CM Ys jagan: మెడికల్ కాలేజీని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ ఎప్పుడంటే..
ఏలూరు టౌన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న నూతనంగా ఏర్పాటైన ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలను లాంఛనంగా ప్రారంభించి, ఎంబీబీఎస్ మొదటి ఏడాది విద్యార్థులను ఉద్ధేశించి సందేశం ఇస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ బీ.లావణ్యవేణి తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం నుంచి రాష్ట్రంలోని ఐదు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తున్న తరుణంలో ఏర్పాట్లను జేసీ లావణ్యవేణి బుధవారం పరిశీలించారు. ఏలూరులోని నూతన వైద్య కళాశాలను వర్చువల్‌గా ప్రారంభిస్తూ వైద్య విద్యార్థులతో సీఎం ముఖాముఖి సంభాషించేలా ఏర్పాట్లు చేశామని జేసీ తెలిపారు. సీఎం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్ణీత సమయానికే పూర్తి చేసి ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. తొలి బ్యాచ్ వైద్య విద్యార్థులతో జేసీ లావణ్యవేణి కొద్దిసేపు ముచ్చటించారు. వైద్య కళాశాలలో సౌకర్యాలు, ల్యాబ్‌లు పరిశీలించారు. కొత్తగా అన్ని సౌకర్యాలు కల్పించామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీవో ఎస్‌కే ఖాజావలి, డీఎంహెచ్‌వో డాక్టర్ శర్మిష్ట, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఏలూరు తహసీల్దార్ సోమశేఖర్, ఏపీఎంఎస్‌ఐడీసీ కోఆర్డినేటర్ సునీల్‌కుమార్, ఈఈ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.