SMC Elections: ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల కోలాహలం నెలకొననుంది. పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి, ఇతరత్రా కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకునే ఎస్‌ఎంసీ (స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ) ఎన్నికలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాల స్థాయిలో ఎస్‌ఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను 1– 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సభ్యులుగా చేతులెత్తి ఎన్నుకునే విధానం చేపట్టనున్నారు. చివరిసారిగా 2019 నవంబర్‌లో ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికై న ప్రభుత్వం మరోసారి ఎన్నికలు నిర్వహించేందు చర్యలు చేపడుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,725 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 60కి పైగా వివి ధ శాఖల పరిధిలోని రెసిడెన్సియల్‌, 65 కస్తూర్బా గాంధీ, మోడల్‌ స్కూల్స్‌, యూఆర్‌ఎస్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

చదవండి: Navodaya Entrance Exams 2024-25: విద్యార్థులు ఈ సూచనలు తప్పకుండా పాటించాలి!

రేపటి నుంచే ప్రక్రియ..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ నెల 29న స్కూల్‌ కమిటీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. మొదట పాఠశాల పరిధిలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొనే విధంగా హెచ్‌ఎం శనివారం ఉదయం నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లను పాఠశాల ఆవరణలో ప్రదర్శించాలి. 22న ఎన్నికల్లో పాల్గొనే తల్లిదండ్రుల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 24న పోటీలో ఉన్నవారి తుది జాబితాను ప్రదర్శిస్తారు. 29వ తేదిన ఎన్నికలను ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు చేతులు ఎత్తే విధానంలో ఎన్నుకోవాల్సి ఉంటుంది. అనంతరం 2 గంటల నుంచి 4 వరకు కొత్తగా ఏర్పడిన కమిటీతో సమావేశం నిర్వహించి, పాఠశాలలోని విషయాలు చర్చిస్తారు.

ప్రశాంత వాతావరణంలో..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ జీఓను హెచ్‌ఎంలు క్షుణ్ణంగా చదివి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి.
– రవీందర్‌, డీఈఓ, మహబూబ్‌నగర్‌

#Tags