NMMS Scholarship 2023: ఎంపికై న విద్యార్థులకు ఏడాదికి రూ. 12 వేల సాయం..

  • సెప్టెంబర్‌ 15 వరకూ దరఖాస్తులకు అవకాశం 
  • ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.12 వేలు ఉపకార వేతనం 
  • పరీక్షలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం, సహకారం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉన్నత చదువులు అభ్యసించాలనుకొనే ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ప్రతిభ ఉండి, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే వారి కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) కింద ఆర్థిక ఆసరాను అందిస్తోంది. దీని కోసం నిర్వహించే పరీక్షలో రాణించేందుకు రాష్ట ప్రభుత్వం సహాయాన్ని ఇస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ చదివే పేద విద్యార్థులకు ఏటా ఆర్థికసాయం అందనుంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి (2023–24) ఎన్‌ఎంఎంఎస్‌ నోటిఫికేషన్‌ను ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్‌ విభాగం ఇటీవల విడుదల చేసింది.

ఏడాదికి రూ. 12 వేల సాయం..
నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12 వేలను స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తుంది. ఈ మొత్తం నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాల్లోకి వస్తుంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసే వరకు ఉపకార వేతనం లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 25,512 మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. అందులో ఎన్టీఆర్‌ జిల్లాలో 13,412 మంది, కృష్ణా జిల్లాలో 12,090 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో పరీక్షకు హాజరై ఎంపికై న వారికి సాయం అందుతుంది.

డిసెంబర్‌ 3న పరీక్ష
ఈ ఉపకార వేతనాల పరీక్షకు దరఖా స్తుల ప్రక్రియ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 10వ తేదీన ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌(హెచ్‌టీటీపీ://బీస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. దీని కోసం సెప్టెంబర్‌ 15వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. అనంతరం సంబంధిత ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపించాలి. 19లోపు డీఈవో కార్యాలయంలో వాటిని సమర్పించాలి. డిసెంబర్‌ 3న పరీక్ష ఉంటుంది. ప్రతి విద్యార్థి పరీక్ష ఫీజు కింద రూ.100 ఎస్‌బీఐ చలానా రూపంలో సంబంధిత ధ్రువీకరణపత్రాలతో పాటు జతచేయాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం రూ.50లు ఫీజు చెల్లించే అవకాశం ఇచ్చారు.

అర్హతలు ఇవే..
ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో చదివే విద్యార్థులు ఈ ప్రోత్సాహకాలకు అర్హులు. ఏడో తరగతితలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. తుది ఎంపిక సమయం నాటికి 8వ తరగతిలో 55 శాతం మార్కులు పొందాలి. కుటుంబ వార్షికాదాయం ఏడాది రూ.3,50,000 మించకూడదు. ఎన్‌ఎంఎంఎస్‌ రాత పరీక్ష ద్వారా స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.

ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవాలి..
ఎక్కువ మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌నకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేలా చూస్తున్నాం. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులకు సమాచారమిచ్చాం. అన్ని పాఠశాలల్లో ప్రణాళికాబద్ధంగా శిక్షణనిచ్చి పరీక్షకు హాజరయ్యేలా చూస్తాం. ఎంపికై న వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి. నాలుగేళ్లలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొనసాగినంత కాలం ఈ సాయం కొనసాగుతుంది.
– సీవీ రేణుక, డీఈవో, ఎన్టీఆర్‌ జిల్లా

పరీక్ష విధానం..

  • అర్హులైన పేద విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లుగా ఉంటుంది.
  • మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (మ్యాట్‌) స్కాలిస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సాట్‌) ఇలా రెండు పేపర్లు కలిపి 180 ప్రశ్నలకు 180 మార్కులుంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు ఉంటుంది.
  • మ్యాట్‌ పేపర్‌లో మూడు విభాగాల నుంచి 90 ప్రశ్నలను అడుగుతారు. మెంటల్‌ ఎబిలిటీ–45, ఇంగ్లిష్‌ ప్రొఫిషియెన్సీ –20, హిందీ ప్రాఫిషియెన్సీ నుంచి 25 చొప్పున ప్రశ్నలను ఇస్తారు.
  • సాట్‌ పేపర్‌లో కూడా మూడు విభాగాలు నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 90 ప్రశ్నలుంటాయి. ఇందులో సైన్సు 35 ప్రశ్నలు, సోషల్‌ స్టడీస్‌ –35, మ్యాథమెటిక్స్‌ విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలను అడుగుతారు.

#Tags