AP Schools and Colleges Holidays : ఏపీలో తీవ్ర తుపాన్ ఎఫెక్ట్.. అన్ని విద్యా సంస్థలకు సెలవులు..!
రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. నెల్లూరు జిల్లా వైపు మిచాంగ్ తుపాను దూసుకొస్తుంది. ఐఎండీ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో డిసెంబర్ 4వ తేదీన జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సెలవు ప్రకటించారు. అలాగే ఇతర జిల్లాల్లో తుపాన్ తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా ..
తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రతో పాటు, రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది.
తుపాను ప్రభావిత జిల్లాలలో..
తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది.