Andhra Pradesh Skill Development Corporation- జాబ్‌మేళాతో ఇప్పటివరకు 45వేలమందికి ఉద్యోగాలు

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సురేష్‌కుమార్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ సమీపంలోని ఒక హోటల్‌లో మంగళవారం నిర్వహించిన ఇండస్ట్రీ స్టాక్‌ హోల్డర్స్‌ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. పరిశ్రమలకు అనుగుణంగా మానవ వనరులను సిద్ధం చేసేందుకు ఇప్పటికే స్కిల్స్‌ క్యాస్కేడింగ్‌ ఎకోసిస్టమ్‌ను స్వీకరించినట్లు వివరించారు.

జాబ్‌మేళాతో 45వేల ఉద్యోగాలు..
పరిశ్రమ ప్రాంగణంలో విద్యార్థులకు శిక్షణతోపాటు ఇండస్ట్రీ కస్టమైజ్డ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఐసీఎస్‌టీపీ)ను అమలు చేస్తున్నామన్నారు. జాబ్‌ ఫెయిర్‌ అండ్‌ శిక్షణ విభాగం ప్రభుత్వ సలహాదారుడు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ప్రతి జిల్లాలో ప్రతి నెల రెండు జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 45,000 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. రానున్న కాలంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. 

ఏపీ ఎస్‌ఎస్‌ఐడీసీ సీఈవో డాక్టర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రీ కస్టమైజ్డ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఐసీఎస్‌టీపీ)ను అమలు చేసేందుకు మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను పరిశ్రమల ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా రిటైల్‌ స్కిల్‌ సెక్టార్‌ అసోసియేషన్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సంస్థతో శిక్షణ కోసం అవగాహన ఒప్పందం జరిగింది.

యువత కోసం డీఎల్‌ఐసీ కార్యక్రమం
ఆర్‌ఏఎస్‌సీఐ ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ జేమ్స్‌ రాఫెల్‌ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. మొదటి దశలో 500 మంది యువత కోసం డీఎల్‌ఐసీ కార్యక్రమాన్ని అమలు చేస్తామని సంస్థ ప్రకటించింది. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, ఏపీఎస్‌ఎస్‌ డీసీ అండ్‌ న్యాక్‌ ఈడీ కె.దినేష్‌ కుమార్‌, ఐటీఎపీ హెడ్‌ లక్ష్మి, ఇండస్ట్రియల్‌ కంపెనీస్‌కు సంబంధించిన 124 మంది హెచ్‌ఆర్‌ డిపార్టుమెంట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

#Tags