ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

కాకినాడ సిటీ: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఆదివారం కాకినాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాకినాడ జిల్లా, నగర బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. బీసీ ఉద్యోగులు ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నివిధాలా సహకారం అందిస్తున్నారని తెలిపారు. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ సమక్షంలో జిల్లా, నగర కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జరిగింది. అంతకు ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రామానుజన్‌ శ్రీనివాస్‌రావు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షుడు గుబ్బల మురళీకృష్ణ తదితరులు ప్రసంగిస్తూ తక్షణమే కుల జనగణనను ప్రభుత్వం చేపట్టాలన్నారు. ఈబీసీ విధానాన్ని తీసుకువస్తే ముందుగా ఆర్థికంగా వెనుకబడిన కులాలు నష్టపోతాయని, అందువల్ల దాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

తొలుత మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కమిటీ గౌరవ సలహాదారుడు దొమ్మేటి సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి గంటి రాధాకృష్ణ, కోశాధికారి వాసంశెట్టి కామేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు చిందాడ ప్రదీప్‌కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

#Tags