PhD Admissions: పీహెచ్‌డీ ప్రవేశాలు.. 'నెట్' పరిధిలో చేర్చొద్దంటూ వర్సిటీల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పీహెచ్‌డీ ప్రవేశాలను యూజీసీ నెట్ పరిధిలో చేర్చేందుకు సిద్ధమైన రాష్ట్ర యూనివర్సిటీలు, తాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నాయి. ఎప్పటిలాగే యూనివర్సిటీల అర్హత పరీక్ష ద్వారానే ప్రవేశాలు కలి్పంచాలని నిర్ణయించాయి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు లేఖ రాయనున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే లేఖను సిద్ధం చేసింది. మరోవైపు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ కూడా యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్‌ను కలిసి ఈ విషయం స్పష్టం చేసినట్టు తెలిసింది. యూజీసీ ప్రతిపాదన ప్రకారం పీహెచ్‌డీలను జాతీయ అర్హత పరీక్ష (నెట్) ద్వారా భర్తీ చేయాలన్న ప్రతిపాదన వల్ల ఇబ్బందులున్నాయని చెప్పినట్టు సమాచారం.
తీవ్రంగా వ్యతిరేకించిన విద్యార్థులు
రాష్ట్రంలో ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీలో అత్యధికంగా పీహెచ్‌డీలు చేస్తుంటారు. ప్రతి ఏటా 200కు పైగా విద్యార్థులకు అవకాశం కలి్పస్తారు. ఈ ప్రవేశాలు రెండు రకాలుగా ఉంటాయి. నెట్, కేంద్ర ప్రభుత్వం నుంచి జూనియర్ రీసెర్చి ఫెలోషిప్‌కు ఎంపికైన వారిని ఒక కేటగిరీగా భావిస్తారు. మొత్తం సీట్లల్లో సగం వీరికి కేటాయిస్తారు. మిగిలిన సగం సీట్లను యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.
అయితే ఈ ఏడాది మార్చిలో యూజీసీ కొత్త నిబంధనను తీసుకొచి్చంది. జాతీయ విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా పీహెచ్‌డీ ప్రవేశాలను జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. దీని అమలుకు రాష్ట్రంలోని వర్సిటీలు కూడా సిద్ధమయ్యాయి. అయితే విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచి్చంది. పలు విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. దీంతో దీనిపై సమీక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.
నెట్‌తో అయితే నష్టమేంటి?
జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష వల్ల తమకు నష్టం జరుగుతుందనేది విద్యార్థుల ఆందోళన. పాఠశాల స్థాయి నుంచి పీజీ స్థాయి వరకూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అరకొర వసతులతో చదువుతున్నారు. చాలా కాలేజీల్లో జాతీయ స్థాయి ప్రమాణాలు లేవు. రాష్ట్ర స్థాయి సిలబస్‌తోనే విద్యాభ్యాసం ముగిస్తారు. నెట్ పేపర్ పూర్తిగా జాతీయ స్థాయిలో ఉండే సిలబస్ నుంచి ఇస్తారు.
Group-I Recruitment: గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
యూనివర్సిటీ నిర్వహించే అర్హత పరీక్షతో పోలిస్తే ఇది కఠినంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో పోటీ పడటం, ఎంపిక కావడం కష్టమని వారు భావిస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య నెట్ ద్వారా అర్హత పొంది పీహెచ్‌డీ చేయడం కష్టమని అంటున్నారు. ఈ వాదనతో ఏకీభవిస్తున్న వర్సిటీలు, అధికారులు విషయం యూజీసీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి.