఇంప్రూవ్‌మెంట్‌(ఈ సదుపాయం ఐదేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే వినియోగించుకొనే అవకాశం) కోసం రూ.250, ప్రాక్టికల్‌కు రూ.100 ఫీజు చెల్లించాలని వెల్లడించారు. ఈ ఫీజులను ఏపీటీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్‌లో లేదా గేట్‌వే పేమెంట్‌ ద్వారా చెల్లించాలని చెప్పారు. ఇతర వివరాలకు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలని తెలిపారు.

#Tags