Republic Day 2024: ఏపీ విద్యా సంస్కరణలు.. దేశానికి దిక్సూచిగా..

  • రిపబ్లిక్‌ డే పరేడ్‌కు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక శకటం
  • డిజిటల్‌ ఎడ్యుకేషన్, సీబీఎస్‌ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్‌ స్కిల్స్, 
  • సబ్జెక్ట్‌ టీచర్‌ వివరిస్తూ రూపకల్పన
  • ఢిల్లీ వేడుకల్లోనూ రాష్ట్ర విద్యా సంస్కరణల ఆధారంగా శకటం 

సాక్షి, అమరావతి: సాధారణంగా ఏ ప్రభుత్వమైనా విద్యా రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. ఇందుకు చెప్పుకోదగ్గ మొత్తం కూడా ఖర్చుపెట్టదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగున్నరేళ్లుగా విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమేగాక, ఖరీ­దైన ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ వంటి సిల­బస్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయాలని సంకల్పించింది. ఈ కాలంలో రాష్ట్రంలో విద్యా రంగం సమూలంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు ప్రతి పల్లెకు చేరు­వయ్యాయి.

కొద్దిమందికి మాత్రమే పరిమితమైన సీబీఎస్‌ఈ సిలబస్‌ సైతం ఇప్పుడు పేద పిల్లలకు అందు­తోంది. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో చ­దువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు డిజిటల్‌ విద్య అందుబాటులోకి వచ్చింది. త్వరలో అత్యంత ఖరీదైన ఐబీ సిలబస్‌ సైతం ఉచితంగా అందించనున్నారు. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి. ఇలా పేద పిల్ల­లకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సంస్కరణలకు అద్దంపట్టేలా గణ­తంత్ర దినోత్సవ వేడుల్లో ప్రదర్శించే శకటాన్ని వి­ద్యా­శాఖ రూపొందించింది. ఈ నేపథ్యంలో.. వి­ద్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత.. అమ­లుచేస్తున్న సంస్కరణలపై ప్రత్యేక కథనం.. 

విద్యా సంక్షేమానికి భారీగా నిధులు..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను గ్లోబల్‌ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ల­క్ష్యం­గా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు ది­క్సూచిగా నిలిచింది. ఇందులో భాగంగా..

  • పేద తల్లులు తమ పిల్లలను బడికి పంపినందుకు గాను గత నాలుగేళ్లలో ‘జగనన్న అమ్మఒడి’ ద్వారా 42,61,965 మంది ఖాతాల్లో రూ­.26,349.50 కోట్లు ప్రభుత్వం జమచేసింది. 
  • మనబడి నాడు–నేడు పథకం ద్వారా అన్ని ప్ర­భుత్వ పాఠశాలల్లో రూ.17,805 కోట్ల వ్యయంతో, మూడు దశల్లో 12 మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో దాదాపు 32 వేల పాఠశాలల రూపురేఖలు మారాయి. 
  • పాఠశాల తెరిచిన మొదటిరోజే ప్రతి విద్యార్థికి ‘జగనన్న విద్యాకానుక’గా ఉచితంగా బైలింగువల్‌ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలీతో మూడు జతల యూనిఫాం క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగుతో పాటు హైస్కూల్‌ విద్యా­ర్థు­లకు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌–తెలుగు డిక్షనరీ, ఎలి­మెంటరీ విద్యార్థులకు పిక్టోరియల్‌ డిక్షనరీ అందించి ప్రైవేటు స్కూలు విద్యార్థుల కంటే మిన్నగా బడికి వెళ్లేలా ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. 
  • బాలికా విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత పా­ఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసి మండలానికి రెండు జూనియర్‌ కాలేజీలు ఏర్పాటుచేసి అందులో ఒకటి బాలికలకు కేటాయించింది.  

ఇటు ‘గోరుముద్ద’.. అటు డిజిటల్‌ చదువులు..

  • దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు చిక్కీ, రా­గిజావతో సహా 16 రకాల పదార్థాలతో ‘జగనన్న గోరుముద్ద’ను అందిస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,910 కోట్లు అ­ద­నంగా ఖర్చుచేస్తోంది. గోరుముద్ద పథకం కింద ఇప్పటిదాకా రూ.6,262 కోట్లు ఖర్చుచేశారు. 
  • అలాగే, ఏటా 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రూ.15 వేల విలువైన బైజూస్‌ కంటెంట్‌తో రూ.17,500కు పైగా మార్కెట్‌ విలువగల ట్యాబ్‌ను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. గత రెండేళ్లలో మొత్తం 9,52,925 ట్యాబులు ఉచితంగా అందించిన ఘనత దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరిగింది. 
  • 62 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లను, స్మార్ట్‌ టీవీలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లోను, తరగతి గదుల్లో అమర్చిన ఐఎఫ్‌బీలు, స్మార్ట్‌ టీవీల్లో బైజూస్‌ కంటెంట్‌ ద్వారా బోధన చేపట్టారు.  

ఫలితాన్నిచ్చిన విద్యా సంస్కరణలు..
ఈ సంస్కరణల ఫలితంగా గత విద్యా సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే పది, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించారు. ఇలా ప్రతిభ కనబరిచిన 22,710 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’గా గుర్తించి వారిని సత్కరించి ప్రభుత్వం ప్రోత్సహించింది. 

విద్యా సంస్కరణల శకటం
ఆంధ్రప్రదేశ్‌లో అమలు­చేస్తు­న్న విద్యా సంస్కరణలను చాటిచెబుతూ పాఠశాల విద్యా­శాఖ రూపొందించిన శకటం శుక్రవారం విజయవాడలో జరిగే గణతంత్ర వేడుకల్లో సందడి చేయనుంది. గత నాలు­గున్నరేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లోను, విద్య, విద్యార్థుల్లో తీసుకొచ్చిన మార్పులతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక శకటాన్ని రూపొందించింది. అలాగే, ఢిల్లీలో జరిగే వేడుకల్లో సైతం ఏపీ విద్యా సంస్కరణల ఆధారంగా రూపొందించిన శకటం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది. ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’ విధానంతో ఈ వాహనం దేశానికి ఆంధ్రప్రదేశ్‌ విద్యా విధానాన్ని పరిచయం చేయనుంది.

#Tags