Andhra Pradesh Govt Jobs 2023: తొమ్మిది మందికి కారుణ్య నియామక పత్రాలు
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ వివిధ కారణాలతో మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు సోమవారం జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం–స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా కారుణ్య నియామకం కింద తొమ్మిది మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. వీరిలో ఒక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోని బాధిత కుటుంబ సభ్యునికి ఉద్యోగ నియామక పత్రం అందించినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. తొమ్మిది మందిలో ఐదుగురిని జూనియర్ సహాయకులుగా, నలుగురిని ఆఫీస్ సబార్డినేట్‌లుగా నియమిస్తూ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వారీగా ఖాళీల సంఖ్య రోస్టర్, సీనియారిటీ ప్రకారం అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చామని కలెక్టర్ కృతికాశుక్లా వివరించారు. ఉద్యోగం పొందిన అభ్యర్థులు చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా అభ్యర్థులు సూచించారు. జేసీ ఇలక్కియ, ఇన్‌చార్జి డీఆర్వో కె.శ్రీరమణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి జీఎస్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
చదవండి: Mega Job Mela: రేపు వైఎస్సార్ మెగా జాబ్ మేళా.. 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు