TET Exam: TETపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
సూపర్‌బజార్(కొత్తగూడెం): టెట్(టీచర్స్ ఎలిజి బిలిటీ టెస్ట్) నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. ఈ నెల 15న నిర్వహించే టెట్‌పై కలెక్ట్టరేట్‌లో శుక్రవారం విద్య, వైద్య, పోలీస్, పంచాయతీ, మున్సిపల్, మిషన్ భగీరథ, విద్యుత్, ట్రెజరీ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు రెండో పేపర్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం పరీక్షకు 37 కేంద్రాలు, సాయంత్రం పరీక్షకు 29 కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 8,717 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వివరించారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్ష నిర్వహణకు 380 మంది ఇన్విజిలేటర్లు, 148 మంది హాల్ సూపరింటెండెంట్లు, 37 మంది శాఖాపరమైన అధికారులు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 9 మంది రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులకు సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంను సంప్రదించాలని సూచించారు. ఏఎస్పీ విజయబాబు, డీఈఓ వెంకటేశ్వరాచారి, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ స్వామి, ఆర్టీసీ డీవీఎం భవానీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.