Medical education: వైద్య విద్యకు శ్రీకారం
ఏలూరు టౌన్: ఏలూరు సరికొత్త శోభను సంతరించుకుంది. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ వైద్య కళాశాల సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంలో భాగంగా అధునాతన వసతులతో కళాశాల భవనం ముస్తాబైంది. ఏలూరు పాతబస్టాండ్ సమీపంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద భవనం తళుక్కుమంటూ మెరుస్తోంది. ఇక్కడ శుక్రవారం నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. సీట్ల భర్తీ ప్రక్రియకు సంబంధించి మొదటి కౌన్సెలింగ్‌లోనే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష ఆదరణ లభించింది.
పరిచయ కార్యక్రమంతో.. కళాశాలలో శుక్రవారం ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు విద్యార్థులతో ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ 150 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ చేపట్టింది. విద్యార్థులకు ఏలూరు జీజీహెచ్‌లో హాస్టల్ వసతి కల్పించారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా హాస్టళ్ల నిర్మాణం చేపట్టారు. హాస్టల్ నుంచి కళాశాల వరకు విద్యార్థులను చేరవేసేందుకు ఆర్టీసీ బస్సు ఏర్పాటుచేశారు. ఉదయం, సాయంత్రం రెండు సార్లు బస్సు నడుస్తుంది.
సీట్ల భర్తీ
జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలను అనుసరించి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్య సీట్ల భర్తీ చేపట్టింది. 150 ఎంబీబీఎస్ సీట్లకు తొలివిడతలో 112 సీట్లు భర్తీ చేశారు. ఆల్ ఇండియా కేటగిరీలో 22 సీట్లకు 15 మంది, రాష్ట్ర కన్వీనర్ కోటాలో 64 సీట్లకు 61 మంది, బీ కేటగిరీలో 43 సీట్లలో 34 మంది, సీ కేటగిరీలో 19 సీట్లకు ఇద్దరు విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మరో రెండు సీట్లు స్పోర్ట్స్, ఎన్‌సీసీ, అమరవీరుల కోటాలో భర్తీ చేస్తారు. రెండో, మూడో విడత కౌన్సెలింగ్‌లు నెలాఖరులో పూర్తిచేస్తారు. తొలివిడత ప్రవేశాలు పొందిన వారిలో 64 మంది బాలికలు, 48 మంది బాలురు ఉన్నారు.
ఫీజులు ఇలా..
తొలుత 15 శాతం (22) సీట్లను ఆల్ ఇండియా నీట్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. ఇక మిగిలిన 128 సీట్లలో 50 శాతం (64 సీట్లు) రాష్ట్ర కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ రెండు కేటగిరీ విద్యార్థులు ఏడాదికి రూ.15 వేలు ఫీజు చెల్లించాలి. ఇక ‘బీ’ కేటగిరీలో 43 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా పేర్కొంటూ భర్తీ చేస్తారు. వీటిని పొందిన విద్యార్తులు ఏడాదికి రూ.12 లక్షల ఫీజు చెల్లించాలి. చివరగా ‘సీ’ కేటగిరీలో 19 సీట్లను ఎన్‌ఆర్‌ఐలకు కేటాయిస్తారు. ఈ కేటగిరీలో రూ.20 లక్షల ఫీజు చెల్లించాలి.
అన్ని రకాల ఏర్పాట్ల్లూ సిద్ధం
మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యింది. 112 మంది ప్రవేశాలు పొందారు. శుక్రవారం మొదటి రోజు విద్యార్థుల పరిచయ వేదిక ఉంటుంది. వైద్య విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నాం. అన్నిరకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు. నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో వసతులు అందుబాటులోకి వస్తాయి.– డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్, ప్రిన్సిపాల్, ఏలూరు వైద్య కళాశాల