Model School Admssions: మోడల్‌ స్కూల్‌ పిలుస్తోంది.. దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

బాన్సువాడ రూరల్‌: ఆదర్శ పాఠశాలల్లో విద్యాబోధన ఉత్తమంగా ఉండడంతో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తుంటారు.

ఆంగ్ల మాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ విద్యార్థులకు ఈ ఆదర్శ పాఠశాలలు వరంగా మారుతున్నాయి. రూ. వేలు ఖర్చు పెట్టి, దూర ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివించాలంటే గ్రామీణ పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంగా ఉండేది.

బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించేందుకు ప్రభుత్వం 2013లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించింది. ఈ స్కూళ్లలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

చదవండి: 6th Class Admissions: ఈ స్కూళ్లు విద్యార్థులకు వరం.. ఒక్కో పాఠశాలలో 100 సీట్లు..

జిల్లాలో ఆరు ఆదర్శ పాఠశాలలు..

కామారెడ్డి జిల్లాలో ఆరు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. బాన్సువాడ (కొత్తాబాది), సదాశివనగర్‌, నాగిరెడ్డిపేట్‌, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌, మద్నూర్‌(మేనూర్‌)లో ఉన్న ఈ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో 600 వందల మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. దీంతో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2023–24 విద్యాసంవత్సరంలో ప్రవేశం పొంది మధ్యలో వివిధ కారణాలతో మానేసిన పరిమిత సంఖ్యలో ఉండే ఖాళీసీట్ల ప్రవేశానికి అవకాశం ఉంటుంది.

ప్రవేశాలు రోస్టర్‌ పద్ధతిన నిర్వహిస్తారు. ఎస్సీ విద్యార్థులకు 15శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీ విద్యార్థులకు 29శాతం ఉంటాయి. బీసీ విభాగంలో బీసీ ఏ–7, బీసీ బీ–10, బీసీ సీ–1, బీసీ డీ–7, బీసీ ఈ–4తో పాటు ఓపెన్‌ కేటగిరిలో 50శాతం సీట్లను భర్తీ చేస్తారు. అన్ని కేటగిరిల్లోనూ బాలికలకు 33శాతం, దివ్యాంగులకు 3శాతం సీట్లు కేటాయించనున్నారు.

చదవండి: Model School: మోడల్‌ స్కూల్‌లో ‘మాక్‌ అసెంబ్లీ’

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు పొందేందుకు http//telanganams.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి ఆధార్‌కార్డు, బోనాఫైడ్‌, పాస్‌పోర్టుసైజ్‌ ఫోటోతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రతితో పాటు కుల ధ్రువీకరణపత్రం, ఆధార్‌కార్డు, బోనాఫైడ్‌ జిరాక్సు ప్రతులను సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్‌కు అందజేయాలి.

పరీక్ష విధానం ఇలా..

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. అన్ని మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోప్రశ్నకు ఒకమార్కు. 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో 5వ తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, గణితం, సైన్స్‌, సోషల్‌, ఆంగ్ల మాద్యమ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు

ఆదర్శపాఠశాలల్లో విద్యనభ్యసించేందుకు ఖాళీల భర్తీకి ఫిబ్రవరి 22 లోగా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్‌ కేటగిరి విద్యార్థులు రూ.200, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఏప్రిల్‌ 7న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

పాఠశాలల ప్రత్యేకతలు..

  • ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు
  • దరఖాస్తుల ఆహ్వానం
  • ఫిబ్రవరి 22వరకు ఆన్‌లైన్‌ ప్రక్రియ
  • ఏప్రిల్‌ 7న ప్రవేశ పరీక్ష

అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

ఆదర్శ పాఠశాలల్లో సీట్ల భర్తీలో స్థానిక మండలం విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 6వ తరగతిలో పూర్తిసీట్లు, 7నుంచి 10వ తరగతి వరకు పరిమిత సంఖ్యలో మిగులు సీట్లకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే పాఠశాలలో సంప్రదించాలి. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపడతాం.

– ఫకీరయ్య, ప్రిన్సిపాల్‌, కొత్తాబాది టీఎంఎస్‌

  • 6 నుంచి 10 తరగతి వరకు ఎలాంటి రుసుము లేకుండా ఉచిత బోధన
  • ఆంగ్లమాద్యమంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో చక్కని బోధన
  • పక్కా భవనంతో కూడిన విశాలమైన తరగతి గదులు
  • 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు, యూనిఫాంల అందజేత
  • సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, ప్రొజెక్టర్‌ రూంలతో పాటు లైబ్రరీ సదుపాయం
  • నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం అందజేత
  • 8వ తరగతి విద్యార్థులకు జాతీయ ఉపకార వేతనాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ
  • 10వ తరగతి విద్యార్థులకు నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌(ఎన్‌టీఎస్‌ఏ)కు ప్రత్యేక శిక్షణ తరగతులు, నీట్‌, ఐఐటీ పరీక్షలకు సంసిద్ధులను చేయడం.
  • ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం.

#Tags