Free Training For Women: మహిళలకు ఉచిత శిక్షణ.. దీంతో పాటు వసతి కూడా.. ఎందులో అంటే..
నేటి తరంలో బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం వర్క్‌లో శిక్షణ పొందాలని గిరిజన యువతులు, మహిళలు ముందుకు వచ్చి ఆర్‌సెటి వేదిక ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూ భవిష్యత్ తరాలకు బాటలు వేసుకుంటున్నారు. మగ్గం వర్క్, బ్యూటీషియన్, టైలరింగ్ ఎస్‌బీఐ ఆర్‌సెటి అందిస్తున్న శిక్షణలపై ప్రత్యేక కథనం.
శిక్షణ ఇస్తున్న కోర్సులు
యువతులతో పాటు ఇటు నిరుద్యోగ యువకులకు కూడా టూవీలర్ మెకానిక్, హౌజ్‌వైరింగ్, సెల్‌ఫోన్‌రిపేరింగ్, ఫ్రిజ్, ఏసీ, ప్లంబింగ్, శానిటరీ, క్యూంటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్క్, ట్యాలీ, అకౌంటింగ్, సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, మోటార్ వైండింగ్, తదితర కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు.
ఎస్‌బీఐ–ఆర్‌సెటి ద్వారా శిక్షణ..
యువతకు ఇస్తున్న శిక్షణ మేలైన ఫలితాలు ఇస్తోంది. 2007లో ఉట్నూర్‌లోని కుమురంభీం కాంప్లెక్స్ ప్రాంగణంలో స్థాపించిన సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటికీ 311 శిబిరాలు నిర్వహించి ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని 9,102 మందికి శిక్షణ ఇచ్చింది. వీరిలో 7,566 మంది ఉపాధి అవకాశాలు పొందా రు. 3,217 మందికి బ్యాంకు రుణాలు ఇచ్చింది. 6,524 మంది స్వయం ఉపాధి పొందగా 3,307 మ ంది స్వయం ప్రాజెక్టులు ప్రారంభించారు. 1,042 మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. 2023–24లోనూ 23 శిబిరాల ద్వారా 697 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యం పూర్తి చేశారు.
శిక్షణకాలంలో వసతి సౌకర్యాలు..
ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాలో పదోతరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన యువతకు శిక్షణ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. శిక్షణలో ఉచిత భోజనం, ఉదయం అల్పాహారం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. స్థానికులకు మధ్యాహ్నం భోజ నం ఉంటుంది. శిక్షణ అనంతరం బ్యాంకు రుణం పొందేందుకు అవసరమైన సలహాలు అందిస్తారు.
Good news for women: మహిళలకు గుడ్‌న్యూస్ టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులలో ఉచిత శిక్షణ
ఉపాధి అవకాశాలు ఎక్కువ
ప్రస్తుత రోజుల్లో బ్యూటీషియన్ వర్క్‌కు డిమాండ్ ఎక్కువ. ఈ శిక్షణను ఆర్‌సెటి సంస్థ ఉచితంగా అందరికీ నేర్పించడం చాలా సంతోషమైన విషయం, శిక్షణ కాలంలో ఫేషర్, మెహేంది డిజైన్, తదితర బ్యూటీపార్లర్‌కు సంబంధించి శిక్షణలు, అవగాహన కల్పించాం.. పిల్లలు సైతం చాలా బాగా నేర్చుకుంటున్నారు. – రజిత, బ్యూటీషియన్ శిక్షకురాలు
ఇక్కడే నేర్చుకుని ఇక్కడే ట్రైనర్‌గా..
2017 బ్యాచ్‌లో ఇక్కడే కుట్టు మిషన్ శిక్షణ తీసుకున్నా. నాకున్న నైపుణ్యతను గుర్తించి అధి కారులు హైదరాబాద్‌లో పరీక్ష అనంతరం సంస్థలో ట్రైనర్‌గా ఎంపిక చేశారు. కుట్టు శిక్షణ నేర్చుకోవడం వలన స్వయం ఉపాధి పొందటానికి మంచి అవకాశం. దీంతో ఇతరులకు ఉపాధి కల్పించవచ్చు. – మాహెద, కుట్టుమిషన్ శిక్షకురాలు
నమ్మకం పెరిగింది..
నేను మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చా. మగ్గం వర్క్ (వస్త్ర చిత్రకళ ఉద్యామి) నేర్చుకోవడం వలన భవిష్యత్‌లో స్వయం ఉపాధి పొందుతాననే నమ్మకం పెరిగింది.. అన్ని వసతులతో ఇలా శిక్షణ అందించడం బాగుంది. నా తోటి వారికి సైతం సలహాలు అందిస్తా. – సౌజన్య, మగ్గం వర్క్, మంచిర్యాల జిల్లా, కవ్వాల్
చాలా బాగా నేర్పిస్తున్నారు
ఇక్కడ శిక్షణ ఇస్తున్నారని తోటి స్నేహితుల ద్వారా తెలుసుకున్నా. మగ్గం వర్క్‌తో పాటు అనేక రకాలుగా ఇక్కడ సులువైన పద్ధతిలో శిక్షణ ఇస్తున్నారు. నేటి తరానికి ఇలాంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడుతాయి. చేతి వృత్తులకు మార్కెట్‌లో డిమాండ్ బాగుంది. – నిరోషన్, మగ్గం వర్క్, కుమురంభీం జిల్లా
ఉపాధి కల్పనే లక్ష్యం
ఉపాధి కల్పనే లక్ష్యంగా యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నాం. మా సంస్థలో అభ్యర్థుల ఇష్టం మేరకే కోర్సును నేర్చుకోవచ్చు. ఇదే శిక్షణ ప్రైవేటు సంస్థల్లో తీసుకోవాలంటే దాదాపు 20 నుంచి 30వేల రూపాయలు అవుతాయి. మేము వసతి సౌకర్యం, భోజనం, ఉచితంగా అందిస్తున్నాం. – కె.లక్ష్మణ్, ఎస్‌బీఐ ఆర్‌సెటి డైరెక్టర్, ఉట్నూర్
భవిష్యత్‌లో రాణిస్తా..
టైలరింగ్ నేర్చుకునేందుకు ఇక్కడికి వచ్చా. నేటి పోటీ ప్రపంచంలో స్వయం ఉపాధి సైతం ఎంతో అవసరం. అన్ని విద్యలు నేర్చుకొని ఉంటే సమాజంలో నిలదొక్కుకుంటాం. భవిష్యత్‌లో ఖచ్చితంగా షాపు వేసుకొని నడిపిస్తాను. టైలరింగ్‌పై అవగాహన వచ్చింది. నెల రోజుల్లో నేర్చుకుంటానని అనుకోలేదు. – శిరీష, మంచిర్యాల జిల్లా
ఆత్మ విశ్వాసం పెరిగింది
శిక్షణ కంటే ముందు ఇంటి దగ్గర ఖాళీగానే ఉండేదానిని. ఇప్పుడు ఈ శిక్షణ తీసుకోవడంతో స్వయం ఉపాధి పొందగలననే నమ్మకం, ఆత్మ విశ్వాసం పెరిగింది. శిక్షణలో నేర్చుకున్న మెలకువలు కుటుంబ సభ్యులతో పాటు తోటి వారికి నేర్పించి ఉపాధి రంగంలో రాణించేందుకు కృషి చేస్తా. – మహేశ్వరి, కుమురంభీం జిల్లా