Jobs in Govt Degree College: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులు
రాయచోటిటౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీషు గెస్ట్ అధ్యాపకుడిగా పని చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ హర్షలతా పంకజ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు.ఎస్‌ఈటీ, ఎన్‌ఈటీ, పీహెచ్‌డీ చేసిన వారు అర్హులన్నారు. అన్ని సర్టిఫికెట్లతో ఈనెల 7వ తేదీ ఉదయం కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.
చదవండి: Andhra Pradesh Govt Jobs: 86 పోస్టులకు 9,100 దరఖాస్తులు
8న విలువిద్య జట్టు ఎంపిక
కడప స్పోర్ట్స్: కడపలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో ఈ నెల 8న ఉమ్మడి వైఎస్సార్ జిల్లా స్థాయి విలువిద్య జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విలువిద్య సంఘం అడ్‌హక్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, రాచవీటి తేజేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో ఉదయం పది గంటలకు జరిగే ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు వేంపల్లి పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 2003 జనవరి తర్వాత పుట్టిన క్రీడాకారులను జూనియర్ విభాగానికి ఎంపిక చేస్తామన్నారు.
7, 8 తేదీల్లో క్విజ్ పోటీ
కడప కల్చరల్: కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆద్వర్యంలో శని, ఆదివారాల్లో సీరతున్నబీ క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ముక్తార్ అమ్మద్ తెలిపారు. వైఎస్సార్ జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలోని మదరసాల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మదరసా విద్యార్థులకు శనివారం ఉదయం, పాఠశాల, కలశాల విద్యార్థులకు ఆదివారం పోటీలను నిర్వహిస్తామన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులను సీనియర్లుగా పరిగణించి విజేతలైన వారికి మొదటి బహుమతి రూ.10 వేలు, రెండవ బహుమతి రూ. 5 వేలు, మూడో బహుమతి రూ. 3 వేలు నగదు ఇవ్వనున్నట్లు తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు జూనియర్ గ్రూప్స్‌గా పరిగణించి విజేతలైన వారికి మొదటి బహుమతిగా రూ. 5 వేలు, రెండవ బహుమతిగా రూ. 3 వేలు, మూడవ బహుమతిగా రూ. 2 వేలు అందజేస్తామని తెలిపారు. ప్రతి తరగతిలో ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు విభాగాలలో జూనియర్లు, సీనియర్లకు అందజేస్తామన్నారు. కడప నగరంలోని అల్మాస్‌పేటలోగల జామియా తుస్సాలిహాత్ మదరసాలో ఈ పోటీ నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల వారు 99857 73395 నెంబరులో సంప్రదించాలన్నారు.