Satavahana University: ఎస్‌యూలో కొలువుల దుమారం!

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: శాతవాహన యూనివర్సిటీని రోజుకో వివాదం వెంటాడుతోంది. ఇప్పటికే డిగ్రీ పేపర్‌ లీకేజీ, రిటైర్డ్‌ అధ్యాపకుల నియామకం, ఆన్సర్‌షీట్‌ టెండర్లపై విమర్శలు ఎదుర్కొంటోంది. ఇవి చాలవన్నట్లు ఉద్యోగుల సంఖ్య విషయంలో పాలకమండలి(ఈసీ)లో దుమారం రేగుతోంది. ఇటీవల ఈసీ సమావేశంలో చర్చకు వచ్చిన ఉద్యోగుల వేతనాల ఆమోదంలో పాలకమండలి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల సంఖ్య, వారి నియామకం, హోదాపై సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది.

లేఖ ఎందుకు రాశారు?
ఈనెల 6న వర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు.. చర్చించే విషయాలపై పాలకమండలి సభ్యులకు అందజేసిన అజెండాలో జీవో నంబరు 1222 ప్రకారం.. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు అదనంగా 225 మంది ఉద్యోగుల వేతనాల ప్రస్తావన ఉంది. ఇక్కడే పాలక మండలి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు.

లేఖలో ఏముందంటే..

  • మాకు తెలిసి జీవో నంబరు 1222కు ఆమోదం తెలుపలేదు. తెలియకుండా ఉద్యోగుల సర్వీసు ల వివరాలను ఎలా పొందుపరిచారు?
  • వర్సిటీలో పనిచేస్తున్న 185మంది ఉద్యోగుల వివరాలు ఇవ్వండి. ఆర్నెళ్లుగా వేతన రసీదులు కూడా జతపరచండి.
  • ఆ 185 మందిలో గతంలో నియమితులైన వారే ఉన్నారా? లేక మారారా? మారితే వారి ఉద్యోగం, హోదా వివరాలు ఇవ్వండి.
  • నోట్‌లో 410 మంది ఉద్యోగుల ప్రస్తావన ఉంది. మాకున్న సమాచారం ప్రకారం మొత్తం ఉద్యోగుల సంఖ్య 185 మాత్రమే. మిగిలిన వారి నియామకాలు ఈసీ ఆమోదం పొందాయా? ఏ ప్రాతిపదికన వారి ఎంపిక జరిగింది? వారి జీతాల వివరాలు తెలియజేయండి.
  • 77వ ఈసీ సమావేశం ప్రకారం.. జాబితాలో డె యిలీ వేజెస్‌ ఎంప్లాయీస్‌ తోపాటు 38 8 మందిని బోధన విభాగంలో ఎందుకు చూపారు?
  • ఈసీ సమావేశానికి ముందు కాపీనోట్‌ ఎందుకు ఇవ్వలేదు?
  • అసలు జీవో నంబరు 1222 ఆమోదం, 225 మంది ఉద్యోగుల నియామకాలను ఈసీ ఏనాడూ చేపట్టలేదు. ఒకవేళ చేపట్టి ఉంటే.. ఆ తీరా్మానం కాపీలను మాకు అందజేయండి.
  • గత పాలకమండలిలో జరిగిన అన్ని సమావేశాల మినట్స్‌తోపాటు యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టులూ అందజేయండి. ఈ విషయాలపై స్పష్టత వచ్చేవరకూ ఎలాంటి చర్యలు చేపట్టవద్దు.


నివృత్తి చేశాం
పాలకమండలి సభ్యులు నోట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి సందేహాలన్నీ నివృత్తి చేశాం.
– ప్రొఫెసర్‌ మల్లేశ్‌, వీసీ, ఎస్‌యూ
 

#Tags