National Law University: జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి వచ్చే నెలలో శంకుస్థాపన

నంద్యాల(సెంట్రల్‌): రూ.600 కోట్లతో కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం పనులకు వచ్చే నెలలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లో నీటి పారుదల సలహా మండలి సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరు సమావేశంలో పాల్గొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన 14 ఏళ్ల హయాంలో హంద్రీనీవా, గాలేరు నగరితో పాటు జిల్లాలోని పలు ప్రాజెక్టులకు అరకొర నిధులు విడుదల చేసి అసంపూర్తిగా వదిలేశారన్నారు. రైతాంగం బాధలు తెలిసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపుతో పాటు, మిగిలిన ప్రాజెక్టులకు వేలకోట్ల నిధులు కేటాయించి పూర్తి చేసి సీమ కరవుకు శాశ్వత పరిష్కారం చూపారని కీర్తించారు. వైఎస్‌ పూర్తి చేసిన ప్రాజెక్టుల వద్ద సెల్ఫీల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. వృద్ధుడైన సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు ఇంట్లో మనవళ్లతో కాలక్షేపం చేయకుండా ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులంతా తోడుదొంగల్లా మారారని విమర్శించారు. 130 కోట్లతో సిల్వర్‌జూబ్లీ కళాఽశాల నిర్మాణం, హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా 9 వేల ఎకరాల్లో ఓర్వకల్లు నోడ్‌తో పాటు 420 కోట్లతో శ్రీశైలం వెనుక జలాల నుంచి నీటి సరఫరా ఎవరు సాధించారో రాఘవులుకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. 776 కోట్లతో సంగమేశ్వరం–నంద్యాల, రూ.700 కోట్లతో నంద్యాల–జమ్మలమడుగు రహదారులతో పాటు రూ.250 కోట్లతో ఆదోని బైపాస్‌రోడ్డు, రూ.250 కోట్లతో దోర్నాల–కుంట డబ్లింగ్‌ పనులు కేంద్రంతో సఖ్యతగా ఉండి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిందన్నారు. కర్నూలు, నంద్యాలలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో 258 కిలోమీటర్ల మేర 39 రోడ్ల పనులు మంజూరయ్యాయని తెలిపారు. అంతేకాక రూ.30 కోట్లతో కర్నూలు మున్సిపల్‌ కార్యాలయ భవనం, రూ.130 కోట్లతో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, రూ.10 కోట్లతో ఆదోనిలో రోడ్లు, రూ.60 కోట్లతో గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 5.5 టీఎంసీలకు పెంచే పనులు సైతం పూర్తి చేశామన్నారు. నంద్యాల, ఆదోనిలో అధునాతన సౌకర్యాలతో మెడికల్‌ కాలేజీలు, తంగెడంచలో 250 ఎకరాల్లో ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని, ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు.
 

#Tags