Collector Dr Ravindra Goswami: నేను కూడా పరీక్షలో ఫెయిల్‌ అయ్యాను, కానీ ఇప్పుడు కలెక్టర్‌గా.. విద్యార్థులకు దిశానిర్దేశం

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందిన కోచింగ్‌ సెంటర్‌ అనగానే టక్కున గుర్తొచ్చేది కోటా. పొరుగు రాష్ట్రాల నుంచి ఏటా లక్షల మంది విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. అయితే చదువుల ఒత్తిడి తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతోన్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఇటీవలె జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం పరీక్షలో తప్పిన కొందరు విద్యార్థులు ఫెయిల్యూర్‌ను తీసుకోలేక బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తుంది. గతేడాది ఒక్క కోటాలోనే 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే చదవుల ఒత్తిడి వారిపై ఏ విధంగా ఉందో వేరే చెప్పక్కర్లేదు.

నేను కూడా ఫెయిల్‌ అయ్యాను..

ఈ క్రమంలో రాజస్థాన్‌ కలెక్టర్‌ డా. రవీంద్ర గోస్వామి విద్యార్థుల్లో పరీక్షలంటే భయం తగ్గించి మానసిక స్థైర్యం పెంచేందుకు తాజాగా తన ఫెయిల్యూర్‌ స్టోరీని లెటర్‌ రూపంలో పంచుకున్నారు. ''జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమే.. ఫెయిల్‌ అయితే జీవితాన్ని కోల్పోయినట్లు కాదు. ఇందుకు నేనే ఉదాహరణ. ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావడానికి ముందు నేనొక డాక్టర్‌ను. ఆ కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన ప్రీ మెడికల్‌ టెస్ట్‌(Pre Medical Test)లో నేనే కూడా ఫెయిల్‌ అయ్యాను.

అయినా నిరాశపడకుండా ‍మళ్లీ ‍ప్రయత్నించాను. జీవితంలో ఫెయిల్యూర్స్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని ఎంత బలంగా మన విజయం వైపు అడుగులు వేశామన్నది చాలా ముఖ్యం. అపజయం ఎదురైందని కుంగిపోయి కూర్చుంటే ఈరోజు నేను కలెక్టర్‌ అయ్యేవాడిని కాదు కదా. ఫలితం గురించి ఆలోచించకుండా నిజాయితీగా కష్టపడితే ఎప్పటికైనా విజయం వరిస్తుంది'' అంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

తల్లిదండ్రులు సైతం పిల్లలపై చదువుల గురించి ఒత్తిడి చేయొద్దని, మార్కులతోనే వాళ్ల టాలెంట్‌ను అంచనా వేయకూడదని సూచించారు. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ఆసక్తి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలను గౌరవించి వాళ్లను ప్రోత్సహిస్తే పిల్లలు మరింత రాణిస్తారని పేర్కొన్నారు. 
 

#Tags