Guest Lecturer Jobs: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
రామగిరి(నల్లగొండ): నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో 2023– 24 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాణిజ్యశాస్త్రం 1, బీబీఏ ఈ కామర్స్ 1 పోస్టుకు పీజీలో 55 శాతం ఉత్తీర్ణత ఉండి నెట్, సెట్, పీహెచ్‌డీ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈనెల 11 వరకు దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలని, 12న ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
10న కోర్టు ఉద్యోగ పరీక్షలు
రామగిరి(నల్లగొండ): హైకోర్టులోని కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపియిస్ట్ ఉద్యోగాలకు 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని ఎస్‌పీఆర్ స్కూల్‌లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
నల్లగొండ: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మహిళలు, శిఽశు దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే రాష్ట్రీయ దివ్యాంగుల సాధికారిత అవార్డు– 2023కి దివ్యాంగులు, దివ్యాంగుల కోసం పని చేస్తున్న సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈమేరకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీ కృష్ణవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ ఉద్యోగి, ఉత్తమ స్వయం ఉద్యోగి, ఉత్తమ వ్యక్తిగత సామాజిక కార్యకర్త, ఉత్తమ క్రీడా వ్యక్తి, సంస్థ/ఎన్‌జీఓ, ఉత్తమ యజమాని, ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగులకు అందుబాటులో ఉండే ఉత్తమ విభాగం, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ దివ్యాంగుల కేటగిరీ వారీగా అవార్డులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, ఽశిఽశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ నల్లగొండలో సంప్రదించాలని తెలిపారు.
బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించాలి
మిర్యాలగూడ టౌన్: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో బరువు తక్కువ వారిని గుర్తించి, అవసరమైన పౌష్టికాహారాన్ని అందించాలని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కృష్ణవేణి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని వాసవి భవన్‌లో నిర్వహించిన మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్టు సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రాలకు వస్తున్న పిల్లల్లో బరువు తక్కువ, ఎత్తు ఉన్న వివరాలను అంగన్‌వాడీ టీచర్లు గుర్తించాలన్నారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల గ్రోత్ చార్ట్‌ను ఉంచి కేంద్రానికి వచ్చే తల్లిదండ్రులకు చూపించాలన్నారు. పిల్లల లింగ నిర్ధారణ పరీక్షలు నియంత్రించాలని, బ్రూణ హత్యలు జరగకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీహెచ్‌ఈడబ్ల్యూ సునిత, మిర్యాలగూడ అర్బన్ సీడీపీఓ రేఖ మమత, సూపర్‌వైజర్లు రేవతి, మాధవి, రాధిక, నజిమాబేగం, లీలాకుమారీ, పద్మ, సుశీల, జ్యోతి, డీపీఏ సైదమ్మ, బ్లాక్ కో ఆర్డినేటర్ కవిత, అంగన్‌వాడీ టీచర్లు తదితరులున్నారు.
9 నుంచి రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు
రాజాపేట : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల తొమ్మిదవ రాష్ట్రస్థాయి క్రీడా (బాలురు) పోటీలు ఈనెల 9నుంచి రాజాపేటలోని గురుకుల పాఠశాలలో ప్రారంభం కానున్నాయి. కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెనికాయిట్, క్యారమ్స్, చెస్‌లో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 7 జోన్ల నుంచి 1,171 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటారని యాదాద్రి రీజిన్ ఆర్‌సీఓ, క్రీడల ఓవరాల్ ఇన్‌చార్జి శ్రీమతి రజనీ తెలిపారు. క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.