Skill Development: నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగవకాశాలు.. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినా నో జాబ్స్‌..

కాజీపేట: నైపుణ్య పెంపుతో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటున్నారు నిపుణులు. కోర్సు చదివామా? పూర్తి చేశామా? అన్న చందంగా కాకుండా లక్ష్య సాధన కోసం కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారనేది వాస్తవం. ప్రస్తుత కాలంలో చాలామంది యువకులు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి కూడా ఖాళీగా ఉంటున్నారు. ఇప్పటి వరకు కష్టపడి చదివేశాం. కాస్తంత విశ్రాంతి తీసుకుందామనుకుంటే.. పొరపాటే.. ప్రస్తుత కాలంలో యువత ఆలోచనల్లో ఎటువంటి మార్పులు రావడం లేదనే చెప్పవచ్చు.

మిగితా రాష్ట్రాల యువతతో పోలిస్తే మన రాష్ట్రంలో ఎక్కువ మంది యువత ఎలాంటి లక్ష్యాన్ని ఎంచుకోవడంలేదు.. ఫలితంగా ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. యువత కాలేజీ రోజుల్లోనే మనం ఏం చేయగలం, ఏ దారిలో వెళితే భవిష్యత్‌ బాగుంటుంది.. అన్న విషయాన్ని గమనించి ఆ దిశగా అడుగులు వేస్లే జీవితం సుఖమయంగా సాగుతుంది. ఏ స్కిల్స్‌ ఉంటే రాబోయే పోటీ ప్రపంచంలో పరిస్థితులను ఎదుర్కొగలమనే విషయాలను యువత గమనించుకోవాలి.

పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య
కానీ, నేటి తరం యువత ఆ దిశగా ఆలోచించకపోవడంతో రోజు రోజుకూ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. చాలా మందికి ఎంత టాలెంట్‌ ఉన్నా.. తగిన ఉద్యోగం లభించదు. దానికి కారణం కేవలం స్కిల్స్‌ లేకపోవడమే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే జీవితంలో హాయిగా జీవించాలంటే నైపుణ్యాలను పెంపోందించుకోవాలి. ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడం వల్ల ఏ చదువు చదివినా.. అందుకు తగ్గుట్టుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ప్రస్తుత ప్రపంచానికి కావాల్సింది మంచి స్కిల్‌ ఉన్న యువత. ప్రపంచంలోని టెక్నాలజీకి తట్టుకునేలా యువత అడుగులు వేయాలి. కొంతమంది యువత కనీసం ఇంటర్వ్యూలను కూడా ఎదుర్కోలేక చతికిల పడిపోతున్నారు. ఇప్పటి యువత డ్రీమ్‌ జాబ్‌ సాఫ్ట్‌వేర్‌ ఈ రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే స్కిల్స్‌ ఎంతో అవసరం.

ఇంగ్లిష్‌పై పట్టు తప్పనిసరి..
ప్రస్తుతం ఒక మంచి ఉద్యోగం సాధించాలంటే ఇంగ్లిష్‌ వచ్చి ఉండాలి. ఆంగ్ల భాష రాకపోవడం వల్ల చాలా మంది యువత ఉద్యోగ అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఇంగ్లిష్‌ మీద మంచి పట్టు సాధిస్తే ఎలాంటి రంగంలోనైనా యువతరం ఉద్యోగాన్ని దక్కించుకోవచ్చు. ఏ రంగంలోనైనా విజయాన్ని కై వసం చేసుకోవచ్చు.

ప్రోగ్రామింగ్‌..
ప్రస్తుతం సాఫ్టవేర్‌ రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. దీంట్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయి. కావున ఇందుకు తగ్గట్టుగా.. ప్రోగ్రామింగ్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. యువత ఇలాంటి ప్రోగామింగ్‌ మీద ఎక్కువ శ్రద్ద చూపించి నైపుణ్యం పొందితే జీవితం బంగారు మయమే అవుతుంది.

డిజిటల్‌ మార్కెటింగ్‌..
ప్రస్తుతం సాఫ్టవేర్‌ రంగంతో పోటీగా ఉద్యోగాలు ఇస్తూ యువతను ఆకట్టుకుంటుంది డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగం. రాబోయే రోజులన్నీ డిజిటల్‌ మార్కెటింగ్‌ మీదనే ఆధారపడి ఉంటాయని నిపుణుల అంచనా. ఏ వస్తువు కొనాలన్నా ఆన్‌లైన్‌లోనే చేస్తుండడంతో ఈ రంగానికి డిమాండ్‌ పెరిగింది.

#Tags